logo

1500 మీటర్లకు 8 కిలోమీటర్ల ప్రయాణం

గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చేందుకు పక్కా రోడ్డు సౌకర్యం కల్పించడం ప్రభుత్వం, పాలకుల కనీస విధి. స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా.. నేటికీ కొన్ని గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లేందుకు నేరుగా సరైన దారి లేదు.

Published : 23 Jan 2022 04:57 IST

వాగు అడ్డం.. తిరిగి  వెళ్లాలంటే దూరాభారం

ఇటీవల వేచరేణి వాగులో పడిన ద్విచక్ర వాహన చోదకులను కాపాడుతున్న గ్రామస్థులు

న్యూస్‌టుడే, చేర్యాల: గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చేందుకు పక్కా రోడ్డు సౌకర్యం కల్పించడం ప్రభుత్వం, పాలకుల కనీస విధి. స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా.. నేటికీ కొన్ని గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లేందుకు నేరుగా సరైన దారి లేదు. చేర్యాల మండలం వేచరేణి గ్రామస్థులదీ అదే పరిస్థితి. ఊరు మండల కేంద్రానికి చెంతనే ఉండగా నేరుగా వెళితే 1.5 కిలోమీటర్లే. ఆ దారిలో వెళ్లాలంటే వాగు దాటాల్సి వస్తోంది. వాగుపై వంతెన లేక చుట్టూ 8 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. గ్రామస్థులు ప్రతి చిన్న పనికీ మండల కేంద్రానికి వెళ్లక తప్పని పరిస్థితుల్లో దూరా భారమైనా చుట్టూ తిరిగి వెళ్తున్నారు.  

వర్షాకాలంలో మరింత కష్టం...

అసలే గుంతలతో కూడిన మట్టి రోడ్డు. అందుకు తోడు సుమారు 250 మీటర్ల వెడల్పుతో ఉన్న వాగు గ్రామస్థుల ప్రయాణానికి అడ్డంకిగా మారింది. వర్షాకాలం వస్తే వాగులో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. జీవనదిలా ఆరు నుంచి 9 నెలల పాటు కనీసం మోకాలి లోతు నీరు ఎప్పుడూ ఉంటుంది. వాగు దాటాలంటే    చెప్పులు చేత పట్టుకొని, ప్యాంటు పైకి మడత వేసి వెళ్లాల్సిందే. దీంతో గ్రామస్థులు వ్యయ ప్రయాసాలకు ఓర్చి చుట్టూ తిరిగి వెళ్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి ఆ మార్గంలో వచ్చిన ద్విచక్రవాహన చోదకులు వాగు నీటిలో పడిపోగా ఆ మార్గంలో వెళుతున్న వారు గమనించి కాపాడారు.


వంతెన నిర్మిస్తే.. ఎంతో ప్రయోజనం..

వేచరేణి వాగుపై వంతెన నిర్మిస్తే గ్రామస్థులకే కాకుండా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రానికి వెళ్లేవారికి కూడా అనుకూలంగా ఉంటుంది. సుమారు 6 కిలోమీటర్ల అదనపు ప్రయాణం తప్పుతుంది. ఏటా స్వామి దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులకు ప్రయోజనం కలుగుతుంది. పదేళ్ల క్రితం వాగులో ‘చెక్‌ డ్యాం’ నిర్మించగా రూపు మార్చి రోడ్డు కం వంతెనగా నిర్మించినా బాగుండేది. కేవలం అడ్డుకట్ట తరహాలో నిర్మించిన కాంక్రీటు కాస్తా ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ప్రతి ఏటా గ్రామస్థులు మట్టితో తాత్కాలికంగా రోడ్డు వేసుకుంటున్నా చిన్నపాటి వర్షం కురిసినా కొట్టుకుపోతోంది. సమస్యను ‘న్యూస్‌టుడే’ చేర్యాల ఐబీ డీఈ శ్యాం దృష్టికి తీసుకెళ్లగా సమస్య నా దృష్టికి రాలేదని, పరిశీలించి వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని