logo

వైకాపాను ఛీకొట్టి.. ఓటుకు జైకొట్టి

ఇళ్ల వద్ద ఓటు వినియోగించే వృద్ధులు, దివ్యాంగులను మాయ చేయాలని చూసిన వైకాపా నాయకుల వికృత ఆలోచనకు ఎదురు దెబ్బ తగిలింది.

Published : 28 Apr 2024 04:43 IST

పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేందుకే వృద్ధులు, దివ్యాంగులు ఆసక్తి  
అధికార పక్షం పన్నాగానికి ఎదురు దెబ్బ

వృద్ధురాలికి దరఖాస్తు అందజేస్తున్న ఎన్నికల సిబ్బంది

పార్వతీపురం, న్యూస్‌టుడే: ఇళ్ల వద్ద ఓటు వినియోగించే వృద్ధులు, దివ్యాంగులను మాయ చేయాలని చూసిన వైకాపా నాయకుల వికృత ఆలోచనకు ఎదురు దెబ్బ తగిలింది. జిల్లాలో సుమారు 16 వేలకు మందికి పైగా అర్హులు ఉండటంతో భారీగా అవకతవకలు చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. కానీ వారి ఎత్తుగడలను చిత్తు చేస్తూ చాలా మంది వయోవృద్ధులు, దివ్యాంగులు ఓటేసేందుకు నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేందుకే మొగ్గు చూపారు. అత్యుత్సాహం ప్రదర్శించిన వాలంటీర్లపై అధికారులకు ఫిర్యాదులు చేసి మరీ.. శరీరం సహకరించకపోయినా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వరుసలో నిలబడి ఓటేస్తామని ముందుకొచ్చారు. దీంతో వారికి బాగా తెలిసిన వాలంటీర్ల ద్వారా ఓట్లు పొందాలని చూసిన అధికార పార్టీ నాయకులకు చెంప దెబ్బ కొట్టినట్లు అయింది.

600 మందికి పైగా..

జిల్లాలో 85 ఏళ్లు నిండిన వారు 3,899 మంది, 40 శాతం దివ్యాంగం ఉన్న వారు 12,239 మంది ఉన్నారు. బూత్‌స్థాయి అధికారులు వారి ఇళ్లకు వెళ్లి 24-డి ఫారాలు అందించారు. ఈ దరఖాస్తులు తిరిగి అందజేస్తే వారి స్థితిని పరిశీలించి ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. జిల్లాలో అందుబాటులో ఉన్న 16 వేల మందికి పైగా దరఖాస్తులు ఇచ్చారు. వీరిలో 600 మందికి పైగా నింపి తిరిగి అధికారులకు ఇచ్చారు. బీఎల్వోల ద్వారా చైతన్యం కల్పించినా కేంద్రాలకు రావాలనే చాలా మంది నిర్ణయించుకున్నారు. మిగిలిన వారికి ఎన్నికల సంఘం సూచనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ జిల్లా స్థాయి అధికారి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

ఎన్నికల సంఘం ఆలోచన

ఈ సారి ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేలా, వృద్ధులు, దివ్యాంగులు పూర్తిస్థాయిలో ఓట్లు వినియోగించుకునేలా భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్‌ కేంద్రానికి రాలేని వారి ఇళ్లకే ఓటింగ్‌ యంత్రాలను పంపించాలని నిర్ణయించింది.  

వైకాపా దురాలోచన

వాలంటీర్లు పదవులకు రాజీనామా చేసి.. వారి పరిధిలోని దివ్యాంగులు, 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు ఎంతమంది ఉన్నారో గుర్తించాలని వైకాపా నాయకులు ఆదేశించారు. ఇంటి వద్దే ఓటేసేలా వారి నుంచి దరఖాస్తులను సేకరించి, ఆ ఓట్లన్నీ వైకాపాకే పడేలా చూడాలని పన్నాగం పన్నారు. దీంతో కొందరు వాలంటీర్లు అత్యుత్సాహం చూపి దరఖాస్తులు సైతం స్వీకరించారు.

ఓటర్ల చైతన్యం

వైకాపా నాయకుల ఆదేశాలతో కొందరు వాలంటీర్లు నేరుగా వారి పరిధిలోనే దివ్యాంగులు, వృద్ధులను కలిసేందుకు ప్రయత్నించారు. కొందరు వివరాలు తెలియజేయగా.. ఈ విధానం నచ్చని మరికొందరు నేరుగా అధికారులకే ఫిర్యాదు చేసి తెగువ చూపారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు కొందరు వాలంటీర్లపై వేటు సైతం వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని