icon icon icon
icon icon icon

అమాత్యుల ఆపసోపాలు

జగన్‌ ప్రభుత్వ వ్యతిరేక పవనాల ఉద్ధృతి క్రమేణా పెరుగుతుండటంతో  ఉత్తరాంధ్రలో మంత్రులు కూడా ఎదురీదుతున్నారు.

Updated : 02 May 2024 07:54 IST

ఈ ఎన్నికల్లో ధర్మాన, బొత్స, అమర్‌నాథ్‌ ఎదురీత
పలాసలో గట్టిపోటీ ఎదుర్కొంటున్న అప్పలరాజు
సభాపతి సీతారాం ఉక్కిరిబిక్కిరి
నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయలేదు
పైగా అధికార పార్టీ నేతల అరాచకాలు
జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
అయినా డబ్బులు పంచి, గట్టెక్కేస్తామనే ధీమా
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

జగన్‌ ప్రభుత్వ వ్యతిరేక పవనాల ఉద్ధృతి క్రమేణా పెరుగుతుండటంతో  ఉత్తరాంధ్రలో మంత్రులు కూడా ఎదురీదుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో నేతలు, వారి బంధువర్గం, అనుచరగణం చేసిన అవినీతి అక్రమాలూ వెంటాడుతున్నాయి. పైగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలూ లేవు. ప్రజలను మెప్పించే స్థాయి ఘనకార్యాలూ చేయలేదు. అయిదేళ్ల చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం? నియోజకవర్గంలో సమస్తం ప్రజలను పీడించిన రాజ్యాధికారం అని ప్రతి ఊరూ ఘోషిస్తోంది. కేవలం డబ్బులు పంచి.. చివరి మూడు, నాలుగు రోజులు కొనుగోళ్ల పర్వం సాగించి బయటపడాలని మంత్రులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ప్రజావ్యతిరేక పవనాల్లో ఆ ప్రయత్నాలు ఫలించడమూ ప్రశ్నార్థకంగానే ఉంది. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌ ఎదురీదుతున్నారు. మరో మంత్రి సీదిరి అప్పలరాజు హోరాహోరీ పోరాడుతున్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోవడంతో వీరా అమాత్యులు? ఇలాంటివారా నాయకులు అంటూ ఉత్తరాంధ్ర ప్రజానీకం నిలదీస్తోంది.


‘ధర్మా’..న గెలవడం కష్టమే!

మంత్రి: ధర్మాన ప్రసాదరావు
కూటమి అభ్యర్థి: గొండు శంకర్‌ (తెదేపా)
నియోజకవర్గం: శ్రీకాకుళం శాసనసభ

సీనియర్‌ నేత, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎన్నికల బరిలో ఆపసోపాలు పడుతున్నారు. మంత్రి పదవి ఇవ్వలేదని రెండున్నరేళ్లు బయటకే  రాలేదు. కరోనా సమయంలోనూ ప్రజల్ని పట్టించుకోలేదు. రెండో దఫాలో అమాత్య పదవి దక్కిన తర్వాతే అడుగు బయటపెట్టారు. మంత్రి పదవి లేకపోతే ప్రజలు కనిపించరా అని శ్రీకాకుళం ప్రజలు నిలదీస్తుండటం ఈ ఎన్నికల్లో ధర్మానకు ప్రతిబంధకంగా మారింది. శ్రీకాకుళం నడిబొడ్డున ఉన్న 2.14 ఎకరాల భూమి ఆక్రమణల వ్యవహారం మరో కీలకాంశం. శ్రీకాకుళం, ఆమదాలవలస మధ్య 15 కి.మీ. రోడ్డు నిర్మాణం అయిదేళ్లలో పూర్తి చేయకపోవడం, ఈ రహదారిపై వరుస ప్రమాదాలు జరిగి ఏకంగా 24 మంది మరణించిన ఘటనలు ధర్మానకు పెద్ద మైనస్‌. స్టేడియం, ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల నిర్మాణం పూర్తి చేయలేదు. ఇవన్నీ ఎన్నికల సమయంలో ప్రజల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

తెదేపా నుంచి యువకుడైన గొండు శంకర్‌ను బరిలో నిలిపారు. ఆయన రెండేళ్లుగా అన్న క్యాంటీన్‌ నిర్వహిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నారు. ఆయన కుటుంబం రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉంది. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు. చివరి నిమిషంలో లక్ష్మీదేవికి అభ్యర్థిత్వం నిరాకరించిన తెదేపా.. శంకర్‌ను బరిలో నిలిపింది. లక్ష్మీదేవి ఈ ఎన్నికల్లో నిశ్శబ్దంగా ఉండిపోతుండటంతో ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని ధర్మాన వ్యూహాలు రచిస్తున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు లక్ష్మీదేవి, అప్పలనర్సయ్యలతో మాట్లాడారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, తెదేపా నేత కూన రవికుమార్‌, గొండు శంకర్‌లు కలిసి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌తో సమావేశమయ్యారు. ధర్మాన చివరి మూడు రోజుల ధన మంత్రాంగంతో పై చేయి సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత, ధర్మానపై ఉన్న అసంతృప్తి ఫలితాన్ని ఎటు వైపు నిలబెడతాయో చూడాలి.


విద్యామంత్రి ఎదురీత

మంత్రి: బొత్స సత్యనారాయణ
కూటమి అభ్యర్థి: కళా వెంకటరావు (తెదేపా)
నియోజకవర్గం: చీపురుపల్లి శాసనసభ (విజయనగరం జిల్లా)

సీనియర్‌ నేత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకూ కష్టకాలమే. చీపురుపల్లి నియోజకవర్గంలో స్థానికులకు అందుబాటులో ఉండరు. ఏదైనా కార్యక్రమం ఉంటే తప్ప ఇక్కడికి రారు. ఇక్కడి రాజకీయం అంతా ఆయన మేనల్లుడు, విజయనగరం జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) చేతిలోనే ఉంది. చిన్న శ్రీను వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలున్నాయి. నియోజకవర్గంలో భూఆక్రమణలు ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయి. అధికార పార్టీ కీలక నేత ఒకరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను బెదిరించి వెంచర్లను ఆక్రమించుకోవడం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టింది. సీనియర్‌ మంత్రిగా బొత్స మార్కు అభివృద్ధి ఎక్కడా కనిపించదు. చీపురుపల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంఘాన్ని ఏపీడీసీఎల్‌లో విలీనం చేయడంపై ప్రజల్లో అసంతృప్తి పెంచింది. మేనల్లుడు మజ్జి శ్రీనివాసుతో కుటుంబంలో వచ్చిన విభేదాలూ కొంత ప్రభావం చూపుతున్నాయంటున్నారు. వైకాపా నుంచి తెదేపాలోకి పెరిగిన వలసలూ బొత్సకు ఇబ్బందికరమే.

తెలుగుదేశం నుంచి కిమిడి కళా వెంకటరావు చీపురుపల్లి అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయన సోదరుడి కుమారుడు కిమిడి నాగార్జున ఇక్కడ అభ్యర్థిత్వం ఆశించారు. వెంకటరావు నామినేషన్‌ రోజు నాగార్జున సైతం హాజరయ్యారు. వీరిద్దరూ జట్టుగా కదిలితే ఎదురులేదన్న అభిప్రాయం ప్రజల్లో వినిపిస్తోంది. బొత్స, వెంకటరావులిద్దరిదీ ఒకే సామాజికవర్గం. గరివిడి, గుర్ల, మెరకముడిదాం మండలాలు ఇక్కడ కీలకం. కిందటి ఎన్నికల్లో బొత్స గెలుపునకు ప్రధాన పాత్ర పోషించిన మెరకముడిదాం మండలంలో ఇప్పుడు వైకాపా ఎదురీదాల్సి రావడం ఆయనకు ప్రతికూలాంశం. జనసేన.. తెదేపాకు మద్దతివ్వడంతో కొన్ని వర్గాల్లో తెదేపాకు మద్దతు పెరుగుతోంది. చివరి 10 రోజులు బొత్స డబ్బుతో చేసే రాజకీయమే కీలకమని స్థానికులే చెబుతున్నారు. ప్రలోభపెట్టి అన్ని పార్టీల్లోనూ మద్దతుదారులను తయారుచేసుకుంటారని, రాత్రికి రాత్రే ఓట్లు కొనేస్తారన్నది వారి గతానుభవం.


ప్రజావ్యతిరేకతతో సభాపతి ఉక్కిరిబిక్కిరి

స్పీకర్‌: తమ్మినేని సీతారాం
కూటమి అభ్యర్థి: కూన రవికుమార్‌ (తెదేపా)
నియోజకవర్గం: ఆమదాలవలస అసెంబ్లీ (శ్రీకాకుళం లోక్‌సభ)

శాసనసభాపతి తమ్మినేని సీతారాం ప్రజా వ్యతిరేకతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.  ‘పెట్రోలు బంకు ఏర్పాటు చేసుకున్నారు. ఇల్లు కట్టుకున్నారు. కాలేజీ ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలకు రోడ్డు మాత్రం వేయలేకపోయారు’ అని ఆమదాలవలస పట్టణంలోని ఒక మందుల దుకాణం యజమాని నిలదీశారు. మళ్లీ ఆయనను ఎన్నుకునేది లేదని తెగేసి చెప్పారు. ‘ఆయన దగ్గరికి వెళ్లాలంటే ఆ కుటుంబంలో అందరినీ సంతోషపరచాలి. ఏ పనీ చేయరు వాళ్లు’’ అని మరో దుకాణ యజమాని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎవర్ని కదిపినా సీతారామ్‌పై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రధానంగా శ్రీకాకుళం- ఆమదాలవలస రోడ్డు పూర్తి చేయకపోవడం ఈ ఎన్నికల్లో ఆయనపై చాలా ప్రభావం చూపబోతోంది. ఈ నియోజకవర్గంలో ఎందరో ఆ రోడ్డుపై జరిగిన ప్రమాదాల్లో చనిపోయారు. వందల మంది క్షతగాత్రులయ్యారు. నియోజకవర్గంలో భూముల సెటిల్‌మెంట్లు కీలకాంశమయింది. సభాపతి కుటుంబసభ్యుల తీరుతెన్నులు వివాదాస్పదంగా మారాయి. నియోజకవర్గంలో అధికార వైకాపాలో కీలక వ్యక్తులు.. ఉద్యోగుల నుంచి బదిలీలకు, పోస్టింగులకు చేసిన వసూళ్ల ప్రభావం  అధికార పార్టీకి ప్రతికూలమవుతోంది. వైకాపా నాయకుడు గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన ఎంతో కొంత ఓట్లు చీల్చనున్నారు.

తెదేపా నుంచి కూన రవికుమార్‌ మరోసారి బరిలో నిలిచారు. సభాపతిపై ప్రజావ్యతిరేకత, జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తెదేపాకు అనుకూలంగా మారుతున్నాయి. నాలుగు మండలాల నుంచి అనేక మంది వైకాపా నాయకులు పార్టీలోకి వస్తుండటం సైకిల్‌ పార్టీలో జోష్‌ పెంచుతోంది. తెదేపా క్యాడర్‌ మండలాల వారీగా ఎన్నికల ప్రణాళికతో ముందుకెళుతోంది.


సొంత నియోజకవర్గమే వద్దంటోంది!

మంత్రి: గుడివాడ అమర్‌నాథ్‌  
కూటమి అభ్యర్థి: పల్లా శ్రీనివాసరావు (తెదేపా)
నియోజకవర్గం: గాజువాక శాసనసభ

అనకాపల్లిలో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవడంతో మంత్రి అమర్‌నాథ్‌ను మళ్లీ అక్కడ పోటీకి నిలిపేందుకు జగన్‌కు సైతం ధైర్యం చాల్లేదు. అసలు ఈ ఎన్నికల్లో అభ్యర్థిత్వం దక్కుతుందా లేదా అన్న చర్చ నుంచి చివరికి గాజువాక నుంచి బరిలో నిలిపారు. ఆయన సొంతూరు మింది ఇక్కడే ఉంది. రాష్ట్రానికి మంత్రి అయినా అయిదేళ్లుగా స్వగ్రామంలోని ప్రజలను ఆయన పట్టించుకోలేదు. ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. ఇప్పుడు ‘నన్ను నమ్మండి’ అంటూ సొంత నియోజకవర్గ ఓటర్లను బతిమాలుకోవాల్సిన దుస్థితి వచ్చింది. స్టీల్‌ ప్లాంట్‌ ఆందోళనకు సంఘీభావం ప్రకటించకపోవడంతో ఆ ఉద్యోగుల కుటుంబాలన్నీ అమర్‌నాథ్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో లక్షకు పైగా ఉన్న వలస ఓటర్లను ఏదోలా మచ్చిక చేసుకోవాలని అమర్‌నాథ్‌ వ్యూహాలు రచిస్తున్నారు. కులసంఘాల సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు సమీకరణకు పాట్లు పడుతున్నారు.

తెదేపా అభ్యర్థిగా బరిలో నిలిచిన పల్లా శ్రీనివాసరావు ఎప్పుడూ ప్రజలతోనే ఉండటం కలిసొచ్చే అంశం. స్టీల్‌ ప్లాంట్‌ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఏడు రోజులపాటు నిరసన దీక్ష చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2014 నుంచి 2019 వరకు గాజువాక అభివృద్ధి కోసం చేసిన కృషి కలిసివస్తోంది. అప్పట్లో జీవో 301 తీసుకువచ్చి 7,800 మందికి పట్టాలు ఇప్పించారు. పేదల భూ సమస్యను పరిష్కరించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవో రద్దు చేసి కొన్నాళ్లు ఇబ్బంది పెట్టడమూ ఓటర్లలో ఆగ్రహానికి కారణమవుతోంది. పల్లా శ్రీనివాసరావు స్టీల్‌ ప్లాంట్‌కు భూములిచ్చిన వారికి పునరావాస కార్డులు, కొందరికి శాశ్వత ఉద్యోగాలు, చాలామందికి ఒప్పంద ఉద్యోగాలు ఇప్పించారనే సానుభూతి కూడా ఉంది. కొవిడ్‌ సమయంలో స్థానిక వైకాపా ఎమ్మెల్యే నాగిరెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. వయసులో పెద్దవాడైన ఆయన రెండున్నరేళ్లు బయటికి రాలేదు. తర్వాత ఆయన కుమారులు నియోజకవర్గ వ్యవహారాలు చూసినా సమస్యలు పరిష్కరించలేదు. ఈ ప్రభావమూ అమర్‌నాథ్‌కు కష్టాలు తెచ్చి పెడుతోంది. సామాజిక సమీకరణాలతో బయటపడాలని ప్రయత్నిస్తున్నా అవీ కలిసొచ్చే సూచనలు కనిపించడం లేదు. తన వర్గాన్ని ఆయన హేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. అనకాపల్లిలో సొంత వర్గాన్ని పట్టించుకోలేదన్న విమర్శ గాజువాక దాకా పాకింది.


పశుసంవర్థకశాఖ మంత్రికి హోరాహోరీ

మంత్రి: సీదిరి అప్పలరాజు
కూటమి అభ్యర్థి: గౌతు శిరీష (తెదేపా)
నియోజకవర్గం: పలాస
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా

పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు ప్రస్తుత ఎన్నికలు పెనుసవాల్‌గా మారాయి. తెలుగుదేశం నుంచి గౌతు శిరీష పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ వీరిద్దరే పోటీలో ఉన్నారు. పలాస నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా అధికార పార్టీ నాయకుల అరాచకాలు ఇక్కడ అప్పలరాజుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇక్కడ నలుగురు నేతలే ముఖ్యమయ్యారు. వారు చేసిన అక్రమాలు, అరాచకాల ప్రభావం అధికార పార్టీ గెలుపునకు ప్రతిబంధకమవుతోంది. మంత్రికి అత్యంత సన్నిహిత బంధుత్వమున్న వ్యక్తి వ్యవహారశైలి కూడా వ్యతిరేకతను పోగుచేసింది. ఇక్కడ పోస్టింగులు, బదిలీలు అధికార పార్టీ నేతల సిఫార్సులతో అడ్డగోలుగా జరిగాయి. పేదలకు భూపంపిణీలో అవకతవకలు, కొండలను పిండి చేయడం, పట్టాల వ్యవహారాల్లో అక్రమాలు, భూముల ఆక్రమణల వంటి ఆరోపణలు వైకాపా నాయకులు కొందరిపై ఉన్నాయి.  పలాస, కాశీబుగ్గ జంట పట్టణాలకు ఎంతో కీలకమైన రైల్వే పైవంతెన నిర్మాణం ఇంత వరకు పూర్తి చేయకపోవడం ప్రతికూల ప్రభావం చూపబోతోంది. ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనలేదు. ఆస్పత్రిలో పూర్తి స్థాయి వైద్యులు లేరు. ఉద్దానానికి మంచినీళ్లు అందించే పథకమూ రూపుదాల్చలేదు. ఇవన్నీ అప్పలరాజుకు ప్రతికూలంగా మారుతున్నాయి.

తెదేపా అభ్యర్థి గౌతు శిరీష పార్టీ నాయకులను అందరినీ కలుపుకొని వెళ్లేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఎన్నికల రంగంలో వారం రోజులుగా తన శైలి మార్చుకుని క్యాడర్‌ మద్దతు పెంచుకుని, ప్రజా మద్దతు పొందేందుకు అడుగులు వేస్తున్నారు. జనసేనకు కిందటి ఎన్నికల్లో చెప్పదగ్గ స్థాయిలో ఓట్లు వచ్చాయి. మూడు పార్టీల కూటమిగా ఏర్పడటమూ శిరీషకు కలిసొచ్చే అంశం. ఇక్కడ పోటీ రసవత్తరంగా ఉండబోతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img