logo

భార్య, బిడ్డ మృతికేసులో భర్త అరెస్టు

పురుగుల మందు తాగి భార్య, బిడ్డ మృతిచెందిన సంఘటనలో...భర్త సంపంగి మోహనకృష్ణను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత శైలజ పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో

Published : 02 Oct 2022 04:46 IST

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: పురుగుల మందు తాగి భార్య, బిడ్డ మృతిచెందిన సంఘటనలో...భర్త సంపంగి మోహనకృష్ణను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత శైలజ పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో ఆమెతో పాటు చిన్నారి అక్షిత మృతిచెందిన సంగతి విదితమే. భర్త వేధింపులే దీనికి కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శైలజ భర్తను పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సి.ఐ. ప్రసాద్‌ తెలిపారు.

చికిత్స పొందుతున్న తుషిత : ఈ సంఘటనలో శైలజ పెద్దకుమార్తె తుషిత(4) ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వైద్యుల పరిశీలనలోనే ఉందని.. ఇంకా 72 గంటలు పరిశీలనలో ఉంచాల్సి ఉందని వైద్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.


‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌’లో 142 మందికి జైలు

ఎం.వి.పి.కాలనీ, భీమునిపట్నం, న్యూస్‌టుడే: వేములవలస మార్కెట్‌, ఆనందపురం, భీమిలి క్రాస్‌రోడ్డు, భీమిలి, తగరపువలస ముఖ్య కూడళ్లలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తున్న 142 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. వీరిలో భీమిలి పోలీసుస్టేషన్‌ పరిధిలో 69 మంది, ఆనందపురం పోలీసుస్టేషన్‌ పరిధిలో 73 మంది ఉన్నారు. వీరిని భీమిలి 14వ అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ముందు శనివారం హాజరుపరిచగా.. మోటారు వాహన చట్టం ప్రకారం ఒక్కొక్కరికి ఐదు రోజుల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు రోజులు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సిందిగా తీర్పు ఇచ్చారు. దీంతో శిక్ష పడిన వారిని కేంద్ర కారాగారానికి తరలించారు.


భార్యను వేధించిన కేసులో భర్తకు ఆరు నెలల శిక్ష

విశాఖ, న్యూస్‌టుడే: భార్యను వేధించిన కేసులో నేరం రుజువు కావడంతో భర్తకు ఆరు నెలల కారాగార శిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధిస్తూ ఒకటో అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానం న్యాయమూర్తి సీహెచ్‌.యుగంధర్‌ తీర్పునిచ్చారు. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సింహాచలం ప్రాంతానికి చెందిన బత్తుల కృష్ణకిషోర్‌తో నగరానికి చెందిన బి.వి.ప్రశాంతి వివాహం 2013లో జరిగింది. ఆ సమయంలో ప్రశాంతి తల్లిదండ్రులు రూ.3 లక్షల కట్నం ఇచ్చారు. మొదట్లో వీరి కాపురం సజావుగానే సాగింది. అనంతరం కృష్ణకిషోర్‌ మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకుని, అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడు. ఈ మేరకు బాధితురాలు మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని న్యాయస్థానంలో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి యుగంధర్‌ నిందితునికి పైవిధంగా శిక్ష విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని