logo

ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!

ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్‌ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు.

Published : 19 Apr 2024 04:44 IST

వైకాపా పాలనలో ఉపాధి లేక వెతలు
రోడ్డునపడ్డ భవన నిర్మాణ కార్మికులు
దిక్కుతోచక వలస పోతున్న పేదలు

ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్‌ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. ముఖ్యంగా తమ బతుకుల్లో వెలుగులొస్తాయని భవన నిర్మాణ కార్మికులు ఎంతగానో ఆశపడ్డారు. అలాంటి బడుగుల జీవితాల్లో వైకాపా ప్రభుత్వం ఏకంగా ఇసుక తుపాను సృష్టించి అతలాకుతలం చేసింది. ఐదేళ్లుగా ప్రతి రోజు పడుతున్న కష్టాలను తలచుకొని కుమిలిపోతున్న భవన నిర్మాణ కార్మికులు... ఏ క్షణం ఎన్నికలు జరిగినా తమ గుండెమంట చల్లారే తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఈనాడు, విశాఖపట్నం

పనులకోసం వచ్చి వేచి ఉన్న కార్మికులు

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణరంగం కుదేలైంది. గత ప్రభుత్వంలో ఉన్న ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి సరఫరాను నిలిపేయడంతో పెద్ద సంఖ్యలో కార్మికులు రోడ్డునపడ్డారు. ఈ నిర్ణయం విశాఖ జిల్లాలో 1.50 లక్షల మంది భవన నిర్మాణ, అనుబంధ రంగాల కార్మికులపై తీవ్ర ప్రభావం చూపింది. వందల సంఖ్యలోని భారీ ప్రాజెక్టులు, వేల సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి.

ఇప్పటికీ కొరతే: జిల్లాలో భవన నిర్మాణాలకు ఇసుక కొరత ఇప్పటికీ వేధిస్తుంది. పూర్తిస్థాయి ఇసుక నిల్వ కేంద్రాలు లేక అవస్థలు తప్పడం లేదు. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంలో సరిపడా దొరక్క అటు శ్రీకాకుళం, ఇటు రాజమహేంద్రవరం నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది.కొనుగోలుదారులకు ఇది అదనపు భారంగా మారింది. గతంలో ముడసర్లోవ, లంకెలపాలెం, భీమిలిలో నిల్వ కేంద్రాలు ఉండేవి. ఏడాది నుంచి వాటిని ప్రభుత్వం ఎత్తేసింది. రోజుకు పది వేల టన్నుల ఇసుక అవసరం. మొదట్లో ఆరు వేల టన్నులు సరఫరా చేసేవారు. ప్రస్తుతం అది కూడా లేకుండా పోయింది.

అవి భయానక క్షణాలు: గత ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖ ద్వారా అనేక పథకాలు అందేవి. అన్న క్యాంటీన్లలో తక్కువ ధరకు భోజనం అందేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కార్మిక సంక్షేమ బోర్డు నుంచి పిల్లల చదువులు, కుటుంబ అవసరాలకు ఏ పథకాలు అందకపోగా ఈ ప్రభుత్వం అందులోని డబ్బులు వాడేసింది. ఇసుక కష్టాల సమయంలో  రోడ్డున పడాల్సిన దుస్థితి వచ్చింది. పిల్లల చదువులకు ఫీజులు కట్టలేకపోయారు. ఇంటి అద్దెలు, నెలవారి కిస్తీలు చెల్లించలేకపోయారు. కూలి పనులు లేక పూటగడవడం కష్టంగా మారి కొత్తగా అప్పులు చేయాల్సివచ్చింది. కొందరైతే ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లిపోయారు. ఆ కష్టాల భయానక పరిస్థితులు ఇప్పటికీ కార్మికులను వెంటాడుతున్నాయి. నాడు చేసిన అప్పుల భారం నేటికీ తీరలేదు.

వేల కుటుంబాల ఆవేదన: తెదేపా హయాంలో రోజు వారి కూలీలు పనులకు వెళ్తే నిత్యం రూ.700లు దక్కేవి. అలా నెలలో 25 రోజులు పనిచేస్తే 17,500 వచ్చేది. కుటుంబంలో ఇద్దరు వెళ్తే ఆ మేరకు ఆదాయం ఉండేది. వైకాపా పాలనలో గడ్డురోజులు ఎదురై  కొన్ని నెలలపాటు పనులు కరవయ్యాయి. మధ్యవయస్కులు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌కు వలసపోయారు. చాలా మంది విశాఖలో పనుల్లేక, ఇక్కడ ఉండలేక సొంతూళ్లకు వెళ్లిపోయారు. అక్కడా పనులు లేక...ఆదాయం రాక నిత్యం సతమతమవుతున్నారు.

జిల్లాలో నియోజక వర్గాల్లో నమోదైన కార్మికులు (సుమారు): 1,58,000

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని