logo

పేదలకు గృహలక్ష్మి అనుగ్రహం!

సొంతిల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అయితే పేదలు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ విషయాన్ని ఆలోచించరు. ఈ నేపథ్యంలో వీరి ఆకాంక్షను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

Published : 28 Jun 2023 02:19 IST

సొంత స్థలం ఉన్న పేదలకు ఆర్థిక సాయం
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌:

సొంతిల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అయితే పేదలు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ విషయాన్ని ఆలోచించరు. ఈ నేపథ్యంలో వీరి ఆకాంక్షను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే కొన్ని చోట్ల మాత్రమే వీటి నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో కొందరికి మాత్రమే లబ్ధి చేకూరింది. ఇంకా చాలామంది ఎదురు చూస్తున్నారు. దీంతో సొంత జాగా ఉన్నవారు ఇల్లు నిర్మించేందుకు ‘గృహలక్ష్మి’ పేరిట ప్రభుత్వం రూ.3 లక్షల సాయం అందించనుంది. ఇప్పటికే ఆ పథకం కింద అర్హులు ఎవరు అనేది మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో జిల్లా గృహ నిర్మాణ శాఖ కసరత్తు చేస్తోంది.

జిల్లాలో 15వేల మందికి లబ్ధి

ఈ పథకం ద్వారా నియోజకవర్గానికి మూడు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత అప్పగిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాలో సంగారెడ్డి, పటాన్‌చెరు, అందోలు, జహీరాబాబాద్‌, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల్లో 15వేల మందికి లబ్ధి చేకూరనుంది. నర్సాపూర్‌ నియోజకవర్గంలోని హత్నూర మండలం కూడా ఈ జిల్లా పరిధిలోకి వస్తోంది. ఈ మండలంలో ఎంత మందిని గుర్తిస్తారన్నది తేలాల్సి ఉందని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

కలెక్టర్‌కు ఎంపిక బాధ్యత

సొంత స్థలం ఉన్న పేదల గుర్తింపు బాధ్యత కలెక్టర్‌కు అప్పగించారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆయా దశల ఫొటోలు, ఇతర మార్గాల ద్వారా నిర్ధరించుకుని నిర్మాణాల పనులను పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు దశల వారీగా ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపట్టనున్నారు. లబ్ధిదారులకు పునాది దశలో రూ.లక్ష, స్లాబ్‌ దశలో రూ.లక్ష, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో రూ.లక్ష మొత్తంగా రూ.3లక్షలు అందించాలని ఇటీవల జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చినట్లుగా సంబంధిత జిల్లా అధికార వర్గాలు తెలిపాయి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం: ప్రసాద్‌, అధికారి,సంగారెడ్డి.

జిల్లాలో పథకం అమలు తీరుపై ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం. నియోజకవర్గానికి మూడు వేల మందిని ఎంపిక చేయనున్నాం. పాలనాధికారి ఆదేశాల మేరకు ముందుకు సాగుతాం. సొంత స్థలం ఉన్నా వారి వివరాలను సేకరించి ఎంపిక చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని