logo

మూలికా న్యాప్కిన్లకు ఆదరణ

హెర్బల్‌ న్యాప్‌కిన్లు తయారు చేస్తూ స్త్రీల ఆరోగ్యానికి కృషి చేస్తున్నారు రామనాథపురానికి చెందిన షర్మిలా బేగం. నెలకు రూ.50 వేల ఆదాయం గడిస్తూ విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు.

Updated : 07 Feb 2023 05:50 IST

స్త్రీలలో అనారోగ్య సమస్యలకు పరిష్కారం

 విదేశాలకూ ఎగుమతి చేస్తున్న షర్మిలా బేగం

న్యాప్కిన్లు తయారు చేస్తున్న షర్మిలా బేగం తదితరులు
సైదాపేట, న్యూస్‌టుడే: హెర్బల్‌ న్యాప్‌కిన్లు తయారు చేస్తూ స్త్రీల ఆరోగ్యానికి కృషి చేస్తున్నారు రామనాథపురానికి చెందిన షర్మిలా బేగం. నెలకు రూ.50 వేల ఆదాయం గడిస్తూ విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. పలువురు మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తన విజయం రహస్యం గురించి షర్మిలా బేగం మాటల్లో తెలుసుకుందాం.... మూడేళ్ల క్రితం అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరాను. అక్కడ పరీక్షించిన వైద్యులు నేను ఉపయోగించిన న్యాప్కిన్ల వల్లే అనారోగ్యానికి గురైనట్లు వివరించారు. సాధారణ న్యాప్కిన్లలో తడిని పీల్చుకునేవిధంగా రసాయనాలు కలుపుతారని, అవి గర్భాశయ క్యాన్సర్‌కు కారణమవుతాయని తెలిపారు. ఇంకా మంచి వాసన కోసం కలిపే రసాయనాలు స్త్రీ జననాంగం, గర్భాశయంలో పలు సమస్యలు తెస్తాయని, ఉపయోగించేందుకు సులభంగా ఉండటంతో మహిళలు ఎక్కువగా ఉపయోగించి కష్టాలు కొనితెచ్చుకుంటున్నారని చెప్పారు. అందుకు నేను దీనికి పరిష్కారం అడగగా... కాటన్‌ న్యాప్కిన్లు ఉపయోగించాలని చెప్పారు. స్త్రీ జననాంగంలో న్యాప్‌కిన్లతో సమస్యలు ఎదుర్కొనేవారు మూలికల (హెర్బల్‌)తో తయారు చేసిన వాటిని ఉపయోగించవచ్చని సూచించారు.

తయారీ ఆలోచన

దీంతో నేనే స్వయంగా మూలికలు నూరి కాటన్‌ గుడ్డలో పెట్టి ఉపయోగించటంతో సమస్య తొలగడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుపడింది. నాకు తెలిసిన మహిళల వద్ద ఇలాగే ఉపయోగించాలని సలహా ఇచ్చాను. అయితే ఎవరూ వినలేదు. ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారనే బాధ కలిగింది. అయితే వారు హెర్బల్‌ న్యాప్కిన్లకు వ్యతిరేకంగా లేరని, వారికి సమయం లేక వాడట్లేదనిపించింది. అందరూ నేను తయారు చేసి ఇస్తే ఉపయోగిస్తామని చెప్పారు. అప్పుడే ఈ వ్యాపారం చేయాలనే ఆలోచన కలిగింది.

ప్రయోజనాలపై ప్రచారం

మొదట హెర్బల్‌ న్యాప్కిన్లు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాను. చేతితోనే తయారు చేసి వైద్య కౌన్సిల్‌కు పంపి అనుమతి పొందాను. మొదట్లో నాకు తెలిసిన మహిళలకు రసాయనాలతో తయారు చేసిన న్యాప్కిన్ల వలన కలిగే సమస్యలు, హెర్బల్‌ వాటితో కలిగే ప్రయోజనాలను వివరించి ఇంటింటికీ వెళ్లి విక్రయించాను. ఆ విధంగా నేను తయారు చేసిన వాటిని ఉపయోగించినవారు మంచి మార్పును గుర్తించారు. దీంతో వారు ఇతరులకు సిఫారసు చేయడం ప్రారంభించారు. దీంతో వ్యాపారం పెరగడం మొదలైంది. కొన్ని దుకాణాల వారు నా దగ్గరకు వచ్చి ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే అధిక సంఖ్యలో చేతితో తయారు చేయడం కష్టంగా ఉండేది. దీంతో తిరువారూరులో తయారీ యంత్రాలు నాలుగు తీసుకున్నాం. ప్రస్తుతం రోజుకి 1000 తయారు చేస్తున్నాం. దీంతో మా వీధిలో ఉండే మహిళలకు కూడా ఉపాధి లభించింది. లార్జ్‌, ఎక్స్‌ట్రా లార్జ్‌, లైనర్‌, డెలివరీ అని నాలుగు రకాలు తయారు చేస్తున్నాము. వేపాకు, తులసి తదితర మూలికలతో తయారు చేస్తున్నాము. కొన్ని మూలికలు దొరకడం కష్టంగా ఉంది. దీంతో దిండుక్కల్‌ గాంధీగ్రామం విశ్వవిద్యాలయంలో మూలికలు విక్రయిస్తున్నట్లు తెలుసుకుని అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు విదేశాల్లో కూడా వినియోగదారులు ఉన్నారు.

విజయానికి కారణం అదే..

ఒకరిని చూసి మరొకరు వచ్చి చేరి ప్రస్తుతం కొనుగోలుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం మదురై, దిండిక్కల్‌, చెన్నై, తిరునెల్వేలి, తిరువారూరు, కోయంబత్తూరు, తిరుప్పూరు, దిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు పంపిస్తున్నాం. అలాగే మలేషియా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. మార్కెట్టులో దొరికే నాసిరకం వాటికంటే ఇవి ధర కాస్త ఎక్కువ. ఆరోగ్యానికి మంచి చేసే వాటికి ధర ఎక్కువైనా పర్వాలేదని కొనుగోలుదారులు భావించడం మా విజయానికి కారణం. నెలకు రూ.50 వేల ఆదాయం గడిస్తున్నాం. లాభాపేక్ష కంటే కొనుగోలుదారుల ఆరోగ్యం ముఖ్యంగా నడుపుతున్నాం.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని