logo

ఆటాడుకుందాం..రా..!

వేసవి సెలవుల్లో  పిల్లలు చరవాణులకే పరిమితం కాకుండా.. వాటి నుంచి చిన్నారుల దృష్టి మళ్లించి క్రీడా నైపుణ్యం వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శిబిరాలను ఏర్పాటు చేస్తోంది.

Published : 28 Apr 2024 06:18 IST

వలిగొండ శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాల ఆవరణలో కబడ్డీ ఆడుతున్న చిన్నారులు (పాత చిత్రం)

వలిగొండ, భువనగిరి, న్యూస్‌టుడే: వేసవి సెలవుల్లో  పిల్లలు చరవాణులకే పరిమితం కాకుండా.. వాటి నుంచి చిన్నారుల దృష్టి మళ్లించి క్రీడా నైపుణ్యం వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. మే 1 నుంచి 31 వరకు  14 ఏళ్లలోపు పిల్లలకు వివిధ క్రీడలపై శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ నిర్ణయించింది. ఇందుకు ఒక్కో జిల్లాకు రూ.1.05 లక్షల చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో 10 శిబిరాలు నిర్వహించేలా ఉత్తర్వులో పేర్కొన్నారు. నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చే వ్యాయామ ఉపాధ్యాయులకు రూ.4 వేల చొప్పున చెల్లిస్తారు. క్రీడా సామగ్రి కొనుగోలు కోసం రూ.50 వేలు, మైదానాల అభివృద్ధి, శిబిరాల నిర్వహణ రూ.10 వేలు, క్రీడల సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స అందించేందుకు రూ.5 వేల చొప్పున కేటాయించారు. ఖోఖో, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌ తదితర ఆటలు ఇలా ఆయా జిల్లాలో క్రీడా ప్రాచుర్యం, క్రీడాకారుల ఆసక్తి అందుబాటులో ఉన్న శిక్షకులను బట్టి శిబిరాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు.


సద్వినియోగం చేసుకోండి
ధనంజనేయులు, జిల్లా యువజన, క్రీడాధికారి, యాదాద్రిభువనగిరి

మే 1 నుంచి 31 వరకు నిర్వహించే వేసవి శిబిరాలను చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను శిబిరాలకు పంపించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. తద్వారా వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యం గుర్తించే అవకాశం ఏర్పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని