logo

సాధారణ జీవితం.. షేరింగ్‌ ఆటోలోనే ప్రయాణం

ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు కొందరు తరతరాలకు సరిపడా ఆస్తి సంపాదిస్తుంటారు.  

Published : 03 Nov 2023 04:12 IST

ఆదర్శ నేత

ఆటోలో వెళ్తున్న సారయ్య

ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు కొందరు తరతరాలకు సరిపడా ఆస్తి సంపాదిస్తుంటారు.  హనుమకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 1994 శాసనసభ ఎన్నికల్లో  భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1999 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలాంటి ఆస్తులు సంపాదించుకోలేదు. ఇప్పటికీ సాధారణ జీవనం గడుపుతున్నారు. వరంగల్‌, హనుమకొండ నగరాల్లో ఎక్కడికి వెళ్లినా షేరింగ్‌ ఆటోలో ప్రయాణిస్తుంటారు. హైదరాబాద్‌ వంటి దూర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్తుంటారు. విద్యార్థి దశలో 1975-85 వరకు దశాబ్ద కాలం పాటు ఏఐఎస్‌ఎఫ్‌లో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేశారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో ఓటర్లకు డబ్బులు పంచే చెడు సంస్కృతి లేదని, నేడు విలువలు పూర్తిగా దిగజారిపోయాయని పోతరాజు సారయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హనుమకొండ జిల్లా భీమారంలో నివాసం ఉంటున్నట్లు చెప్పారు. నాడు అసెంబ్లీ ఎస్సీ లెజిస్లేచర్‌ కమిటీ, మహిళా శిశు సంక్షేమ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశానని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ చైతన్యంతో తాను బతికినంత కాలం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పారు.

ఈనాడు, హనుమకొండ, న్యూస్‌టుడే, భీమారం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని