icon icon icon
icon icon icon

రాజ్యాంగం ఉండాలా.. వద్దా..?

దేశంలో భాజపాకు వేసే ప్రతి ఓటూ రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుందని.. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు దూరమవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

Updated : 02 May 2024 07:52 IST

ఇదే ఈ సారి ఎన్నికల ఎజెండా
మార్చాలంటున్న భాజపా వైపో, సంరక్షిస్తామంటున్న కాంగ్రెస్‌ వైపో ప్రజలు తేల్చుకోవాలి
కాషాయ పార్టీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు
అందుకే 400 సీట్లు అంటున్నారు
ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాల అమలుకు ఆ పార్టీ యత్నం
దిల్లీ పోలీసులతో నన్ను, తెలంగాణ సమాజాన్ని భయపెట్టలేరు
మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
ఈనాడు - హైదరాబాద్‌

దేశంలో భాజపాకు వేసే ప్రతి ఓటూ రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుందని.. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు దూరమవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ రిజర్వేషన్లు తొలగించాలని, హిందూ రాజ్యంగా మార్చాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలు అమలు చేసేందుకు ఆ పార్టీ 400 సీట్లు అడుగుతోందని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం ప్రధాన ఎజెండా కాదని... రాజ్యాంగాన్ని మార్చాలా? వద్దా? అన్న అంశం చుట్టూ ఈ ఎన్నికలు తిరుగుతున్నాయన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న భాజపా వైపు ఉంటారా? దాన్ని సంరక్షించి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు కాపాడుతూ జనాభా ప్రాతిపదికన వాటా పెంచే  కాంగ్రెస్‌ పార్టీ, ఇండియా కూటమి వైపు నిలబడతారో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. దిల్లీ పోలీసుల బెదిరింపులతో తనను, తెలంగాణ సమాజాన్ని భయపెట్టలేరని.. తనపై దాడి తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడిగా రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. రాజ్యాంగాన్ని సాకారం చేసిన కాంగ్రెస్‌ పార్టీతోనే దాన్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యమని, ఇండియా కూటమితోనే బీసీ రిజర్వేషన్ల కోటా పెరుగుతుందని స్పష్టం చేశారు. భాజపా అబద్ధాల యూనివర్సిటీకి ఉపకులపతిగా ప్రధాని మోదీ, రిజిస్ట్రార్‌గా అమిత్‌ షా ఉన్నారని ఎద్దేవా చేశారు. బుధవారమిక్కడ తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. భాజపా నిర్ణయాలు దేశ ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని.. ఇది దేశంలోని 144 కోట్ల మంది కోసం కాంగ్రెస్‌ పార్టీ పడుతున్న తాపత్రయపడుతోందని అన్నారు.

‘‘రిజర్వేషన్లు రద్దుచేయాలన్నదే ఆర్‌ఎస్‌ఎస్‌ మూలసిద్ధాంతం. సమయం, సందర్భం వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని మార్చివేసి రిజర్వేషన్లు రద్దుచేయాలన్న ఎజెండాతో ఆ సంస్థ భాజపాను నిర్మించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లు తొలగించాలన్న ఆలోచనతో భాజపా అబ్‌కీబార్‌ చార్‌ సౌ(400 సీట్లు) అంటోంది. రాజ్యాంగంలో రిజర్వేషన్లు, ఇతర మూలసూత్రాలను సవరించాలంటే పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీతోపాటు 50 శాతం రాష్ట్రాలు ఆమోదించాలి. అందుకే ప్రతిపక్షాలను పడగొట్టి, పార్టీలను చీల్చి ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో భాజపా సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు పార్లమెంటులో మెజారిటీ కోసం మరిన్ని దుర్మార్గాలకు పాల్పడుతోంది. భాజపా 400 సీట్లు గెలిస్తే అన్నిరకాల దుర్వినియోగాలకు పాల్పడుతుంది. ఈ రోజుల్లో వార్డుమెంబర్‌ ఎన్నిక కూడా ఏకగ్రీవం కావడం లేదు. అలాంటిది ఇతరులపై ఒత్తిడి తీసుకువచ్చి ఇద్దరు ఎంపీలను ఏకగ్రీవం చేసుకున్నారు.

మిమ్మల్ని చూసి తెలంగాణ సమాజం భయపడటం లేదు.

ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాల మీద బహిరంగంగా ప్రెస్‌మీట్లు, సమావేశాల్లో మాట్లాడటంతో..  ఆ విషయంపై చర్చ జరగనీయకుండా భాజపా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా హోంమంత్రిత్వశాఖ ఫిర్యాదుతో నాపై అక్రమకేసులు పెట్టి విచారణకు హాజరుకావాలంటూ హుకుం జారీచేసింది. ప్రతిపక్ష పార్టీలు ఆధారాలతో కూడిన ఆరోపణలు చేస్తున్నప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం వివరణలు ఇచ్చి, తమ తప్పుల్ని సవరించుకోవాలి. కానీ, ఎన్నికల్లో గెలిచేందుకు గతంలో సీబీఐ, ఈడీ మాదిరి ఇప్పుడు దిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారు. మిమ్మల్ని చూసి తెలంగాణ సమాజం భయపడటం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అండగా నిలబడతానే కానీ.. మీ ముందు ఎన్నటికీ లొంగిపోను. భాజపా కుట్రలను తిప్పికొట్టే బాధ్యతను తీసుకుంటాను. మా పోరాటం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే.. ఇప్పుడు ఖాళీగా ఒక పెద్దాయన ఉన్నారు. ఆయన్ను అడగండి... కన్సల్టెంటుగా పెట్టుకోండి. ఇప్పటికీ మీకు ఆయనతో స్నేహం ఉంది కదా.. కేసులు పెట్టి జైళ్లలో వేసి భయపెట్టాలని ప్రయత్నిస్తే ఏమవుతుందో ఆయన ద్వారా తెలుసుకోండి.

బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆడ్వాణీ రథయాత్ర

మండల్‌ కమిషన్‌ నివేదికను 1990లో వీపీ సింగ్‌ ప్రభుత్వం ఆమోదించింది. దేశంలో 52 శాతం జనాభా ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేసింది. అయితే, మండల్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా కమండల్‌ పేరిట ఎల్‌కే ఆడ్వాణీ రథయాత్ర చేపట్టి.. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం చేశారు. న్యాయస్థానానికి వెళ్తే తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్‌.. రిజర్వేషన్లు కొనసాగించాలని స్పష్టం చేసింది. జనాభా లెక్కించి రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి పెట్టారు. ఒకవేళ పరిమితి తొలగించాలంటే బీసీ జనగణన చేపట్టాక అమలు చేయాలని పేర్కొన్నారు. రిజర్వేషన్లు పెంచాలంటూ భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌గాంధీకి బీసీలు విజ్ఞప్తి చేయడంతో ఆ వాదనతో ఏకీభవించి పార్టీ విధానంగా చేర్చాం. రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారంలోకి వస్తే కులగణన చేపట్టి, ఆ మేరకు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చాం. ఇందులో భాగంగా తెలంగాణలో బీసీ గణన చేపట్టేందుకు నిధులు ఇచ్చాం.

ఎన్నికల్లో ప్రచారం చేయనీయకుండా కుట్ర..

ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యాలను మోదీ ఒక్కొక్కటిగా అమలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2025లో రిజర్వేషన్లు రద్దు చేయడంతోపాటు హిందూ దేశంగా మార్చే కార్యక్రమాన్ని భాజపా చేపట్టింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే కేసులు పెడుతున్నారు. ఎవరో సోషల్‌ మీడియాలో పోస్టుచేస్తే... హోంశాఖ ఫిర్యాదుచేసి దేశభద్రత, స్వతంత్రతకు ముప్పు అన్నట్లు సీఎంపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టారు. ఈ కేసుతో సంబంధం లేదని కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌టీం వెళ్తే అక్కడ మహిళా న్యాయవాదిపట్ల దిల్లీ పోలీసులు అసభ్యంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలోని దిల్లీ పోలీసుల్ని ప్రయోగించి నా మీద ఒత్తిడి తీసుకువచ్చి ఎన్నికల్లో ప్రచారం చేయకుండా కుట్రలు చేస్తున్నారు.

ఇక్కడ మతపరమైన రిజర్వేషన్లు లేవు..

రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు. ముస్లింల రిజర్వేషన్ల కోసం ఆనాటి కాంగ్రెస్‌ సర్కారు ఎవరి రిజర్వేషన్లనూ తగ్గించలేదు. ముస్లింలకు బీసీ-ఈ గ్రూపు కింద రిజర్వేషన్లు ఇచ్చారు. వారికన్నా ముందుగానే దూదేకుల, ఇతర ముస్లిం ఉపకులాల వారికి రిజర్వేషన్లు ఉన్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించి భావోద్వేగాలకు గురిచేయాలని భాజపా ప్రయత్నిస్తోంది. గణన తర్వాత ఓబీసీలు ఎంత మంది ఉంటే.. అంతమందికీ రిజర్వేషన్లు ఇస్తామని మేం చెబుతున్నాం. మోదీ అబద్ధాలు చెబుతున్నారు. ఒకవేళ ఇతరుల నుంచి తీసుకుని ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే పదేళ్లుగా లోక్‌సభలో ఎందుకు ఈ విషయంపై మాట్లాడలేదు. భాజపా గోరక్ష గురించి మాట్లాడుతుంది. మరోవైపు గుజరాత్‌, యూపీలలో స్లాటర్‌హౌజ్‌ల ఏర్పాటుకు లులూ గ్రూపు సంస్థకు అనుమతులు ఇచ్చారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని ఇక్కడికొచ్చి మోదీ, అమిత్‌షా అంటున్నారు. నేనిక్కడ రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటున్నా.

కార్పొరేట్ల కోసమే..

ఏం మాట్లాడాలో.. ఏం చెప్పాలో తెలియక కిషన్‌రెడ్డి బాధపడుతున్నారు. ఒకప్పుడు బ్రిటిష్‌వారు సూరత్‌ మీదుగా వచ్చి దేశాన్ని దోచుకున్నారు. ఇప్పుడు అదానీ, ప్రధాని ఇద్దరూ సూరత్‌ నుంచి బయలుదేరారు. కార్పొరేట్‌ రంగం కోసమే రిజర్వేషన్లు రద్దుచేయాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇవి భర్తీచేస్తే 15 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగాలు వచ్చేవి. కానీ, భర్తీ చేయకుండా రిజర్వుడ్‌ వర్గాలకు అన్యాయం చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ ఇలా నవరత్న కంపెనీలను అమ్ముతున్నారు. ఇవన్నీ కార్పొరేట్‌ కంపెనీలకు వెళ్లిన తర్వాత రిజర్వేషన్లు తీసివేస్తారు’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఇవిగో ఆధారాలు..

2000 సంవత్సరంలో వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నపుడు.. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అప్పటి రాష్ట్రపతి ప్రసంగంలో.. రాజ్యాంగాన్ని మార్చాలన్న అంశాన్ని చెప్పించారు. అదే ఏడాది ఫిబ్రవరి 22న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసి, జస్టిస్‌ వెంకటాచలయ్య నేతృత్వంలో కమిషన్‌ వేశారు. ఈ కమిషన్‌లో పది మంది రాజ్యాంగ నిపుణులు ఉన్నారు. ఇది 2002లో ఇచ్చిన నివేదిక సూచనలు బయటపెట్టకుండా.. రహస్య ఎజెండాగా పార్లమెంటులో మెజారిటీ సాధించి రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ ఆధారాలతో చెబుతున్నా.. మీలాగా ఫేక్‌వీడియోలు, నిరాధార ఆరోపణలు చేయడం లేదు. అప్పటి కమిషన్‌ 2002లో నివేదిక ఇచ్చినా, దాన్ని అందుబాటులో పెట్టలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ రెండో సర్‌సంఘ్‌చాలక్‌ మాధవ్‌ సదాశివరావు గోళ్వాల్కర్‌ 1960లో ఒక పుస్తకంలో ‘దళితులకు సమానత్వం, హక్కులు లేని హిందూ రాష్ట్రం మేలు. దురదృష్టవశాత్తూ అందరికీ సమాన హక్కులు కల్పించారు’ అని పేర్కొన్నారు. ఇక ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త ఎంజీ వైద్య 2015లో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కుల ఆధారిత రిజర్వేషన్లు అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీలకు పదేళ్ల తర్వాత వాటిని రద్దుచేయాలి’ అని అన్నారు.


జస్టిస్‌ వెంకటాచలయ్య కమిషన్‌పై మోదీ అభిప్రాయం చెప్పాలి

రాజ్యాంగంలో మార్పుల కోసం వేసిన జస్టిస్‌ వెంకటాచలయ్య కమిషన్‌పై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా సమాధానం చెప్పాలి. ఆ కమిషన్‌ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారా? సమర్థిస్తున్నారా? నివేదికపై అభిప్రాయాన్ని దేశ ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు. రాజ్యాంగం రానున్న రోజుల్లో మారనుందని 2017లో అప్పటి కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే చెప్పారు. రిజర్వేషన్లు అభివృద్ధిని తీసుకువస్తాయా? అని అప్పటి స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అన్నారు. కుల ఆధారిత రిజర్వేషన్లు ఏదో ఒక సమయంలో అంతం కావాలని 2017లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధి మన్మోహన్‌ వైద్య పేర్కొన్నారు. అంటే ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపాలకు సంబంధించిన వారంతా రిజర్వేషన్లు రద్దు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు.


మోదీ కృత్రిమ, కన్వర్టెడ్‌ బీసీ. గతంలో ఆయన ఓసీగా ఉండేవారు. గుజరాత్‌ సీఎం అయిన తర్వాత ఆయన కులాన్ని బీసీల్లో కలిపారు. బీసీల పట్ల మోదీకి ప్రేమ లేదు. అవసరమైనప్పుడు బీసీ కార్డు తీస్తారు. పాకిస్థాన్‌తో కలిసి అప్పటి ప్రధాని మన్మోహన్‌ తన హత్యకు కుట్ర చేశారని ఆరోపించిన వ్యక్తి మోదీ. ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తారా?


సీఎం ఫేక్‌ వీడియోలు తయారు చేస్తున్నారని భాజపా నేతలు అంటున్నారు. ఏమైనా బుద్ధి ఉందా.. లాజిక్‌ ఉందా... సీఎం ఫేక్‌ వీడియోలు తయారు చేస్తారా? భాజపా రిజర్వేషన్లు రద్దు చేస్తుందని నేనే బహిరంగంగా చెబుతున్నా. ఇక ఫేక్‌ వీడియోలు చేయాల్సిన అవసరం మాకేంటి.

సీఎం రేవంత్‌రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img