logo

శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం

దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

Published : 19 Apr 2024 06:04 IST

మంత్రి జూపల్లి కృష్ణారావు

గోపాల్‌పేట, న్యూస్‌టుడే : దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి గోపాల్‌పేటలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ కూడలి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులను అధికసంఖ్యలో గెలిపించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకుందామని అన్నారు. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ శాసనసభ ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ను తిట్టి, లోక్‌సభ ఎన్నికల్లో భారాసలో చేరి ఆయన్ను పొగుడుతూ పోటీ చేస్తున్నారని విమర్శించారు. భారాస ఎంపీగా ఉన్న రాములు భాజపాలో చేరి కుమారుడిని ఆ పార్టీ ఎంపీగా పోటీ చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. సుమారు 30ఏళ్ల పాటు కాంగ్రెస్‌పార్టీలోనే ఉంటూ సేవలు అందిస్తున్న మల్లురవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికలు పూర్తవగానే ఇందిరమ్మ కమిటీలువేసి గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడతామని తెలిపారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి మెజారిటీ ఓట్లు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి మల్లురవి ప్రసంగిస్తూ దేశంలో భాజపాను గద్దెదించాలని, రాహుల్‌గాంధీని ప్రధానిగా చేసి నిరుద్యోగ, వ్యవసాయరంగ సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ శివసేనారెడ్డి, మాజీమంత్రి చిత్తరంజన్‌దాస్‌ తదితరులు ప్రసంగించారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు సత్యశీలారెడ్డి, పర్వతాలుయాదవ్‌, పర్వతాలు, సతీశ్‌, రమేశ్‌, మహేశ్‌, చీర్ల చందర్‌, శివన్న, చంద్రశేఖర్‌, సురేష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి నుంచి రేవల్లి, గోపాల్‌పేట మండలాల కార్యకర్తలతో ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా గోపాల్‌పేటకు వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని