logo

సామూహిక నిర్లక్ష్యం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో గతంలో స్వచ్ఛ భారత్‌  కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులతో గ్రామాల్లో ఆరుబయట మలవిసర్జన నిర్మూలించేందుకు రూ.కోట్ల వ్యయంతో వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. 

Published : 28 Apr 2024 03:43 IST

మరుగుదొడ్లను గాలికొదిలేసిన వైకాపా సర్కారు

కేశవరాయునిపాలెంలో ముళ్లపొదల మధ్య మరుగుదొడ్లు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో గతంలో స్వచ్ఛ భారత్‌  కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులతో గ్రామాల్లో ఆరుబయట మలవిసర్జన నిర్మూలించేందుకు రూ.కోట్ల వ్యయంతో వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు.  వాటిని ఎక్కడా వినియోగించిన దాఖలాలు లేవు. దీంతో ప్రభుత్వం వెచ్చించిన నిధులు బూడిదలో పోసిన పన్నీరులా మారాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా గాలికొదిలేయడంతో పరిస్థితి అధ్వానంగా మారింది.

న్యూస్‌టుడే, లావేరు, రణస్థలం గ్రామీణం

ఇదీ పరిస్థితి...

జిల్లాలో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కొన్నిచోట్ల ఇప్పటికే శిథిలమయ్యాయి. మరికొన్ని చోట్ల ముళ్లపొదలతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా గ్రామానికి సుదూర ప్రాంతంలో మరుగుదొడ్ల నిర్మించడంతో వెళ్లి రావడం పెద్ద సమస్యగా మారిందని ఆయా గ్రామాలు ప్రజలు చెబుతున్నారు. నీటి సౌకర్యం కల్పించక పోవడంతో ఎక్కడా వినియోగించిన దాఖలాలు లేవు. రూ.కోట్ల నిధులు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటి వినియోగాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. అధికారులు కూడా చూసిచూడనట్లు వ్యవహిరిస్తున్నారు. ప్రభుత్వంగానీ అధికారులుగానీ వినియోగంలోకి తీసుకొచ్చే చర్యలు ఎక్కడ చేపట్టకపోవడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. పలు ప్రాంతాల్లో సామూహిక మరుగుదొడ్లు వినియోగించడం పక్కన పెడితే చూడటానికే భయంకరంగా ఉన్నాయి.

రూ.38.65 కోట్లతో పనులు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 38 మండలాల్లో గత ప్రభుత్వ హయాంలో 2.74 లక్షల మరుగుదొడ్లను రూ.38.65 కోట్లతో నిర్మించారు. అప్పట్లో లక్ష్యాలను పూర్తి చేసేందుకు జిల్లా అధికారులు ఆదేశాలతో మండల స్థాయి అధికారులు గుత్తేదారులతో నిర్మాణాలు చేపట్టారు. అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారులు ఇష్టారాజ్యంగా మరుగుదొడ్లు నిర్మించారు. కొన్ని చోట్ల నిర్మాణాలు చేపట్టి తలుపులు బిగించలేదు. మరికొన్నిచోట్ల అన్నీ పూర్తి చేసి నీటి సౌకర్యం కల్పించలేదు. ప్రధానంగా విద్యుత్తు, నీటి సౌకర్యం, స్థల ఎంపికను పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టడంతోనే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటి సంగతి పూర్తిగా గాలి కొదిలేసింది. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

వినియోగంలోకి తీసుకొస్తే ఉపయోగం...

గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన వాటిని వినియోగంలోకి తీసుకొస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా ఆరుబయట మలవిసర్జనను చాలా వరకు నిర్మూలించవచ్చు. దీంతో రోగాల బారి నుంచి బయట పడవచ్చు. అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం దీని గురించి కనీసం పట్టించుకోలేదని పలువురు పెదవి విరుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని