logo

పక్షం రోజుల లక్ష్యం.. ప్రచారాస్త్రాలు సిద్ధం

లోక్‌సభ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులెవరో ఇప్పటికే తేలిపోవడంతో నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం వేడెక్కుతోంది.

Updated : 28 Apr 2024 06:38 IST

నాంపల్లి, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులెవరో ఇప్పటికే తేలిపోవడంతో నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం వేడెక్కుతోంది. పోలింగ్‌కు పక్షం రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఎలాగైనా ప్రతి ఓటరును చేరేలా ప్రచారాస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ.. ప్రత్యర్థి  వైఫల్యాలను ఉటంకిస్తూ.. ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు.

 సామాజిక మాధ్యమాలతో చేరువగా..

చరవాణి ప్రతి ఒక్కరికీ చేరువ కావడంతో సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరిచి తమ ప్రసంగాలు అందరికి చేరేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నియోజకవర్గ, మండలాల వారీగా సోషల్‌ మీడియా కన్వీనర్లను నియమించుకున్నారు. వారికి అవసరమైన సాంకేతిక పరికరాలు, గాడ్జెట్లు, టెక్నాలజీని అందుబాటులో ఉంచుతున్నారు. వారి నాయకుడికి సంబంధించిన ప్రచారం చేయడంతో పాటు ప్రత్యర్థుల బలహీనతలు ఎత్తిచూపేలా కంటెంట్లు రూపొందిస్తున్నారు. ఏదైనా తప్పుగా మాట్లాడితే వాటిని వీడియోలు, మీమ్స్‌ రూపంలో అందరికీ చేరేలా విరివిగా పోస్టులు పెడుతున్నారు.

ఫ్లెక్సీలు, జెండాలకు ఆర్డర్లు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ పార్టీల అభ్యర్థులు ఫ్లెక్సీలు, జెండాలు విరివిగా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. నెల రోజుల ముందుగానే ఆర్డర్లు ఇచ్చి ఎన్నికల సామగ్రిని సమకూర్చుకుంటున్నారు. వాటిని ఏర్పాటు చేయడానికి కూలీలను సిద్ధం చేసుకుంటున్నారు. అభ్యర్థి ప్రచారానికి ఒక రోజు ముందే ఏర్పాటు చేసేలా ఆయా ప్రాంతాలకు చేరవేస్తున్నారు.

వాహనాలకు ముందస్తు బుకింగ్‌లు..

ఎన్నికల ప్రచారంలో వాహనాల పాత్ర కీలకం. గ్రామాల్లో పర్యటించడానికి కార్యాచరణ రూపొందించి పార్టీ నాయకుల వాహనాలకు అదనంగా ఇతర వాటిని అద్దెకు తీసుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 వరకు నాయకులతోనే ఉండేలా   ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామాల్లో ఇప్పటికే ప్రత్యేకంగా తయారు చేసిన ప్రచార రథాల్లో అభ్యర్థికి సంబంధించిన పాటలతో హోరెత్తిస్తున్నారు.

జనం కనిపించేలా..

ప్రచార సమయంలో ఎక్కువ సంఖ్యలో జనం కనిపించేలా.. కార్యకర్తల్లో జోష్‌ నింపేలా..  ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా రోజుకు రూ.500 వరకు ఇస్తూ ఒక పూట భోజనం పెడితే ఎంత ఖర్చవుతోందని లెక్కలు వేసుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారం చేసేలా చూడాలని ద్వితీయ శ్రేణి నాయకులకు సూచిస్తున్నారు. ఏదేమైనా ఎన్నికల ప్రచార తాపంతో ఈ వేసవి మరింత వేడెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని