logo

పేదల ఆశలపై నీళ్లు.. పాలకులేనా వీళ్లు!!

‘జగన్‌ మీ బిడ్డ. ఎన్నికలప్పుడు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా ఉండను. 2020 వరకు సమయం ఇవ్వండి.

Updated : 28 Apr 2024 04:23 IST

కల్యాణమస్తు, షాదీ తోఫా అమలులో నిర్లక్ష్యం
‘రెట్టింపు’ పేరిట జగన్‌ దగా

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: జగన్‌ మాట: ‘జగన్‌ మీ బిడ్డ. ఎన్నికలప్పుడు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా ఉండను. 2020 వరకు సమయం ఇవ్వండి. బ్రహ్మాండమైన ‘పెళ్లికానుక’ పథకాన్ని తీసుకొస్తాం. గతంలో చంద్రబాబు ఇచ్చిన ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేసి ఇస్తాం.

2019 నవంబరు 11న విజయవాడలో..


ఇదీ మోసం: అధికారంలోకి రాగానే నిబంధనలు మార్చారు. అమ్మాయిలు కనీసం డిగ్రీ వరకైనా చదవాలనే ఉద్దేశంతోనే పదో తరగతి నిబంధన పెట్టామన్నారు. ఎక్కువ మందికి లబ్ధి కలగకుండా కట్టడి చేశారు. ఆరు దశల వడపోతతో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించారు. సాయం అందజేతలోనూ ఆలస్యం చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, ఇతర వర్గాలకు అండగా ఉంటానని ప్రతిపక్షనేతగా జగన్‌ ఊరూరా ప్రచారం చేశారు. పేదింట ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థికసాయం అందజేస్తామని గత ఎన్నికల ముందు ఊదరగొట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం కల్యాణమస్తు, ముస్లిం వర్గాల వారికి షాదీ తోఫా అమలు చేస్తామన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక పేద వర్గాల ఆశలపై నీళ్లు చల్లారు. తెదేపా హయాంలో తీసుకొచ్చిన పథకానికి హడావుడిగా పేరు మార్చిన జగన్‌ ప్రభుత్వం..అమలులో నిరక్ష్యంగా వ్యవహరించింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడేళ్ల పాటు దీనిపై కనీసం దృష్టి పెట్టలేదు. దీంతో పేద కుటుంబంలో వివాహం జరిపించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

కొవిడ్‌ సాకు చూపి: గత తెదేపా ప్రభుత్వం 2018లో ‘పెళ్లి కానుక’ పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వంలో 2018-19లో ఉమ్మడి జిల్లాలో 5000 మందికి పైగా రూ.14 కోట్లు అందజేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అమలుకు ఆమోదం తెలిపారు. నిధులు కేటాయించినట్లు ప్రకటించడంతోపాటు 2020 ఏప్రిల్‌ నుంచి అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ గడువు ముగిసినా పథకాన్ని అమలుచేయలేదు. 2019 మార్చి నుంచి అక్టోబరు వరకు దరఖాస్తు చేసుకున్న వధూవరులకు ఆర్థికసాయం అందించనే లేదు. తర్వాత కరోనాను సాకుగా చూపి దరఖాస్తుల ప్రక్రియ నిలిపివేశారు. కొవిడ్‌ ముగిసిన తర్వాత ఏడాదిన్నర పాటు సాయం అందించకుండా కాలయాపన చేశారు.

అర్హుల సంఖ్య తగ్గించి: ముస్లిం వర్గాలు కోర్టును ఆశ్రయించడంతో 2022లో పథకాన్ని అమలు చేయడం ప్రారంభించినా.. నిబంధనల పేరిట అర్హుల సంఖ్యను తగ్గించారు. పాత జీవోను పక్కపెట్టి.. 2022 సెప్టెంబరులో మరో జీవోను తెరపైకి తెచ్చారు. వాటిని 2022 అక్టోబరు నుంచి అమలుచేస్తామని ప్రకటించారు. 2019 జూన్‌ నుంచి 2022 సెప్టెంబరు వరకు వివాహం చేసుకున్న పేదలకు లబ్ధిని దూరం చేశారు. అప్పటి నుంచి 2023 వరకు కల్యాణమస్తు, షాదీతోఫా పథకాల కింద అయిదు విడతలుగా నిధులు అందజేశారు. జిల్లాలో కేవలం 1,782 జంటలకు రూ.11.39 కోట్లు అందజేశారు.


నిర్దాక్షిణ్యంగా తొలగింపు

‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కల్యాణమిత్రలుగా మీరే ఉంటారు. ఒక్కో పెళ్లికి ఇచ్చే ప్రోత్సాహకాలు పెంచుతాం’ అని జగన్‌ హామీ ఇచ్చారు. కల్యాణ మస్తు పథకం అమలవుతున్నా కల్యాణమిత్రలను నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించారు. నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదించే వారికి ఉపాధి లేకుండా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని