logo

నెరవేరుతున్న ఏళ్ల కల

అక్కన్నపేట మండలం జనగామ నుంచి గుబ్బడి గ్రామాల మధ్య తారు రోడ్డు నిర్మాణంతో రెండు గ్రామాల ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోంది. పనులు చేపట్టడంలో కొంత ఆలస్యమైనా ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి.

Published : 27 Jan 2022 01:43 IST

జనగామ-గుబ్బడి గ్రామాల మధ్య తారు రోడ్డు  
రూ.3.50 కోట్లతో నిర్మాణం

కొనసాగుతున్న రహదారి పనులు

హుస్నాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: అక్కన్నపేట మండలం జనగామ నుంచి గుబ్బడి గ్రామాల మధ్య తారు రోడ్డు నిర్మాణంతో రెండు గ్రామాల ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోంది. పనులు చేపట్టడంలో కొంత ఆలస్యమైనా ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి. ఇదే విధంగా నడిస్తే కొద్ది రోజుల్లోనే ఆ గ్రామాల ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి. వివరాలు.. అక్కన్నపేట మండలం జనగామ నుంచి గుబ్బడి గ్రామాల మధ్య ఉన్న రహదారిని తారు రోడ్డును మార్చాలని రెండు గ్రామాల ప్రజలు కొన్నేళ్లుగా కోరుతున్నారు. వర్షం పడితే రోడ్డంతా బురదగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడేవారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారుల వినతి మేరకు జనగామ నుంచి గుబ్బడి, లచ్చనాయక్‌ తండా మీదుగా అక్కన్నపేట ఊర చెరువు మలుపు వరకు ఉన్న మట్టి రోడ్డును తారు రోడ్డుగా మార్చేందుకు నాలుగేళ్ల క్రితం నిధులు మంజూరయ్యాయి. సుమారు 5 కి.మీ ఉన్న ఈ రోడ్డుకు ప్రభుత్వం రూ.3.5 కోట్లు మంజూరు చేసింది. మూడేళ్ల క్రితం రోడ్డు పనులకు ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించిన గుత్తేదారు తరువాత కొన్ని కారణాలతో పనులు నిలిపేశారు. తర్వాత నిరుడు ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ప్రారంభించి మట్టి పనులు పూర్తిచేశాడు. అంతలోనే భారీ వర్షాలు పనులకు ఆటంకం కల్గించాయి. దీంతో పనులు నిలిచిపోగా ఇటీవల మళ్లీ ప్రారంభించారు. నాటి నుంచి పనులు యుద్ధ్దప్రాతిపదికన నడుస్తున్నాయి. కంకర వేసే పనులు పూర్తికాగా ప్రస్తుతం తారు పనులను మంగళవారం ప్రారంభించారు. మరో వైపు 5కి.మీ రోడ్డులో రెండు చోట్ల వాగులపై వంతెనలు, మరో 10 చోట్ల చిన్న వంతెనల పనులు శరవేగంగా నడుస్తున్నాయి. వంతెనలు ఉన్న చోట మినహా మిగిలిన చోట్ల తారు వేస్తున్నారు. పనులు పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్‌ డీఈ సదాశివరెడ్డి మాట్లాడుతూ.. వంతెనల వద్ద పనులు పూర్తికాగానే అక్కడ కూడా తారు వేస్తామని తెలిపారు. పనులు వేగవంతం చేయడంతో మండల కేంద్రం అక్కన్నపేట, హుస్నాబాద్‌ పట్టణానికి వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందని గుబ్బడి గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని