logo

అన్నంపై పగెందుకు జగన్‌!!

అన్నదానం మహాదానం అన్న మాట వెనుక ఎంతో అర్థముంది. అదే స్ఫూర్తితో తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ‘అన్న క్యాంటీన్లు’ పేదల ఆకలి తీర్చాయి. బడుగులు ఆకలితో బాధ పడకూదనే సహృదయంతో చంద్రబాబు ఏర్పాటు చేస్తే...

Updated : 10 Apr 2024 09:35 IST

పేదల పొట్టకొట్టిన వైకాపా ప్రభుత్వం
రూ.5కే భోజనం లభించే అన్నక్యాంటీన్ల మూసివేత

అన్న క్యాంటీన్‌ ఉన్నప్పుడు ధైర్యంగా రోడ్డు మీదకొచ్చి పని వెతుక్కునే వాళ్లం. ఆ రోజు పని దొరక్కపోయినా ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే రూ.5కే కడుపునిండా అన్నం లభించేది. ఇప్పుడు పనులు కూడా దొరకడం లేదు. వైకాపా వచ్చాక అర్ధాకలి బతుకులు అయిపోయాయి’.

ఇదీ ఓ రోజువారీ కూలీ ఆవేదన


న్నదానం మహాదానం అన్న మాట వెనుక ఎంతో అర్థముంది. అదే స్ఫూర్తితో తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ‘అన్న క్యాంటీన్లు’ పేదల ఆకలి తీర్చాయి. బడుగులు ఆకలితో బాధ పడకూదనే సహృదయంతో చంద్రబాబు ఏర్పాటు చేస్తే... అధికారంలోకి వచ్చిన జగన్‌ ‘అన్న క్యాంటీన్ల’ను నిర్దయగా మూసేసి పేదలంటే ఎంత చులకనో చేతల్లోనే చూపించారు. ఈ నిర్ణయంతో... అప్పటి వరకూ రూ. 5లకే కడుపునిండా భోజనం చేసే పేదలు ఒక్కసారిగా విలవిల్లాడారు. ఐదేళ్లుగా ఆ బాధను పంటికింద భరిస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో ఓటు హక్కుతో తమ సత్తా చాటి...మళ్లీ అన్నక్యాంటీన్లు నడిపించేలా చేస్తామని ప్రతిన బూనుతున్నారు.

కన్నుకుట్టింది: నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ నామస్మరణ చేస్తున్న సీఎం జగన్‌ చివరకు అదే నిరుపేదల నోట్లో మట్టి కొట్టారు. పేదలకు కడుపునిండా తిండి పెట్టాలన్న మహోన్నత లక్ష్యంతో గత తెదేపా ప్రభుత్వం అన్నక్యాంటీన్లను ప్రారంభించింది. కేవలం రూ.5కే భోజనం లభించేది. దీంతో అనాథలు, పేదలు, రోగుల సహాయకులు, వీధి వర్తకులు, కూలీలు, వివిధ రంగాల కార్మికులు, తదితరులు మూడు పూటలా ఎంచక్కా కడుపునింపుకునేవారు. 2019లో జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక కన్నుకుట్టింది.  తెదేపా ప్రభుత్వం మీద అక్కసుతో అన్నక్యాంటీన్లను అన్యాయంగా మూయించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అన్నక్యాంటీన్ల భవనాలు ప్రస్తుతం అధ్వానంగా మారాయి. నాడు పేదల ఆకలి తీర్చిన నిర్మాణాలు నేడు ఎందుకూ పనికిరాని విధంగా మార్చేశారు.

మూతపడిన అన్న క్యాంటీన్‌

నెలకు రూ.3 వేలు మిగిలేవి..

ఏ ప్రభుత్వమైనా పేదలకు మేలు చేసే పథకాలను తప్పక కొనసాగిస్తుంది. వైకాపాకు అలాంటి ఆలోచనే లేదు.  అన్నక్యాంటీన్ల విషయంలో కక్ష కట్టినట్లు వ్యవహరించింది. మాటల్లో పేదలపై ఎంతో ప్రేమ కురిపించే జగన్‌ తీరువల్ల ఎంతో మంది అర్ధాకలితో రోజులు గడుపుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.5కు భోజనం ఇక్కడ అందించేవారు.  మూడు పూటలా తిన్నా రూ.15 ఖర్చయ్యేది. నాణ్యమైన పోషకాహారం దొరికేది. ఇప్పుడు వందల్లో ఖర్చు చేసినా.. ఆ సంతృప్తి దొరకడం లేదు. పైగా ఇప్పుడు ఆ ఖర్చు రూ.100 అవుతోంది. అలా నెలకు రూ.3 వేల వరకూ, ఏడాదికి రూ.36 వేల వరకూ ఖర్చవుతోంది. సంపాదించిన ఆదాయంలో సగం డబ్బులు ఈ రూపంలోనే ఖర్చైపోతున్నాయి. బటన్‌ నొక్కి పేదలను ఆదుకుంటున్నానంటున్న జగన్‌కు ఇవన్నీ కనిపించవా అని పేదలు మండిపడుతున్నారు.

ఇలా.. జిల్లాలో..

నియోజకవర్గాలు7
సగటున రోజుకి భోజనం చేసిన వారు (సుమారు) 27,620
ప్రయోజనం: ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు చేసేవారు. ప్రతి నెలా లక్షలాది మంది ఈ క్యాంటీన్లను వినియోగించుకునేవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని