logo

తాగునీటి సమస్య తలెత్తదు

చెన్నై మహానగరంలో సెప్టెంబర్‌ వరకు తాగునీటి సమస్య తలెత్తే అవకాశం లేదని చెన్నై తాగునీటి బోర్డు తెలిపింది.

Published : 29 Apr 2024 00:16 IST

చెన్నైలో సెప్టెంబర్‌ వరకు ఇబ్బంది లేదంటున్న అధికారులు

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: చెన్నై మహానగరంలో సెప్టెంబర్‌ వరకు తాగునీటి సమస్య తలెత్తే అవకాశం లేదని చెన్నై తాగునీటి బోర్డు తెలిపింది. సాధారణంగా మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 27 వరకు రాష్ట్రంలో సరాసరిగా 54 మి.మీ వర్షపాతం నమోదవుతుంది. కానీ ఈ ఏడాది 9.4 మి.మీ నమోదైంది. ఇది సాధారణం కంటే 83 శాతం తక్కువ. ఈ కాలంలో చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, వేలూర్‌, తిరువణ్ణామలై, తిరుప్పత్తూర్‌, కడలూర్‌, ధర్మపురి, కృష్ణగిరి తదితర 16 జిల్లాల్లో అసలు వర్షాలే పడలేదు. అదే సమయంలో రోజురోజుకూ వేడితాపం అధికమవుతూ ఉంది. ఇందుకు సంబంధించి భారత వాతావరణ పరిశోధన కేంద్ర దక్షిణ మండల అధ్యక్షుడు బాలచంద్రన్‌ మాట్లాడుతూ... ప్రస్తుతం పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వేడితాపం అధికమవుతుందన్నారు.

చెరువుల్లో తగ్గుతున్న నీటిమట్టం

చెన్నై తాగునీటి అవసరాలు తీర్చే చెరువుల్లో నీటిమట్టం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం పూండి చెరువులో 1,020 మిలియన్‌ క్యూబిక్‌ అడుగులు, చోళవరంలో 130 మిలియన్‌ క్యూబిక్‌లు, పుళల్‌లో 2,930 మిలియన్‌ క్యూబిక్‌లు, కన్నన్‌కోట్టై-తేర్వాయికండిగైలో 386 మిలియన్‌ క్యూబిక్‌లు, చెంబరంబాక్కం చెరువులో 2,389 మిలియన్‌ క్యూబిక్‌ అడుగులు మొత్తం 6,855 మిలియన్‌ క్యూబిక్‌ అడుగుల నీరు నిల్వ ఉంది. వీరాణం చెరువు పూర్తిగా ఎండిపోయింది. గత ఏడాది ఇదే సమయానికి 8,263 మిలియన్‌ క్యూబిక్‌ అడుగుల నీరు ఉంది. ఈ ఏడాది నీటి నిల్వలు శనివారం నాటికి 1,408 మిలియన్‌ క్యూబిక్‌ అడుగులకన్నా తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది వేసవిలో తాగునీటి సమస్య ఏర్పడుతుందేమోనని భయపడుతున్నారు.

ఆదుకోనున్న నిర్లవణీకరణ ప్లాంట్లు

దీని గురించి చెన్నై తాగునీటి బోర్డు అధికారులు మాట్లాడుతూ... ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతో సెప్టెంబర్‌ వరకు చెన్నైకు తాగునీరు అందించవచ్చన్నారు. అదేవిధంగా నిర్లవణీకరణ పథకం కింద ఇప్పటికే మీంజూర్‌, నెమ్మెలిలో నిత్యం 210 మిలియన్‌ లీటర్ల తాగునీరు అందుతోందని, ఈ  ఏడాది నెమ్మెలిలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన నిర్లవణీకరణ ప్లాంటు ద్వారా నిత్యం 150 మి.లీటర్ల తాగునీరు అందుతుందని తెలిపారు. కావున ఈ ఏడాది వేసవిలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని