logo

కన్నీటి శోకం..

గార మండలం తూలుగు కూడలి సమీపంలో సీఎస్పీ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గార గ్రామానికి చెందిన మార్పు రమణమూర్తి కుమారుడు ఓందత్తకుమార్‌ (19) ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం వెళ్తుండగా శ్రీకాకుళం నుంచి కొర్ని వస్తున్న మినీ లగేజి వాహనం బలంగా ఢీకొనడంతో తలకు తీవ్రగాయమై కాళ్లు, చేతులు విరిగిపోయాయి.

Published : 28 Apr 2024 03:40 IST

దారికాచిన మృత్యువు

ఓందత్తకుమార్‌ (పాత చిత్రం)

గార, న్యూస్‌టుడే: గార మండలం తూలుగు కూడలి సమీపంలో సీఎస్పీ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గార గ్రామానికి చెందిన మార్పు రమణమూర్తి కుమారుడు ఓందత్తకుమార్‌ (19) ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం వెళ్తుండగా శ్రీకాకుళం నుంచి కొర్ని వస్తున్న మినీ లగేజి వాహనం బలంగా ఢీకొనడంతో తలకు తీవ్రగాయమై కాళ్లు, చేతులు విరిగిపోయాయి. స్థానికులు 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించినట్లు గార ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఓందత్తకుమార్‌ విశాఖలో చదువుతుండగా వేసవి సెలవులు కావడంతో స్వగ్రామానికి వచ్చాడు. ఇంతలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

హిరమండలం, న్యూస్‌టుడే: కిట్టాలపాడు గ్రామానికి చెందిన యువకుడు పాగోటి సంతోష్‌కుమార్‌ (26) ద్విచక్ర వాహన ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్సై జి.నారాయణస్వామి శనివారం తెలిపారు. ఆయన ద్విచక్ర వాహనంపై హిరమండలం నుంచి కిట్టాలపాడు వస్తుండగా భగీరథ]పురం సమీపంలోని నవతల శ్రీముఖలింగం రహదారిలో మలుపు వద్ద వాహనం అదుపు తప్పి పడిపోయినట్లు చెప్పారు. గాయపడిన వ్యక్తిని హిరమండలం పీహెచ్‌సీ నుంచి విశాఖపట్నం కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య చికిత్సలు పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, భార్య పాగోటి గౌరీ ఉన్నారు. తన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


అదృశ్యమై.. శవంగా తేలి..!

వృద్ధురాలి అనుమానాస్పద మృతి

వజ్రపుకొత్తూరు గ్రామీణం, న్యూస్‌టుడే: వజ్రపుకొత్తూరు మండలం అమలపాడులో ఈ నెల 24న అదృశ్యమైన వృద్ధురాలు దున్న దమయంతి మృతదేహాన్ని శనివారం ఉదయం స్థానికులు డ్రైనేజీలో గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాల్లోకి వెళితే.. ఇంటి వద్ద ఉన్న దమయంతికి ఈ నెల 24న ఉదయం అల్పాహారం అందించి జీడి తోటలో పనికి వెళ్లినట్లు కుమారుడు కృష్ణారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలిస్తున్న క్రమంలో.. శనివారం ఉదయం బస్‌షెల్టర్‌ వద్ద ఉన్న డ్రైనేజీలో దుర్వాసన రావడంతో చూసిన స్థానికులు మృతదేహాన్ని గుర్తించి సమాచారం అందించారు.


10 తులాల బంగారం కోసమేనా..?

డ్రైనేజీపై సిమెంట్‌ పలకలు ఉండడంతో అందులో పడి చనిపోయే అవకాశం లేదని, ఎవరో హతమార్చి కాలువలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె 10 తులాల బంగారం ధరించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించారు. వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ రామారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం వెలికి తీయించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. బంగారం కోసమే హతమార్చారా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పి ఎస్‌ఐ ఓ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని