logo

6 కిలో మీటర్లు.. 2 ప్రమాదాలు.. 5 గురు మృతులు

వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారి ఆదివారం రక్తసిక్తమైంది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. ఆరు కిలోమీటర్ల పరిధిలో కొద్ది గంటల తేడాతో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఒక ప్రమాదంలో దంపతులు మృతిచెందగా, మరో ఘటన మూడు కుటుంబాల్లో విషాదం నింపింది.

Updated : 23 May 2022 06:38 IST

న్యూస్‌టుడే, వరంగల్‌క్రైం, మామునూరు, కరీమాబాద్‌


ఎంజీఎం మార్చురి వద్ద రోదిస్తున్న మృతురాలు పద్మ కుమార్తె, కుమారుడు, తల్లి

వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారి ఆదివారం రక్తసిక్తమైంది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. ఆరు కిలోమీటర్ల పరిధిలో కొద్ది గంటల తేడాతో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఒక ప్రమాదంలో దంపతులు మృతిచెందగా, మరో ఘటన మూడు కుటుంబాల్లో విషాదం నింపింది.

ఆ పేద బతుకులు తెల్లారాయి!

ఆ ఇద్దరు మహిళలకు భర్తలు లేరు. కుటుంబ పోషణ భారమంతా వారిపైనే పడింది. కష్టమైనా తప్పని స్థితిలో ఇసుకను తోడే పనికి ఆటోలో వెళుతున్నారు. కూలీపని వద్ద పరిచయమైన వారు స్నేహితుల్లా కలిసి పనులకు బయలుదేరుతారు. పనిలోకి వెళ్లేందుకు తెల్లవారుజామునే ఆటోలో బయలుదేరిన వారి ఆటోను 4 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం మృత్యురూపంలో ఢీ కొట్టడంతో ఆ ఇద్దరి బతుకులు తెల్లారాయి. ఎల్కతుర్తి మండలం దండెపల్లి గ్రామానికి చెందిన పల్లపు పద్మ(35), హనుమకొండ వినాయకనగర్‌కు చెందిన వల్లెపు మీన(28), డ్రైవర్‌ యాకుబ్‌పాష అక్కడికక్కడే మృతిచెందారు. పద్మకు 16 ఏళ్ల పాప, 14 ఏళ్ల బాలుడు ఉన్నారు. మీనకు చిన్న పాప ఉంది. తండ్రులు లేని పిల్లలకు ఇపుడు తల్లులు కూడా దూరమవడంతో చిన్నారులు ఎవరూ లేక రోడ్డున పడ్డారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అల్లీపురానికి చెందిన యాకూబ్‌పాష(బబ్లూ)కు ఇంకా వివాహం కాలేదు. అన్న మానసిక వ్యాధితో ఎటో వెళ్లిపోయారు. తల్లిలేదు. కుమారుడి మృతితో ఉన్న ఒక్క తండ్రి అనాథగా మిగిలారు. ఢీకొట్టిపోయిన వాహనం ఆచూకీ కోసం మూడు బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు.

మరో గంటలో ఇంటికి చేరేలోపే..

హనుమకొండ హంటర్‌రోడ్డులో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్యోన్యంగా ఉండే దంపతులిద్దరు మృతిచెందారు. మరో గంటలో సొంతింటికి చేరుతారనగా వారిని మృత్యువు బలితీసుకుంది. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం రాజపల్లి గ్రామానికి చెందిన తాడూరి సారయ్య , భార్య సుజాత వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొని వంతెనపై నుంచి కిందపడింది. ఘటనలో దంపతులు ఇద్దరూ మృతిచెందగా, డ్రైవర్‌ ఖాసింకు తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన దంపతులు దుర్గామాతను నిత్యం జపిస్తుంటారని సారయ్య జేబులో ఉన్న కాగితం తెలుపుతోంది. ఓం దుర్గాయైనమః అనే మంత్రాన్ని రోజుకు 21 సార్లు జపిస్తే శుభం జరుగుతుందని దానిపై రాసి ఉంది. కనీసం ఆ తల్లి కూడా కాపాడలేకపోయిందే అంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గంటకు ఇంటికి చేరుకునే వారని బంధువులు విలపించారు. ఎంజీఎం మార్చురీలో విగత జీవులుగా ఉన్న తమ తల్లిదండ్రులు సారయ్య, సుజాత మృతదేహాలపై పడి వారి కుమార్తె దివ్యరాణి, కుమారుడు వినయ్‌కుమార్‌ రోదించడం చూపరులను కంటతడిపెట్టించింది. అదే సమయంలో బొల్లికుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు మృతుల కుటుంబాలు అక్కడకు చేరగా, వారి, వీరి రోదనలతో మూర్చురీ ప్రాంతం దద్దరిల్లింది. ప్రమాదానికి కారణమైన కారును సుబేదారి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


కళాశాల

మృతులు సారయ్య


సుజాత


చికిత్స పొందుతున్న డ్రైవర్‌ ఖాసిం వలీ


వంతెన వద్ద ప్రమాదం జరిగిన స్థలం


అసంపూర్తిగా వంతెన పనులు..

న్యూశాయంపేట, న్యూస్‌టుడే: అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి హంటర్‌రోడ్డు ఖమ్మం రైల్వే వంతెనపై నుంచి కారు పడిపోయి రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. హంటర్‌రోడ్డు ప్రధాన రహదారి నుంచి ఖమ్మం వైపు వెళ్లే రైల్వే ఓవర్‌ బ్రిడ్జికి సమాంతరంగా నాలుగేళ్ల కిందట రూ. 50 కోట్ల వ్యయంతో ఆర్‌అండ్‌బీ శాఖ పర్యవేక్షణలో మరో వంతెన నిర్మించేందుకు దిమ్మెలను నిర్మించి వదిలేశారు. నిధుల మంజూరు లేకపోవడంతోనే ఆగిపోయిందని చెబుతున్నారు. ఇది పూర్తయితే నిత్యం ఈ రోడ్డుపై భారీ వాహనాల రాకపోకలు సాఫీగా జరిగేలా మరో వంతెన ఉపయోగపడేది. ఇది పూర్తి కాక రోడ్డు ఇరుకుగా మారి రోడ్డు ప్రమాదానికి కారణమైందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా అధికారులు తమ నిర్లక్ష్యాన్ని వీడి సత్వరమే అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని