logo

కొలతలు.. కలతలు

భూ సర్వే కోసం అన్నదాతలు తిప్పలు పడుతున్నారు. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా భూ వివాదం ముగియడం లేదు. అధికారులు అర్జీలు తీసుకోవడానికే పరిమితమవుతున్నారు. వేధిస్తున్న సర్వేయర్ల కొరత సమస్యను

Published : 23 Jan 2022 04:19 IST

నెలల తరబడి దరఖాస్తుదారుల ఎదురుచూపులు
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి, న్యూస్‌టుడే, బాన్సువాడ గ్రామీణం

సర్వే చేయాల్సిన భూములు

భూ సర్వే కోసం అన్నదాతలు తిప్పలు పడుతున్నారు. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా భూ వివాదం ముగియడం లేదు. అధికారులు అర్జీలు తీసుకోవడానికే పరిమితమవుతున్నారు. వేధిస్తున్న సర్వేయర్ల కొరత సమస్యను నానాటికీ పెంచుతోంది. జిల్లాలో దాదాపుగా అన్ని మండలాల్లో ఇబ్బడిముబ్బడిగా వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోక మూలకు చేరుతున్నాయి.

నిబంధనల మేరకు.. సర్వేయరు నెలరోజుల్లోగా అర్జీలను పరిష్కరించాలి. కొంత మంది దరఖాస్తుదారులు ఇక సర్వే చేయరనే నమ్మకానికి వచ్చేశారు. పలుమార్లు ఫోన్లు చేసినా స్పందించడం లేదంటున్నారు. మరో వైపు కొన్ని గ్రామాల్లో పైరవీ ఉన్న వారి భూముల్నే సర్వే చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేతి వాటాల్ని ప్రదర్శిస్తూ నిబంధనలకు విరుద్ధంగా పూర్తి చేసినట్లు విమర్శలున్నాయి.

సర్వేయర్ల కొరత..

* జిల్లాలో 27 మంది సర్వేయర్లకు గాను 13 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో ఇద్దరు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు.

* ప్రస్తుతం జిల్లాలో 22 మండలాలకు 11 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరు రెండు మండలాల్లో పనులు చేపడుతున్నారు.  

* దీనికి తోడు జాతీయ రహదారులు, ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు, అటవీ, రెవెన్యూశాఖల తగాదాలు తేల్చేందుకు భూమి హద్దులు నిర్ణయించాల్సి వస్తోంది. దీంతో రైతుల అర్జీలు మూలనపడుతున్నాయి.

జోనల్‌ బదిలీలతో బేజారు..  జోనల్‌ బదిలీల అనంతరం సర్వే విభాగం పనితీరు అధ్వానంగా మారింది. ఇదివరకు జిల్లాలో విధులు నిర్వహించిన ఏడుగురు సర్వేయర్లు ఇతర జిల్లాలకు వెళ్లారు. కొత్తగా వచ్చిన వారు విధుల్లో చేరినప్పటికీ ఇప్పటికీ పని మొదలుపెట్టలేదు. వేరే ప్రాంతాలకు బదిలీపై వెళ్లేందుకు పైరవీలు చేసుకుంటున్నట్లు సమాచారం. దీనికి తోడు డివిజన్‌ స్థాయిలో ఉండే నలుగురు సర్వేయర్లను ఇతర జిల్లాలకు అటాచ్‌ చేశారు. వీరు రేపో మాపో రిలీవ్‌ కానున్నారు. కొత్తగా ఒక్కరిని కూడా జిల్లాకు కేటాయించలేదు.


కాలయాపన చేస్తున్నారు

బాన్సువాడ మండలం కొయ్యగుట్టకు చెందిన భాస్కర్‌ అనే రైతు మూడు నెలల కిందట భూ సర్వే కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. సర్వేనంబరు 134లో 7.5 ఎకరాలు సర్వే చేయాలని రుసుము చెల్లించారు. పక్కనే ఉన్న స్థలంలో స్థిరాస్తి వ్యాపారులు వెంచర్‌ ఏర్పాటు చేసి 35 అడుగుల మేర కబ్జా చేస్తున్నారని స్థానిక సర్వేయరును పలుమార్లు కలిసినా రేపుమాపంటూ కాలయాపన చేస్తున్నారు.


రెండు నెలలు దాటింది

బీర్కూర్‌ మండలం కిష్టాపూర్‌కు చెందిన జెట్టి ప్రభు రెండు నెలల కిందట భూమి సర్వే కోసం అధికారులను కలిసి చెప్పినంత రుసుము చెల్లించారు. సర్వేనంబరు 474లోని 2.10 ఎకరాల భూమిలో ఇతరులు బోరు వేసి ఐదు గుంటలు కబ్జా చేశారని, సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని కోరారు. సర్వేయర్‌, తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు.


వచ్చే నెల వరకు పరిష్కరిస్తాం
- శ్రీనివాస్‌, జిల్లా అధికారి, భూ కొలతల విభాగం, కామారెడ్డి

జిల్లాలో సర్వేయర్ల కొరత కారణంగా సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తికావడం లేదు. దీనిపై ఉన్నతాధికారులకు విన్నవించాం. మండలాల్లో శక్తికి మించి కష్టపడుతూనే ఉన్నారు. వచ్చే నెల వరకు పెండింగ్‌ అర్జీలన్నింటిని పరిష్కరించేలా కార్యాచరణ సిద్ధం చేశాం.

జిల్లాలో ఎఫ్‌-లైన్‌ దరఖాస్తుల వివరాలు
సర్వే నిమిత్తం వచ్చినవి 879
పరిష్కరించిని 212
పెండింగ్‌లో ఉన్నవి 667

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని