logo

ఓట్ల కోసం మతవిద్వేష ప్రచారాలు తగదు

రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం మత విద్వేష ప్రసంగాలు చేయరాదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు.

Published : 24 Apr 2024 00:07 IST

ఎడప్పాడి

సైదాపేట, న్యూస్‌టుడే: రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం మత విద్వేష ప్రసంగాలు చేయరాదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. ప్రధాని మోదీ రాజస్థాన్‌లో చేసిన ప్రసంగంపై ఆయన విడుదల చేసిన ప్రకటనలో... ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాజకీయ నేతలు, దేశ ఉన్నత పదవుల్లో ఉండే ప్రధాని ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దేశ సార్వభౌమత్వానికి మంచిది కాదని పేర్కొన్నారు. ముస్లింలను కించపరిచే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. దేశ సంక్షేమానికి రాజకీయ నేతలు ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల వద్ద ఉండే బంగారం, ఆస్తులు లాక్కొని దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి ఇస్తుందని ప్రధాని తన ప్రసంగంలో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

జిల్లా కార్యదర్శులతో సమాలోచనలు

సైదాపేట: లోక్‌సభ ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉన్నాయనే దానిపై జిల్లా కార్యదర్శులతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి సమాలోచనలు జరిపారు. చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శులు డి.జయకుమార్‌, విరుగై రవి, ఆదిరాజారామ్‌, బాలగంగా, టీనగర్‌ సత్య, వెంకటేష్‌బాబు, ఆర్‌ఎస్‌ రాజేష్‌, వేళచ్చేరి అశోక్‌, కేపీ కందన్‌, మాధవరం మూర్తి, లోక్‌సభ అభ్యర్థులు రాయపురం మనో, జయవర్థన్‌, డాక్టర్‌ ప్రేమ్‌కుమార్‌, పెరుంబాక్కం రాజశేఖర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శులు పరిస్థితులు వివరించారు. ఈ సందర్భంగా శశికళ అన్నాడీఎంకే కార్యకర్తలకు రాసిన లేఖ గురించి కూడా చర్చించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని