logo

వక్ఫ్‌బోర్డు స్థలాల్లో ఆగని ఆక్రమణల పర్వం

రాజకీయ పలుకుబడి ధీమాతో కబ్జాదారులు వక్ఫ్‌బోర్డు స్థలాల్లో ఇష్టారీతిన నిర్మాణాలు చేపడుతున్నారు. ఇటీవల వక్ఫ్‌బోర్డుకు ఛైర్మన్‌ను నియమించిన నేపథ్యంలోనైనా వాటి స్థలాల్లో ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందని భావించినా...

Published : 28 Apr 2024 03:51 IST

నిర్మాణాన్ని కూలగొడుతున్న అధికారులు

న్యూస్‌టుడే, గజ్వేల్‌: రాజకీయ పలుకుబడి ధీమాతో కబ్జాదారులు వక్ఫ్‌బోర్డు స్థలాల్లో ఇష్టారీతిన నిర్మాణాలు చేపడుతున్నారు. ఇటీవల వక్ఫ్‌బోర్డుకు ఛైర్మన్‌ను నియమించిన నేపథ్యంలోనైనా వాటి స్థలాల్లో ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందని భావించినా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియాలో ప్రభావం కనిపించటం లేదు. గజ్వేల్‌ పట్టణంలోని వక్ఫ్‌ బోర్డు సంబంధిత రూ.కోట్ల విలువైన స్థలాలకు రక్షణ లేకుండా పోతోంది. మసీదులు, దర్గాల నిర్వహణకు పూర్వం వక్‌్్ఫ బోర్డు కేటాయించిన ఈ భూముల్లో నిబంధనలు అతిక్రమించి ఎలాంటి నిర్మాణాలైనా.. క్రయవిక్రయాలైనా చేయరాదని ఉన్నా అనేక చోట్ల వాణిజ్య సముదాయాలు, ఇళ్ల నిర్మాణాలు సాగిపోతూనే ఉన్నాయి.

200 ఎకరాల ఖాళీ భూములు

రెవెన్యూ రికార్డుల ప్రకారం పట్టణంలో 292.29 ఎకరాల వక్ఫ్‌ భూములున్నాయి. ఇందులో 5.25 ఎకరాల్లో మసీదులు, ఈద్గాలు, ఇతర ప్రార్థన మందిరాలున్నాయి. కొంత స్థలం రోడ్ల విస్తరణలో కలిసిపోయింది. కబ్రస్థాన్‌, పాడుబడిన బావులు, కాలువలు, గుమ్మటాలు తదితరాలు పోనూ మిగతా సుమారు 200 ఎకరాలకుపైగా ఖాళీ స్థలం ఉంటుందని అధికారుల అంచనా. జాలిగామ రోడ్డులో కొంత భూమి సాగులో ఉండగా చాలా చోట్ల ఆక్రమణకు గురైందని స్థానికులు చెబుతున్నారు. రూ.20 కోట్ల విలువైన స్థలాలు ఆక్రమణకు గురైనట్లు అంచనా. పలు పార్టీలకు చెందిన నేతలు ఆ భూములపై కన్నేసి ప్రస్తుతం బినామీలతో నిర్మాణాలు చేయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

తూతూమంత్రంగా చర్యలు

ఇక్కడ ఒక గజం స్థలం బహిరంగ మార్కెట్‌ ప్రకారం రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతోంది. అధికారులు ఫిర్యాదులు వచ్చినపుడు నిర్మాణాలను పాక్షికంగా ధ్వంసం చేసి ఊరుకుంటున్నారు. కొన్నాళ్ల తర్వాత కబ్జాదారులు యథావిధిగా నిర్మించుకుంటున్నారు. గజ్వేల్‌ ఇందిరా పార్కు నుంచి తూప్రాన్‌ రోడ్డులో, జాలిగామ బైపాస్‌ దారిలో దుకాణ సముదాయాలు నిర్మిస్తున్నారు. వివిధ మండలాల్లోని సాగు భూములు సైతం పరాధీనమయ్యాయి. ఈ విషయమై ఆర్డీవో బన్సీలాల్‌ మాట్లాడుతూ.. వక్ఫ్‌బోర్డు భూములను ఎవరు ఆక్రమించినా చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని