logo

నిరంతర కృషితో ఉన్నత పదవులకు..

టీఎన్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షలో తిరుప్పూర్‌ కలెక్టర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగినులు ఉత్తీర్ణత సాధించారు.

Published : 28 Apr 2024 00:34 IST

 గ్రూప్‌-1 ఫలితాల్లో ప్రభుత్వ ఉద్యోగినుల సత్తా 
ముగ్గురూ తిరుప్పూర్‌ కలెక్టరేట్‌లోనే విధులు

సుభాషిణి, నిత్య, ఇందిరా ప్రియదర్శిని

న్యూస్‌టుడే, ఆర్కేనగర్‌ : టీఎన్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షలో తిరుప్పూర్‌ కలెక్టర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగినులు ఉత్తీర్ణత సాధించారు. ఈరోడ్‌ జిల్లా నంబియార్‌ చిన్నశెట్టిపాళ్యంకు చెందిన సుభాషిణి (26) ఇంజినీరింగ్‌ చదివారు. ఈమె టీఎన్‌పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి 2020లో తిరుప్పూర్‌ సహకారశాఖలో సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం పొందారు. ఆ ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు సన్నద్ధమవసాగారు. ప్రస్తుతం గ్రూప్‌-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 49వ స్థానంలో నిలిచారు. సహకారశాఖలోనే డిప్యూటీ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించనున్నారు. ఈమె తల్లిదండ్రులు కాలియప్పస్వామి, ఉమామహేశ్వరి. తండ్రి రైతు. తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. దీని గురించి సుభాషిణి మాట్లాడుతూ.. ‘ఉద్యోగానికి వెళ్లి వస్తూ తక్కువ సమయంలోనే పరీక్షలకు సిద్ధమయ్యాను. నేను విజయం సాధించడం చూసి నా చెల్లి కూడా పోటీ పరీక్షలకు చదువుతోంద’ని పేర్కొన్నారు.

తీరిక సమయాల్లో చదువు

అదేవిధంగా తిరుప్పూర్‌ జిల్లా ఉడుమలైకు చెందిన ఇందిరా ప్రియదర్శిని (28) బీఎస్సీ అగ్రికల్చర్‌ పట్టభద్రురాలు. వ్యవసాయ శాఖలో మడత్తుకుళలో 2019లో విధుల్లో చేరారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో పనిస్తున్నారు. ఈమె గ్రూప్‌-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధిచి 35 స్థానంలో నిలిచి వాణిజ్య పన్నులశాఖలో సహాయ కమిషనర్‌గా బాధ్యతలు అందుకోనున్నారు. తాను సాధించిన విజయం గురించి ఆమె మాట్లాడుతూ... ‘వ్యవసాయశాఖలో పనిచేస్తున్నందున పలు ప్రాంతాలకు వెళ్లి ఇంటికి చేరుకోవడానికి ఆలస్యం అవుతుంది. దొరికిన సమయంలోనే పరీక్షకు చదువుతూ వచ్చాను. అందుకే నేడు విజయం సాధించగలిగాన’ని అంటున్నారు. ప్రియదర్శిని తండ్రి కేశవన్‌ చెప్పుల వ్యాపారి. తల్లి దేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు.

ఆత్మవిశ్వాసంతో విజయం

ఈరోడ్‌ జిల్లా పెరుందురై తడుప్పది గ్రామానికి చెందిన నిత్య (26) బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివారు. ఈమె గ్రూప్‌-4లో ఉత్తీర్ణత సాధించి 2020లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. ప్రభుత్వ ఉద్యోగం దొరికిందని సరిపెట్టుకోకుండా నిరంతరం చదువుతూ గ్రూప్‌-2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఉద్యోగంలో చేరారు. ఇప్పుడు గ్రూప్‌-1లో ఉత్తీర్ణత సాధించి 10వ స్థానంలో నిలిచి సహాయ కలెక్టర్‌గా బాధ్యతలు అందుకోనున్నారు. ఈమె తండ్రి పళనిస్వామి రైతు. దీని గురించి నిత్య మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో గ్రూప్‌-1లో 95 మంది ఉత్తీర్ణత సాధించారు. అందులో ముగ్గురు తిరప్పూర్‌ కలెక్టర్‌ కార్యాలయంలో పలు హోదాల్లో పనిచేస్తున్నారు. జీవితంలో ఏ చోటా నిరుత్సాహం చెందలేదు. మా నిరంతర కృషితోనే ఆ స్థాయికి వచ్చామ’ని ఆమె పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని