logo

Robbery: సీసీ కెమెరాలకు సున్నమేసి ఏటీఎంల లూటీ

జాతీయ రహదారి పక్కన విస్తరించిన సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బుధవారం తెల్లవారుజామున దొంగలు రెచ్చిపోయారు.

Updated : 14 Dec 2023 07:09 IST

సదాశివపేటలో సుమారు రూ.28 లక్షల అపహరణ

 

దొంగలు కొల్లగొట్టిన ఎస్‌బీఐ ఏటీఎం

సదాశివపేట, సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: జాతీయ రహదారి పక్కన విస్తరించిన సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బుధవారం తెల్లవారుజామున దొంగలు రెచ్చిపోయారు. సీసీ కెమెరాలకు పెయింట్‌తో కూడిన సున్నం చల్లి గ్యాస్‌ కట్టర్ల సాయంతో ఒకే బ్యాంకుకు చెందిన మూడు ఏటీఎంలను కొల్లగొట్టి సుమారు రూ.28 లక్షలతో ఉడాయించారు. సదాశివపేటలోని బసవేశ్వర మందిరం, గాంధీ చౌక్‌, బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో భారతీయ స్టేట్‌ బ్యాంకు(ఎస్‌బీఐ)కు చెందిన మూడు ఏటీఎంలు ఉన్నాయి.

బుధవారం ఉదయం నిద్రలేవగానే, చోరీ జరిగినట్లు గుర్తించిన స్థానికులు బ్యాంకు అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన ఘటన స్థలాలకు వెళ్లి పరిశీలించారు. క్లూస్‌ టీం బృందాలను రంగంలోకి దించారు. ఆధారాలు చిక్కకుండా చేసేందుకు దొంగలు ఆయా ఏటీఎంల్లోని సీసీ కెమెరాలకు సున్నం పిచికారీ చేశారు. గ్యాస్‌ కట్టర్ల సాయంతో తెరిచారు. సమీప కాలనీల్లోని సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు బుధవారం తెల్లవారుజామున 3 నుంచి 3.40 గంటల మధ్య టీఎస్‌09 ఎఫ్‌ఈ 5840 కారులో చోరులు వచ్చినట్లు గుర్తించారు. ప్రాథమిక అంచనా ప్రకారం మూడు ఏటీఎంలలో కలిపి సుమారు రూ.28 లక్షల వరకు చోరీ అయినట్లు భావిస్తున్నారు. ఏటీఎంలలో ఎంత నగదు పెట్టారు? ఎంత డ్రా చేశారనేది పక్కాగా తెలిస్తేనే  స్పష్టత వస్తుంది. గతంలో ఈ తరహా చోరీలకు తెగబడిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పాత నేరస్థుల ముఠా ఈ పని చేసిందా? లేక పొక్లెయిన్‌లకు మరమ్మతులు చేసే వ్యక్తులు ఎవరైనా చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. పట్టణ సీఐ నవీన్‌ కుమార్‌ కేసు నమోదు చేశారు.

రంగంలోకి నాలుగు బృందాలు

ఈ ఘటనను సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్‌ సీరియస్‌గా తీసుకున్నారు. విషయం తెలియగానే స్థానిక పోలీసులను బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన శాంతిభద్రతల సమావేశానికి రావొద్దని, అక్కడే ఉండి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పట్టణంతోపాటు 65వ నంబరు జాతీయ రహదారి, టోల్‌గేట్లు తదితర చోట్ల తనిఖీలు చేశారు. దొంగలు చోరీకి వినియోగించిన కారు ఎక్కడి నుంచి వచ్చింది.. ఎక్కడికి వెళ్లింది.. అనే కోణంలో పరిశీలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని