logo

నాడు ప్రగతి... నేడు ఆధోగతి

ఎన్నికలకు ముందు ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి... అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచిపోయారు.

Published : 28 Apr 2024 04:27 IST

జగన్‌ జమానాలో ఔత్సాహికులకు అవకాశాలు దూరం
చంద్రబాబు అమలు చేసిన పథకాలకూ మంగళం

ఎన్నికలకు ముందు ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి... అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచిపోయారు. పోనీ... స్వయం ఉపాధి దిశగానైనా యువత, ఔత్సాహికులను ప్రోత్సహించారంటే అదీ లేదు. పైపెచ్చు తెదేపా హయాంలో ఆయా కార్పొరేషన్ల ద్వారా అమలు చేసిన పథకాలకు మంగళం పాడారు. గత అయిదేళ్ల కాలంలో ఒక్కరంటే ఒక్కరికీ రుణం మంజూరు కాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

న్యూస్‌టుడే - ఒంగోలు నగరం

పట్టుదలకు రాయితీ రుణం తోడై...

ఏదైనా వ్యాపారం ప్రారంభించి స్వశక్తితో బతకాలన్న పట్టదల ఉన్నా పెట్టుబడికి డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు... కబాడీపాలేనికి చెందిన నూతలపాటి మోహన్‌దాస్‌. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకం వల్ల... 2018లో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ.లక్ష రాయితీ రుణం లభించింది. ఆ మొత్తాన్ని సద్వినియోగం చేసుకుని లైటింగ్‌ దుకాణం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్థిరమైన ఆదాయంతో... ఆత్మవిశ్వాసంతో జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి స్వయం ఉపాధి పథకాలను ప్రభుత్వాలు అమలు చేస్తే పేద యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

ఉన్న వ్యాపారాన్ని విస్తరించి...

కొప్పోలుకు చెందిన ఎస్కే కాలే మస్తాన్‌ వలి... ఇస్లాంపేటలో చిన్న జిరాక్స్‌ షాపు నిర్వహించేవారు. వచ్చే ఆదాయం చాలక వ్యాపారాన్ని విస్తరించాలని భావించినా... పెట్టుబడి లేక సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో 2018లో మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా... రూ.75 వేల రాయితీతో రూ.లక్షన్నర రుణం లభించింది. ఈ మొత్తంతో ఇంటర్నెట్‌, జిరాక్స్‌ సెంటర్‌గా దుకాణాన్ని పూర్తిస్థాయిలో విస్తరించారు. ప్రస్తుతం ఇదే మా కుటుంబానికి ఆదరవుగా ఉందని తెలిపారు. ఇప్పుడు ఆ తరహా పథకాలేవీ లేకపోవడంతో ఔత్సాహికులకు స్వయం ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయన్నారు.

ఆత్మాభిమానంతో బతుకుతున్నాం...

తగిన ఆదాయ వనరులు లేక మరాఠీపాలేనికి చెందిన కాకా దుర్గాభవాని కుటుంబ పోషణకు ఇబ్బంది పడేవారు. ఈ నేపథ్యంలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా 2017లో రూ.లక్ష రాయితీ రుణం లభించింది. ఆ మొత్తంతో కిరాణా దుకాణం ఏర్పాటు చేశారు. నాణ్యత పాటిస్తూ ముందుకు సాగడంతో వినియోగదారుల నుంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు తొలగి ఆత్మాభిమానంతో బతుకుతున్నామని తెలిపారు. రాయితీ పోనూ మిగతా మొత్తానికి సంబంధించిన కిస్తీలను సైతం సక్రమంగా తిరిగి చెల్లించినట్లు చెప్పారు. ఎటువంటి హామీ, తనఖాలు లేకుండా రుణాలు ఇవ్వడం వల్ల నాలాంటి ఎందరో పేదలకు మేలు కలిగిందని వివరించారు.

తెదేపా పాలనలో అండ...

తెదేపా ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2018 వరకు నిరాటంకంగా లక్ష్యాల మేరకు స్వయం ఉపాధి రుణాలు ఇచ్చారు. ఆయా కార్పొరేషన్లు... నగరపాలక సంస్థ, ఎంపీడీవోల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసేవి. వారు నెలకొల్పే యూనిట్లను బట్టి రూ.50 వేలు నుంచి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు... ఆయా బ్యాంకుల ద్వారా రాయితీ రుణాలు అందజేశారు. ప్రతి యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం రాయితీ కల్పించింది. రుణాలు పొందిన వారు యూనిట్లు నెలకొల్పి... స్వశక్తిపై నిలవడంతో పాటు కుటుంబాలకూ ఆదరవుగా నిలిచారు. ఆ యూనిట్లు నేటికీ విజయవంతంగా నడుస్తున్నాయి.

వైకాపా ఏలుబడిలో తొండి...

జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక... అప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తున్న 13 రకాల పథకాలను రద్దు చేశారు. దీంతో గత అయిదేళ్ల కాలంలో ఔత్సాహికులకు స్వయం ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. సొంతంగా బ్యాంకు రుణాలు పొందాలంటే ఆస్తులు తనఖా పెట్టాలి. లేదంటే బ్యాంకులో డిపాజిట్లు ఉన్న వ్యక్తులెవరైనా హామీ సంతకం పెట్టాలి. ఈ షరతులతో ఎవరూ రుణాలు పొందలేకపోయారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక నగరపాలక సంస్థ కార్యాలయం ఆన్‌లైన్‌ లాగిన్‌లో ఉన్న సమాచారాన్ని సైతం తొలగించారు. ఆ వివరాలు సైతం ఇప్పుడు అందుబాటులో లేవని అధికారులు చెబుతున్నారు.


తెదేపా హయాంలో ఇంటిగ్రేటెడ్‌ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, ఈబీసీ, మైనార్టీలకు... స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు, వారు చేసే వృత్తుల అభివృద్ధికి రాయితీ రుణాలు అందజేశారు. అలా ఒక్క ఒంగోలు నియోజకవర్గం పరిధిలోనే ఆయా కార్పొరేషన్ల ద్వారా 3,193 మందికి రాయితీ రుణాలు మంజూరు చేశారు. అయిదేళ్ల వైకాపా పాలనలో ఒక్కరికీ రుణం ఇచ్చిన దాఖలాలు లేవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని