logo

ఉపాధి నిధులు పక్కదారి

న్యాల్‌కల్‌ మండల పరిధిలో 2019 నుంచి 2022 వరకు రూ.10.99 కోట్ల విలువైన ఉపాధి పనులు చేపట్టారు. ఈ పనులపై ఈనెల 9న సామాజిక తనిఖీలు నిర్వహించారు.

Published : 24 Mar 2023 01:11 IST

సామాజిక తనిఖీల్లో వెల్లడి
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, రాయికోడ్‌, జోగిపేట

రాయికోడ్‌లో సామాజిక తనిఖీ సమావేశం(పాతచిత్రం)

న్యాల్‌కల్‌ మండల పరిధిలో 2019 నుంచి 2022 వరకు రూ.10.99 కోట్ల విలువైన ఉపాధి పనులు చేపట్టారు. ఈ పనులపై ఈనెల 9న సామాజిక తనిఖీలు నిర్వహించారు. కూలీలకు నగదు చెల్లింపులు, రికార్డుల నమోదు సక్రమంగా లేవు. సాంకేతిక, క్షేత్ర సహాయకులు, పంచాయతీ కార్యదర్శులకు తాఖీదులు జారీ చేశారు. రూ.65,815 రికవరీకి ఆదేశించారు.

రాయికోడ్‌ మండలంలో 2019 నుంచి 2022 వరకు రూ.15.89 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులు చేశారు. ఆయా పనులపై ఈ నెల 10న తహసీల్దార్‌ కార్యాలయంలో సామాజిక తనిఖీలు చేపట్టారు. పనుల్లో రూ.2 లక్షల వరకు అవకతవకలు జరిగినట్లు తేల్చారు.

చాలా గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు జరిగినట్టు అధికారులు తేల్చారు. కూలీలు పనులకు రాకున్నా.. వచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేయటం, పనులు చేయకున్నా.. చేసినట్లు రాయడం, మొక్కలకు ఖర్చు విషయంలో ఇష్టారీతిన లెక్కలు రాయడం.. తదితర అంశాల్లో అవకతవకలు జరిగినట్టు సామాజిక తనిఖీల్లో అధికారులు తేల్చారు. 2019 నుంచి 2022 వరకు జరిగిన పనులకు సంబంధించిన సామాజిక తనిఖీలు జిల్లాలో కొనసాగుతున్నాయి.

639 గ్రామాల్లో అమలు

జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) పథకాన్ని 639 గ్రామాల్లో అమలు చేస్తున్నారు. పంట కాల్వలు, ఊర కుంటలు, కందకాలు, చెరువులు, కుంటల్లో పూడికతీత, హరితహారంలో నాటిన మొక్కల పర్యవేక్షణ, నర్సరీలో మొక్కల పెంపకం తదితర పనులు చేపడుతున్నారు. పంచాయతీ కార్యదర్శులకు ఆ పథకం అమలు బాధ్యత అప్పగించారు. అదనపు భారం వల్ల వారు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయకపోవడంతో నిధులు పక్కదారి పడుతున్నాయి.

సిబ్బందికి తాఖీదులు

సాంకేతిక సిబ్బంది, క్షేత్ర సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు ఉపాధి నిధుల అవకతవకలకు కారణమని అధికారులు గుర్తించారు. జిల్లాలో ఈ ఏడాది 22 మంది పంచాయతీ కార్యదర్శులు, 20 మంది క్షేత్ర సహాయకులు, 14 మంది సాంకేతిక సహాయకులు, ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లకు తాఖీదులు జారీ చేశారు.


తిరిగి వసూలు చేస్తాం: శ్రీనివాస్‌రావు, డీఆర్‌డీవో

జిల్లాలో ఉపాధి హామీ పథకం నిధులు అక్కడక్కడా పక్కదారి పట్టినట్టు విచారణలో తేలింది. బాధ్యులకు ఇప్పటికే తాఖీదులు జారీ చేశాం. వారి నుంచి తిరిగి వసూలు చేస్తాం. జిల్లాలో పనులు సవ్యంగా చేసేలా ఎంపీడీవోలు, ఎంపీవోల పర్యవేక్షణ పెంచాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని