logo

విశాఖ లోక్‌సభ స్థానానికి 8మంది నామపత్రాలు

విశాఖ లోక్‌సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్‌పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్‌ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ,  జైమహాభారత్‌ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్‌, గాదం అప్పలనర్సింహ ఆనంద్‌ కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు.

Published : 25 Apr 2024 05:15 IST

నేటితో ముగియనున్న గడువు

రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ మల్లికార్జునకు నామపత్రాలు అందజేస్తున్న మెట్టరామారావు, కొంగరపు గణపతి, అచ్యుత కిరణ్‌బాలాజీ, నాగ సత్యనారాయణ, మురాల అరుణశ్రీ

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విశాఖ లోక్‌సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్‌పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్‌ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ,  జైమహాభారత్‌ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్‌, గాదం అప్పలనర్సింహ ఆనంద్‌ కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు.

అసెంబ్లీ స్థానాలకు 44 దాఖలు: జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు 44 మంది అభ్యర్థులు బుధవారం నామపత్రాలు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుÄలతో పాటు పలువురు స్వతంత్రులు వీరిలో ఉన్నారు. భీమిలి 8, తూర్పు 8, విశాఖ దక్షిణం 7, ఉత్తరం 5, విశాఖ పశ్చిమం 6, గాజువాక 7, పెందుర్తికి 3 చొప్పున వచ్చాయి. నామపత్రాల దాఖలుకు గురువారంతో గడువు ముగియనున్నది.

వైకాపా హయాంలో ‘పల్లా’పై మూడు కేసులు

గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కుటుంబ అప్పులు గత అయిదేళ్లలో అయిదింతలు పెరిగాయి. 2019లో అప్పులు రూ.40.45 లక్షలు. వారి ప్రస్తుత అప్పులు రూ.2.33 కోట్లు. ఆయనపై వైకాపా హయాంలో మూడు కేసులు పెట్టారు. పల్లా కుటుంబ ఉమ్మడి ఆస్తుల విలువ రూ.34.32 కోట్లు. వాటిలో శ్రీనివాసరావు పేరిట స్థిరాస్తులు రూ.7.13 కోట్లు, చరాస్తులు రూ.14.91 లక్షలు. ఆయన భార్య లావణ్య దేవి పేరిట స్థిరాస్తులు రూ.6.59 కోట్లు, చరాస్తులు రూ.61.34 లక్షలు. అవిభక్త కుటుంబానికి (హెచ్‌యూఎఫ్‌) రూ.20.26 కోట్లున్నాయి. మార్గదర్శి ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.18 లక్షల చీటీ ఉన్నట్లు పేర్కొన్నారు.

విశాఖ తూర్పులో ఎంవీవీ...

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విశాఖ తూర్పు వైకాపా అభ్యర్థిగా, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బుధవారం నామపత్రం దాఖలు చేశారు. ఎంవీపీ కాలనీలోని కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు  ర్యాలీ నిర్వహించారు. ఆర్కేబీచ్‌, కోస్టల్‌బ్యాటరీ మీదుగా కలెక్టరేట్‌కు మధ్యాహ్నం 1.30గంటలకు ర్యాలీ చేరుకుంది. అనంతరం నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జేసీ మయూర్‌అశోక్‌కు ఎంవీవీ నామపత్రం అందజేశారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ముఖ్య నేతలు ర్యాలీలో పాల్గొన్నారు.

గాజువాకలో అమర్‌నాథ్‌...

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే : గాజువాక నియోజకవర్గం వైకాపా అభ్యర్థిగా... రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌  బుధవారం నామినేషన్‌ వేశారు. ఉదయం తన స్వగ్రామం మింది నుంచి ర్యాలీగా గాజువాక తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారి లక్ష్మారెడ్డికి నామపత్రాలు అందించారు. ర్యాలీలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భీమిలిలో ముత్తంశెట్టి...

గ్రామీణభీమిలి, న్యూస్‌ టుడే: భీమిలి వైకాపా అభ్యర్థిగా సిటింగు ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బుధవారం నామినేషన్‌ వేశారు. భార్య జ్ఞానేశ్వరి, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, తదితరులతో కలిసి ఆయన నాలుగు సెట్ల నామపత్రాలను ఎన్నికల రిటర్నింగు అధికారి ఎస్‌.భాస్కరరెడ్డికి అందించారు. డమ్మీ అభ్యర్థిగా ముత్తంశెట్టి భార్య జ్ఞానేశ్వరి కూడా రెండుసెట్ల నామినేషన్‌ వేశారు. అంతకుముందు భీమిలి బీచ్‌లో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు మాట్లాడారు.  అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో ఆర్డీవో కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేశారు.

భారీగా పెరిగిన గణబాబు అప్పులు: విశాఖ పశ్చిమ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పి.గణ వెంకట రెడ్డి నాయుడు (గణబాబు) అప్పులు గత అయిదేళ్లలో భారీగా పెరిగాయి. 2019లో వారి కుటుంబ అప్పులు రూ.93 లక్షలు. ప్రస్తుతం వారికి రూ.12.67 కోట్ల అప్పులున్నాయి. వారి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.39.67 కోట్లు. వీటిలో ఆయన పేరిట చరాస్తులు రూ.60.39 లక్షలు, స్థిరాస్తులు రూ.35.41 కోట్లు. ఆయన భార్య మాధవీ లత పేరిట చరాస్తులు రూ.42.14 లక్షలు, స్థిరాస్తులు రూ.1.05 కోట్లు. అవిభక్త కుటుంబానికి (హెచ్‌యూఎఫ్‌) రూ.2.63 కోట్ల ఆస్తులున్నాయి. ఆయనపై కేసులు లేవు.
వంశీకృష్ణ ఆస్తులు రూ.13.32 కోట్లు:  విశాఖ దక్షిణం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌కు స్థిర, చరాస్తులు కలిపి రూ.13.32కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో ప్రస్తావించారు. వంశీకృష్ణ, ఆయన సతీమణి, ఇతర కుటుంబ సభ్యుల పేరుతో చరాస్తులు రూ.7.41కోట్లు, స్థిరాస్తులు రూ.5.91కోట్లు  ఉన్నట్లు వెల్లడించారు. వంశీకృష్ణ పేరుతో 663 గ్రాముల బంగారం ఉంది. అప్పులు రూ.2.11కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఏడు క్రిమినల్‌, సివిల్‌ కేసులు నమోదై ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని