logo

ఎండ ప్రచండం.. ప్రచారానికి గండం!

లోక్‌సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మెదక్‌ లోక్‌సభ స్థానానికి సంబంధించి తొలి అంకం ముగిసి అభ్యర్థుల లెక్కతేలింది. ఇక ప్రచారం మరింతగా వేడెక్కనుంది.

Published : 28 Apr 2024 04:08 IST

నాయకుల, కార్యకర్తల ఆపసోపాలు
న్యూస్‌టుడే, మెదక్‌

మెదక్‌లో నిర్మానుష్యంగా మారిన రహదారి

మిట్ట మధ్యాహ్నం 12.30 గంటలు, 44 డిగ్రీల ఎండలో ఒక్కరు కూడా కదలకుండా...పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్‌కు వచ్చిన కార్యకర్తలందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇది భారాస కార్యకర్తల పట్టుదలకు నిదర్శనం.

ఈనెల 25న మెదక్‌లో కార్నర్‌ మీటింగ్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు


తీవ్రమైన ఎండ నేపథ్యంలో సభికులను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ సమయం ప్రసంగించబోనంటూ ఇటీవల సిద్దిపేటలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఆయన ఎనిమిది నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించారు.


సీఎం రేవంత్‌రెడ్డి అన్న మనసు చల్లగ లాగా... ఈ రోజు సూర్య భగవానుడు కరుణించడంతో వాతావరణం చల్లబడింది.

- ఈనెల 20న మెదక్‌లో సీఎం కార్నర్‌ మీటింగ్‌లో మంత్రి కొండా సురేఖ.


లోక్‌సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మెదక్‌ లోక్‌సభ స్థానానికి సంబంధించి తొలి అంకం ముగిసి అభ్యర్థుల లెక్కతేలింది. ఇక ప్రచారం మరింతగా వేడెక్కనుంది. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అభ్యర్థులు, పార్టీ శ్రేణులు సతమతమవుతున్నారు. పూర్తిగా క్షేత్రస్థాయిలో నిమగ్నమవ్వాల్సిన సమయం ఆసన్నమైన తరుణంలో ఎండ ఓ సవాలుగా మారింది. రెండు వారాలు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉండడంతో జోరు పెంచేందుకు సిద్ధమవుతున్నప్పటికీ ఎండలను ఎలా అధిగమించాలి? మిట్టమధ్యాహ్నం ప్రచారం ఎలా? ఒకవేళ ప్రచారానికి శ్రేణులను సమీకరించాల్సి వస్తే ముందుకు సాగడం సాధ్యమేనా.. అనే ప్రశ్నలు ఆయా పార్టీల్లో ఉత్పన్నమవుతున్నాయి. జిల్లాలో ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు చేరి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యప్రతాపం మొదలవుతోంది. ఇక మధ్యాహ్నం 12 దాటగానే రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం ఆరు గంటల వరకు ఉష్ణతాపం తగ్గడం లేదు. దీంతో ఆయా పార్టీల్లో ఆందోళన నెలకొంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ప్రచారంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు సభలు, సమావేశాలు, కార్నర్‌ మీటింగ్‌లకే మొగ్గు చూపుతున్నారు.

ఉదయం. రాత్రి వేళల్లో: ఎండ వేడి, ఉక్కపోత దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ప్రచారం, సభలు నిర్వహించాలని పార్టీల బాధ్యులు నిర్ణయించారు. బహిరంగ సభలను ఉదయం పూట నిర్వహించాల్సి వస్తే టెంట్లు వేస్తున్నారు. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు నామినేషన్‌ తొలిరోజున రాత్రి మెదక్‌లో కార్నర్‌మీటింగ్‌ నిర్వహించారు. శుక్రవారం పెద్దశంకరంపేటలో సీఎం రేవంత్‌రెడ్డి సభను సాయంత్రం ఏర్పాటు చేశారు. మెదక్‌లో ఈనెల 20 సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా వాతావరణం చల్లబడింది. 25న మెదక్‌లో భారాస ర్యాలీ మండుటెండలో నిర్వహించారు. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు తరఫున పార్టీ శ్రేణులు బూత్‌ వారీగా ఉదయం, సాయంత్రమే ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు మండలాల వారీగా ఉదయం నుంచి రాత్రి వరకు పాల్గొంటున్నారు. భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సైతం ప్రచారాన్ని ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని