logo

ఓటు నమోదుకు కదిలిన యువత

కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు.

Updated : 20 Apr 2024 05:57 IST

25న తుది జాబితా

 న్యూస్‌టుడే-మెదక్‌: కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. ఈనెల 15వరకు దరఖాస్తులకు అవకాశం ఇవ్వగా, పలువురు దరఖాస్తులు చేసుకున్నారు. వాటిని అధికారులు పరిశీలించి తుది జాబితాను వెలువరించనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం గత ఫిబ్రవరి 8న తుది జాబితాను వెలువరించగా, ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడంతో మరోమారు అవకాశం కల్పించారు. ఓటరు నమోదుతో పాటు, అభ్యంతరాలు, చిరునామా మార్పు కోసం అర్జీ పెట్టుకోవాలని సూచించారు. జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 4.44 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గత ఫిబ్రవరి 8న వెలువరించిన జాబితా ప్రకారం 4.42 లక్షల మంది ఉండగా, ఇరవై వేల మంది ఓటర్లు పెరిగారు. ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వారికి నమోదుకు అవకాశం కల్పించారు. ఓటరు నమోదు కోసం క్యాంపస్‌ అంబాసిడర్లను నియమించారు. వీరు అవగాహన కల్పించడంతో అర్హత గల వారు ముందుకు వచ్చి ఓటరుగా నమోదు చేసుకున్నారు. మెదక్‌ నియోజకవర్గంలో 1,411 మంది, నర్సాపూర్‌లో 1,720 మంది అర్జీ పెట్టుకున్నారు.

 మార్పులకే ఎక్కువ..: కొత్తగా ఓటరు నమోదుతో పాటు ఇతర వాటికి దరఖాస్తు అవకాశం ఇవ్వడంతో పలువురు ఓటర్లు పెద్దఎత్తున అర్జీలు పెట్టుకున్నారు. ఫారం-8 ద్వారా జిల్లాలో నర్సాపూర్‌లోనే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ 5,522 మంది అర్జీ పెట్టుకోగా, మెదక్‌లో 3,014 మంది ఇచ్చారు. మరోవైపు జాబితాలో అభ్యంతరాలపై రెండు నియోజకవర్గాల్లో కలిపి 1,913 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని బూత్‌ స్థాయి అధికారులు(బీఎల్వోలు), ఇతర సిబ్బంది కలిసి పరిశీలించి జాబితాలో కొత్త ఓటర్ల వివరాలను నమోదు చేయనున్నారు. మిగిలిన అర్జీలను సైతం పరిష్కరిస్తారు. ఈనెల 29కు నామినేషన్ల ఘట్టం ముగియనుంది. దీంతో ఈనెల 25న ఓటరు తుది జాబితాను వెలువరించనున్నారు. వీలైతే పోలింగ్‌ సమయం వరకు మరికొంత మంది ఓటర్లు జాబితాలో చేరే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని