logo

ఆక్రమించు.. విక్రయించు..

నెల్లూరు నగరంలో కబ్జాకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. కొందరు అధికార పార్టీకి చెందిన చోటా నాయకులు పంట కాలువలు ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు.

Published : 28 Apr 2024 02:31 IST

కాలువలపై వైకాపా నాయకుల కన్ను

ఆక్రమణలకు గురైన పంట కాలువ

న్యూస్‌టుడే, నెెల్లూరు (నగరపాలకసంస్థ, స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు నగరంలో కబ్జాకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. కొందరు అధికార పార్టీకి చెందిన చోటా నాయకులు పంట కాలువలు ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. నగరం నుంచి వెళ్లే పంట కాలువలు ఆనవాళ్లు లేకుండాపోయాయి. పంట కాలువలను పూడ్చేస్తూ కొందరు.. తమ స్థలాల్లో కలిపేసుకుంటూ మరికొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. వీరిలో కొందరు ప్రజాప్రతినిధులు, స్థిరాస్తి వ్యాపారులు, సంఘాల పేరు చెప్పుకొనే వివిధ వర్గాల వారు ఉన్నారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోరు

నెల్లూరు నగరం మీదుగా వెళ్లే రామిరెడ్డి కాలువ, జాఫర్‌సాహెబ్‌ కాలువ, పీటర్‌సన్‌ కాలువ, మల్లపు కాలువ, ఉయ్యాల కాలువ, గచ్చు కాలువ క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చినా.. వాటి జోలికి వెళ్లడం లేదు. నగరంలో అంకణం స్థలం రూ.2 లక్షలకు పైగా పలుకుతోంది. నగరపాలకసంస్థ, నీటిపారుదలశాఖ అధికారులు పంట కాలువలు నగర పరిధిలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించలేని దుస్థితిలో ఉన్నారు. ఆక్రమణల కట్టడికి కనీస చర్యలు లేవు.

సర్వేపల్లి కాలువ వెంబడి ఆక్రమణలు

కుంచించుకుపోతూ కనుమరుగవుతూ..

నెల్లూరు నగరం సమీపంలో పెన్నా నది నుంచి సర్వేపల్లి, జాఫర్‌సాహెబ్‌ కాలువల ద్వారా సాగునీరు సరఫరా అవుతుంది. సర్వేపల్లి కాలువ హరనాథ]పురం వద్ద కృష్ణపట్నం కాలువగా చీలి ముత్తుకూరు రోడ్డు వెంబడి ధనలక్ష్మీపురం, బహ్మ్రదేవి వరకు 13కి.మీ. సాగుతుంది. నెల్లూరు నుంచి ముత్తుకూరు వెళ్లే మార్గం వెంబడి  పారిశ్రామికాభివృద్ధి జరుగుతోంది. కాలువ గట్టు ఒకవైపు ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు జరిగాయి.కొన్నిచోట్ల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆక్రమణలతో కాలువ కుంచించుకుపోయి.. పూడిక తీసేందుకు యంత్రాలు దింపలేని పరిస్థితి నెలకొంది.


ఆక్రమణలతో నగరం మునక

మాదాల వెంకటేశ్వర్లు

నగరం అభివృద్ధి చెందడంతో భూములు రియల్‌ ఎస్టేట్లుగా మారిపోయాయి. నెల్లూరు నగరంలో స్వర్ణాల చెరువు నుంచి వచ్చే పంట కాలువలు ద్వారా సాగునీటితో రైతులు పంటలు పండించుకునేవారు. దీంతో పంట కాలువలు సాగునీరు అందించడం లేదు. పంట కాలువలు ఆక్రమణల కారణంగా గతంలో మన్సూర్‌నగర్‌ మునిగిపోయింది.


ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు

గౌస్‌

పంట కాలువలను వైకాపా ప్రభుత్వం, నగరపాలకసంస్థ పట్టించుకోవడ[ం లేదు. వైకాపా ప్రభుత్వంలో కాలువలు పూర్తిగా ఆనవాళ్లు కోల్పోతున్నాయి. కాలువల గురించి కార్పొరేషన్‌, ఇరిగేషన్‌ శాఖలు పట్టించుకోవడం లేదు.


చర్యలు తీసుకోవాలి

రఘురామయ్య

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నెల్లూరు నగరాన్ని పట్టించుకోవడం లేదు. వైకాపా ప్రభుత్వం కాలువలపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి. ప్రభుత్వం పంట కాలువల్లో నీరు పారే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని