logo

అయిదేళ్లలో కుమ్ముడు

గుట్టుగా దాచుకున్న సంపదను అభ్యర్థులు నామపత్ర సమర్పణ వేళ కొంతైనా వెల్లడించాల్సి వచ్చింది. నామపత్ర సాక్షిగా వైకాపా అభ్యర్థులు భారీగానే ఆస్తులు పోగేసుకున్నట్టు తేటతెల్లమైంది. వలస పక్షుల్లా వాలిన మేరుగు నాగార్జున, చెవిరెడ్డి మూడు రెట్లు, మంత్రి సురేష్‌ రెట్టింపు సంపద కూడబెట్టుకున్నారు.

Updated : 02 May 2024 09:34 IST

మేరుగు, చెవిరెడ్డి ఆస్తి మూడు రెట్లు
సురేష్‌ సంపద రెట్టింపు
భారీగా పోగేసుకున్న వైకాపా అభ్యర్థులు 
తెదేపా నేతలపై అక్రమ కేసుల బాదుడు
నామపత్రం సాక్షిగా వాస్తవాలివీ
న్యూస్‌టుడే, యర్రగొండపాలెం

గుట్టుగా దాచుకున్న సంపదను అభ్యర్థులు నామపత్ర సమర్పణ వేళ కొంతైనా వెల్లడించాల్సి వచ్చింది. నామపత్ర సాక్షిగా వైకాపా అభ్యర్థులు భారీగానే ఆస్తులు పోగేసుకున్నట్టు తేటతెల్లమైంది. వలస పక్షుల్లా వాలిన మేరుగు నాగార్జున, చెవిరెడ్డి మూడు రెట్లు, మంత్రి సురేష్‌ రెట్టింపు సంపద కూడబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ తరచూ పేదలు, పెత్తందార్లు అంటూ వల్లె వేస్తున్న తరుణంలో ఆ పార్టీ అభ్యర్థులందరూ రూ.కోట్లకు పడగలెత్తిన వారు కావడం విశేషం. అయిదేళ్ల క్రితం వరకూ కేసుల ముఖం చూడని తెదేపా నాయకులపై, జగన్‌ ప్రభుత్వం కేసులు బనాయించిన విషయం కూడా నామపత్రాల్లో వెల్లడైంది.

సార్వత్రిక సమరానికి రోజులే మిగిలివున్న తరుణంలో తెదేపా, వైకాపా అభ్యర్థులు ఇటీవలే  నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వారి నామపత్రాలు పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలతో పాటు వైకాపా అభ్యర్థుల ఆర్థిక శక్తి కూడా తేటతెల్లమవుతోంది.


బాలినేని.. కారులేదంటే నమ్మాలి

రెండుసార్లు కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన ఒంగోలు  వైకాపా అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒక్క కారు కూడా లేదు. ఈయన ఆస్తి మాత్రం 2019కి ఇప్పటికీ రెట్టింపైంది. ఇక కుటుంబ సభ్యుల పేర కూడా బాగానే ఉన్నట్లు తెలిసింది. జిల్లాలోనే అప్పులు లేని ఎమ్మెల్యే అభ్యర్థి!


మంత్రివర్యా.. బాగుందయ్యా

గతంలో వై.పాలెం ఎమ్మెల్యేగా పోటీచేసి మంత్రి కొలువు దక్కించుకున్న ఆదిమూలపు సురేష్‌ ఆస్తులు 2019తో పోల్చితే రెట్టింపయ్యాయి. ఆ నియోజకవర్గంలో వ్యతిరేకత మూటగట్టుకోవడంతో ఆయన నియోజకవర్గం మారి కొండపిలో వాలిపోయి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు.  


బాగానే చెవికెక్కింది

ఒంగోలు పార్లమెంట్‌ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి   2019లో రూ.3.22 కోట్ల ఆస్తి ఉండగా 2024 నాటికి రూ.11.78 కోట్లకి చేరింది.


బూచేపల్లికి వందల ఎకరాలు..

దర్శి వైకాపా అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి 120 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వీటిలో 2019 నుంచి ఇప్పటివరకు సుమారు 54 ఎకరాలు కొనుగోలు చేయగా, మిగతాది వారసత్వం కింద వచ్చింది. కొనుగోలు చేసిన వాటిలో ఎకరం రూ.2.5కోట్ల విలువ చేసే భూమి సైతం ఉంది.


మూడు రెట్లు ‘మెరుగు’పడ్డారు

ఎన్నికల వేళ సంతనూతలపాడులో వాలిన వైకాపా మంత్రి మేరుగు నాగార్జున కూడా అయిదేళ్లలో బాగానే సంపద పోగేశారు. 2019 నామినేషన్‌లో తన ఆస్తులు రూ.5.31 కోట్లుగా ఆయన ప్రకటించారు. 2024 నాటికి ఆయన సంపద రూ.14.03 కోట్లకు చేరడం గమనార్హం.


వైకాపా వచ్చాక ఎడాపెడా కేసులు

వైకాపా ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఎడాపెడా కేసులు నమోదు చేశారు. తెదేపా అభ్యర్థుల నామపత్రాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

  • దామచర్ల జనార్దన్‌పై 18 కేసులుండగా అందులో 11 వైకాపా ప్రభుత్వం వచ్చాక నమోదైనవి.
  • కొండపి అభ్యర్థి స్వామిపై 11 కేసులకు గాను వైకాపా వచ్చాక నమోదైనవి 10.
  • ఎస్‌.ఎన్‌.పాడు అభ్యర్థి విజయ్‌కుమార్‌పై 5 కేసులు నమోదయ్యాయి.
  • ఉగ్రనరసింహారెడ్డిపై 3, కందుల నారాయణరెడ్డిపై 09, ముత్తుముల అశోక్‌రెడ్డిపై 1, గూడూరి ఎరిక్షన్‌బాబుపై 05 కేసులు నమోదయ్యాయి(ఇవన్నీ వైకాపా వచ్చాకే!).
  • కోడ్‌ ఉల్లంఘనులు: వైకాపా అభ్యర్థులపై తాజాగా ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.

కుందురుకు ఒక్క ఎకరమూ లేదట..

  • గిద్దలూరు వైకాపా అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి, ఆయన సోదరుడి అవినీతిపై ఆ పార్టీ నాయకులే ఆరోపణాస్త్రాలు సంధించారు. అయితే ఆయనకు కూడా ఎలాంటి భూమి లేదని నామపత్రం దాఖలు చేశారు.
  • కొండపి తెదేపా అభ్యర్థి డోలా బాలవీరాంజనేయస్వామికి అతి తక్కువ ఆస్తిపాస్తులున్నాయి.
  • మార్కాపురం తెదేపా అభ్యర్థి నారాయణరెడ్డికి వ్యవసాయ భూమి లేదు.

ఆభరణాలూ ఉన్నాయ్‌

  • దర్శి తెదేపా అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి 2.72 కిలోల బంగారంతోపాటు 6 కిలోల వెండి ఉంది.
  • ఒంగోలు తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్‌కు 2 కిలోల బంగారం, మార్కాపురం వైకాపా అభ్యర్థి అన్నా రాంబాబుకు 1.9 కిలోల బంగారం, 15 కిలోల వెండి ఉంది.
  • మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉగ్రనరసింహారెడ్డికి కిలోకు పైగా బంగారం ఉంది.
  • ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కుటుంబ సభ్యుల పేర్లతో అత్యధికంగా 34 జీవిత బీమా పాలసీలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని