logo

తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి

కేంద్రం, రాష్ట్రంలో తమ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తామని కడప ఎంపీ తెదేపా అభ్యర్థి భూపేష్‌రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి హామీ ఇచ్చారు.

Published : 19 Apr 2024 03:00 IST

జమ్మలమడుగు తెదేపా కార్యాలయంలో భూపేష్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన పలువురు

జమ్మలమడుగు, కొండాపురం, ప్రొద్దుటూరు వైద్యం, మైదుకూరు, దువ్వూరు, బి.కోడూరు, బద్వేలు గ్రామీణ, పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: కేంద్రం, రాష్ట్రంలో తమ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తామని కడప ఎంపీ తెదేపా అభ్యర్థి భూపేష్‌రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి హామీ ఇచ్చారు. గురువారం స్థానిక తెదేపా కార్యాలయంలో చేనేత, సొసైటీ అధ్యక్షులు, నాయకులు, కార్మికులు పార్టీలో చేరారు. వారు మాట్లాడుతూ ఎన్డీఏ అధికారంలోకి రాగానే చేనేతలకు రావాల్సిన బకాయిలు, నిలిచి పోయిన పథకాలను పూర్తిగా అమలయ్యేలా బాధ్యత తీసుకుంటామన్నారు. కొండాపురంలో ఆదినారాయణరెడ్డి సోదరుడు శివనారాయణరెడ్డి కె.సుగుమంచిపల్లె, జోగాపురం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రొద్దుటూరులోని బుర్రసాధుమఠం సమీపంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజులురెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి, ప్రజాక్షేమం సమపాళ్లలో జరగాలంటే తెదేపా అధికారంలోకి రావాలని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, పురపాలక మాజీ ఛైర్మన్లు ఆసం రఘురామిరెడ్డి, ముక్తియార్‌, ఈవీ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మైదుకూరులోని చెంచుకాలనీ, వెంకటసుబ్బయ్యకాలనీల్లో పార్టీ ఇన్‌ఛార్జ్‌ ఆకుల కృష్ణ ఆధ్వర్యంలో భాజపా, జనసేన పార్టీ నాయకులతో కలిసి ఎన్‌డీఏ అసెంబ్లీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెదేపాకు సహకరిస్తున్నారని వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడినా ఓట్ల కోసం మాయమాటలు చెప్పినా నమ్మవద్దని హెచ్చరించారు. వైకాపా చర్యల కారణంగా పట్టణంలో తాగునీటి సమస్య ఉత్పన్నమైందన్నారు. 11వ వార్డులో పలువురు తెదేపాలో చేరారు. అనంతరం పుట్టా దువ్వూరు మండలంలోని చిన్నశింగనపల్లె గ్రామంలో ప్రచారం నిర్వహించారు. బి.కోడూరు మండలంలో బద్వేలు తెదేపా బాధ్యుడు రితేష్‌, భాజపా అభ్యర్థి బొజ్జ రోశన్న ఆధ్వర్యంలో అంకనగొడుగునూరుకు చెందిన మాజీ ఎంపీపీ బోరెడ్డి పద్మావతి, మాజీ సర్పంచి బోరెడ్డి శేషారెడ్డి, ఆనంవారిపల్లె గ్రామాల నుంచి వైకాపా నుంచి తెదేపాలో 200 మంది చేరారు. అనంతరం బద్వేలులోని వల్లెలవారిపల్లె, పోరుమామిళ్ల మండలంలోని బెస్తవీధి, టేకూరుపేట గ్రామాల్లో ప్రచారం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని