logo

గురివింద దొడ్లో అధికార మంద

నా కుమారుడు ప్రణీత్‌రెడ్డి అమాయకుడు. అతను రాజకీయంగా ఎదుగుతున్నాడని కక్షగట్టారు. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ నిరాధారమైనవే.

Updated : 28 Apr 2024 05:44 IST

అడ్డగోలుగా దుర్వినియోగం
ప్రభుత్వ సిబ్బందితోనూ రాజకీయం
వ్యక్తిగత సేవలకూ వినియోగం

  • నా కుమారుడు ప్రణీత్‌రెడ్డి అమాయకుడు. అతను రాజకీయంగా ఎదుగుతున్నాడని కక్షగట్టారు. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ నిరాధారమైనవే.
  • ఇప్పటి వరకు రాజకీయంగా నాపై దాడి చేస్తున్నారు. ఇప్పుడు నా కుటుంబం వరకు వచ్చారు. నాపై ఎన్ని కుట్రలు చేసినా సహించా, భరించా.. నా కుటుంబం జోలికొస్తే ఊరుకునేది లేదు. ఒక్కొక్కరి సంగతి తేలుస్తా.. రాజకీయం అంటే ఏంటో చూపిస్తా.
  • నా కోడలిని ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. చెప్పుకోలేని విధంగా దుర్భాషలాడారు. అందుకే సమతానగర్‌లో గొడవ జరిగింది. అక్కడ మోహన్‌ అనే వ్యక్తి అతిగా ప్రవర్తిస్తే మావాళ్లు కోటింగ్‌ ఇచ్చారు. మా వాళ్ల మీద చెయ్యి వేస్తే ఆ చేతిని తీసుకెళ్లిపోతా.!
  • కలెక్టర్‌, అధికారులు నా ఫోన్‌ తీయడం లేదు. సమస్యలు చెబుదామన్నా వినేవారు లేరు.

మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తరచూ చేస్తున్న విమర్శలివీ..

ఒంగోలు, న్యూస్‌టుడే

ఎవరేం చేస్తున్నారో తెలియదా..!

ఈ నెల 22న బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సమయంలో ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌ కానిస్టేబుల్‌ రత్నబాబు అలియాస్‌ గోపి హల్‌చల్‌ చేశాడు. ఈ ప్రక్రియ మొత్తం ఎన్నికల పరిశీలకులు డేగకన్నుతో పరిశీలిస్తుంటారనే అంశంపై అవగాహన ఉన్నా పట్టించుకోలేదు. విధులకు ఎగనామం పెట్టేసి మరీ అతను ప్రణీత్‌రెడ్డి పక్కనచేరి అంగరక్షకుడిగా హంగామా సృష్టించాడు. ఇదంతా వీడియోల్లో నిక్షిప్తమైంది. ఆ వెంటనే మరో కానిస్టేబుల్‌ వేణు తాను పనిచేయాల్సిన టంగుటూరు స్టేషన్‌లో విధులకు డుమ్మా కొట్టి యువనేతకు డ్రైవర్‌గా మారాడు. ఈ దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. క్రమశిక్షణతో మెలిగే పోలీసు శాఖలో పనిచేస్తున్న వాళ్లు. వాళ్లను తమవెంట తిప్పుకోకూడదని అధికార పార్టీ నాయకులకి తెలియదా.. తన కుమారుడి వెంట ఎవరు ఉంటున్నారు, ఎవరేం చేస్తున్నారు అనేది రెండుసార్లు మంత్రిగా, అయిదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బాలినేనికి తెలియదా! వారిని నిలువరించి, బాధ్యతగా మసలుకోవాలని చెప్పాల్సిన బాధ్యత సీనియర్‌ రాజకీయవేత్తకు లేదా.? ఇవీ ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు.

ఆ ఉద్రిక్తతకు కారకులెవరు.?

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావటానికి ముందు ఒంగోలు సమతానగర్‌లో చోటుచేసుకున్న చిన్న సంఘటన నగరంలో మూడు రోజులపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ల ప్రమేయాన్ని ఈసీ నిషేధించింది. ఎవరైనా పాల్గొంటే ఫొటోలు తీసి సీ విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేయాలని సూచించింది. బాలినేని కోడలు శ్రీకావ్య ప్రచారంలో వార్డు వాలంటీర్‌ పాల్గొన్నారు. తెదేపా మద్దతుదారు చప్పిడి ప్రభావతి ఆమె ఫొటో తీయడంతో వివాదం మొదలై ఘర్షణకు దారితీసింది. అక్కడి నుంచి అది అర్ధరాత్రి వేళ వందల మంది రోగులుండే జీజీహెచ్‌లో అల్లరిమూకల వీరంగం వరకు వెళ్లింది. ప్రచారంలో వాలంటీర్‌ పాల్గొనపోతే ఒంగోలులో రాజకీయ ఉద్రిక్తతలకు ఆస్కారమే ఉండేది కాదు.

హవ్వ.. మూకదాడికీ సమర్థింపా

సమతానగర్‌లో తెదేపా నాయకుడు మేడికొండ మోహన్‌పై వైకాపా శ్రేణులు మూకదాడి చేశాయి. అతన్ని రక్తమోడేలా కొట్టాయి. ఈ సంఘటనను ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమర్థిస్తూ మాట్లాడటం వివాదాస్పదంగా మారింది. తమవారిపై చేయి వేస్తే ఆ చేతులు తీసుకెళ్తానంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించటం సీనియర్‌ నేతకు తగునా.? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ తరహా వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధం. అయినప్పటికీ జిల్లా యంత్రాంగం ఉదాసీన వైఖరి అవలంబిస్తూనే ఉంది.

కళ్లు మూసుకున్న  ఉన్నతాధికారులు..

వైకాపా ఎన్నికల ప్రచారంలో అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తోంది. నియమావళిని ఉల్లంఘించి వాలంటీర్లు బాలినేని కుటుంబీకుల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. దీనిపై అధికార యంత్రాంగం దృష్టి సారిస్తున్న దాఖలాలు లేవు. నిన్నామొన్నటి వరకు బాలినేని వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన ఉద్యోగి తెరవెనుక ఇంకా రాజకీయ మంత్రాంగం నడుపుతున్నారు. గత ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ స్వీకరించానని సభావేదిక నుంచి సగర్వంగా ప్రకటించిన హెడ్‌ కానిస్టేబుల్‌ అదే పరిధిలో స్పెషల్‌ బ్రాంచి పనులు నిర్వర్తిస్తున్నాడు. అయినా అధికార యంత్రాంగం మాత్రం తమకేం పట్టనట్లు చోద్యం చూస్తూనే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని