logo

అలివి కాలేదట!

అలివి వలల మాఫియా చర్యలను అధికారులు నియంత్రించలేకపోతున్నారు.

Published : 03 Dec 2022 02:23 IST

జలాశయంలో అలివి వలలు

అలివి వలల మాఫియా చర్యలను అధికారులు నియంత్రించలేకపోతున్నారు. అధికార పార్టీ అండదండలు.. ముడుపుల ఆశ.. వారి చేతులు కట్టేస్తోంది. ఫలితంగా ఈ ఏడాదీ సోమశిల జలాశయంలో అక్రమ వేట మొదలైంది. సోమశిల జలాలను ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాన్ని అలవి వలలు లాగేందుకు అనువుగా చెట్లను కొట్టి చదును చేసి మరీ.. తమ దందాకు తెరలేపడం గమనార్హం.

ఆత్మకూరు, న్యూస్‌టుడే

సోమశిల జలాశయం నీటి నిల్వ విస్తీర్ణం 48 చదరపు కి.మీ. నిండుగా ఉన్న ప్రస్తుత తరుణంలో సాధారణ వేటతో చేపలు పెద్దగా పడవు. దాంతో తమ ఆదాయం కోసం కొందరు అలివి వలలను దించి వేటకు సిద్ధమయ్యారు. చెప్పాలంటే.. సోమశిలలో అలివి వలలతో వేట నిషిద్ధం. వాటితో వేటాడితే.. చిన్న చిన్న చేపపిల్లలు సహా ఊడ్చేస్తాయని.. తద్వారా మత్స్య సంపద అంతరించి.. మత్స్యకారుల జీవనం దుర్భరంగా మారుతుందని.. ఆ తరహా వేటను నిషేధించారు. కానీ, కొందరు తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందాలని వాటిని జలాశయంలోకి దించారు. సుమారు 16 వలలు సోమశిల లోతట్టులోకి వెళ్లాయి. అలివిలు లాగేందుకు జలాశయం పరిసర ప్రాంతాలను అనువుగా చేసుకున్నారు.

జలాశయం పక్కనున్న అడవిని చదును చేసి..

సరిహద్దుల సాకుగా..

అలివి వలల వేటను అడ్డుకోవాల్సిన అధికారులు.. సరిహద్దులను సాకుగా చూపుతున్నారు. జలాశయం నుంచి 2 కి.మీ. లోపలికి నెల్లూరు జిల్లా ప్రాంతం ఉంది. అక్కడి నుంచి కడప జిల్లా పరిధి వస్తుంది. అక్రమ వేట చేసే వారు ఆ జిల్లా భూభాగాన్ని వేదిక చేసుకున్నారు. దాంతో అది తమ ప్రాంతం కాదని అధికారులు అటువైపు చూడటం లేదు. ఇది అక్రమార్కులకు పరోక్షంగా ప్రోత్సాహకరంగా మారింది. గత ఏడాది అలివి వలల విషయం పెద్ద వివాదానికి దారి తీసింది. వాటిని దించకుండా మత్స్యకారులు అడ్డుకున్నారు. ఈ ఏడాది మళ్లీ గుట్టుగా అదే పని జరుగుతోంది.

జిల్లా భూభాగం కాదు...
- నాగేశ్వరరావు, జేడీ మత్స్యశాఖ

జలాశయంలో.. జిల్లా ప్రాంతంలో అలివిలతో వేటాడేందుకు అనువైన ప్రాంతం లేదు. కడప జిల్లాలో ఆ పరిస్థితులు ఉన్నాయి. అక్కడి అధికారులు వాటిని అరికట్టాల్సి ఉంది. మేము వెళితే.. మీకిక్కడ ఏం పని అంటున్నారు. దాంతో ఏమీ చేయలేకున్నాం. అక్కడి అధికారులే అరికట్టాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని