logo

Rushikonda: ప్రైవేటు నిర్వహణకు రుషికొండ బీచ్‌.. మరోసారి టెండరు పిలిచిన ఏపీటీడీసీ

రుషికొండ బీచ్‌లో అడుగు పెట్టాలంటే ప్రవేశ రుసుం చెల్లించాల్సిందే. ఇప్పటివరకు ఉచిత ప్రవేశం ఉండగా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) బీచ్‌ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేలా నిర్ణయం తీసుకుంది.

Published : 14 Nov 2022 09:22 IST

రుషికొండ బీచ్‌లో అడుగు పెట్టాలంటే ప్రవేశ రుసుం చెల్లించాల్సిందే. ఇప్పటివరకు ఉచిత ప్రవేశం ఉండగా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) బీచ్‌ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేలా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి గత నెలలోనే టెండర్లు ఆహ్వానించారు. గడువులోగా ఎవరూ స్పందించకపోవడంతో రెండోసారి టెండరు పిలిచింది. ఈ నెల ఏడున దీనికి సంబంధించిన ప్రీబిడ్‌ సమావేశం జరిగింది. ఈ నెల 18న టెండరు తెరవనున్నారు.

పర్యాటకులపై భారం..

పర్యాటకులను ఆకట్టుకునేలా తీరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆకట్టుకునే స్థాయిలో బీచ్‌లో ప్రమాణాలు పాటించాలి. ఏపీటీడీసీ దీని నిర్వహణ చేపట్టడంలో విఫలమవుతోంది. ఏటా లక్షల రూపాయలు ఇందుకోసం వెచ్చించాల్సి వస్తోంది. అయినప్పటికీ తగిన ప్రమాణాలు పాటించలేకపోతుందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటుకు అప్పగించడం ద్వారా ఖర్చు తగ్గించుకునే మార్గంతో పాటు ఏపీటీడీసీకు కొంత ఆదాయం వస్తుందని అప్పగించేస్తున్నారు. దీంతో వచ్చే పర్యాటకుల మీద భారం మోపనున్నారు. సాధారణ రోజుల్లో వేల సంఖ్యలో సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. వారాంతాలు, ప్రత్యేక రోజుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువ. త్వరలో ప్రవేశ రుసుం మొదలుకొని పార్కింగు, బీచ్‌లో సౌకర్యాలు, సేవలను వినియోగించుకున్నందుకు సందర్శకుల నుంచి టిక్కెట్ల రూపంలో వివిధ రకాల రుసుముల్ని ప్రైవేటు సంస్థ ద్వారా వసూలు చేయనున్నారు. ప్రస్తుతం కేవలం పార్కింగ్‌ రుసుం మాత్రమే వసూలు చేస్తున్నారు.

* బ్లూఫ్లాగ్‌ బీచ్‌లో మౌలిక వసతుల కల్పనతో పాటు మొత్తం నిర్వహణ, తీరంలో సురక్షిత విధానాల పాటింపు, పహారా సేవలు అందించాలి. లైఫ్‌గార్డులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, దస్తులు మార్చుకునే గదులు, సౌరవిద్యుత్తు, తాగునీటి నిర్వహణ చేపట్టాలి. వ్యర్థాల నిర్వహణ, ఎల్‌ఈడీ విద్యుత్తు దీపాలు, నడక దారులు, సీసీ టీవీ కెమెరాలు నిర్వహించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని