logo

కూటమి జోష్‌!

ఎన్నికలు సమీపిస్తుండటంతో కూటమి అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. టిక్కెట్‌ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న కీలక నేతలు రంగంలోకి దిగడం మరింత జోష్‌ నింపుతోంది.

Published : 28 Apr 2024 05:41 IST

నేతలంతా ఐకమత్యంగా ప్రచారం

అంగళ్లు గ్రామంలో దోశ పోస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తంబళ్లపల్లె తెదేపా అభ్యర్థి జయచంద్రారెడ్డి. పక్కన తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వేమన సతీష్‌

ఈనాడు, కడప: ఎన్నికలు సమీపిస్తుండటంతో కూటమి అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. టిక్కెట్‌ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న కీలక నేతలు రంగంలోకి దిగడం మరింత జోష్‌ నింపుతోంది. టిక్కెట్‌ రాకపోవడంతో అలక బూనిన నేతలందరూ తెదేపా అధినేత చంద్రబాబు మంత్రాంగంతో చల్లబడి ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజంపేటలో రెండు రోజుల కిందట చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి, తెదేపా రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డితో సమావేశమై ఇద్దరిని కలిపే ప్రయత్నం చేశారు. దీంతో రామాపురం మండలం గొల్లపల్లిలో శనివారం వారిద్దరూ కలిసి ప్రచారం చేపట్టారు. మదనపల్లెలో కీలక నేతలు రాటకొండ బాబురెడ్డి, రాందాస్‌చౌదరిలు మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న చొరవతో ప్రచారంలోకి దిగారు.  తంబళ్లపల్లెలోనూ తెదేపా అభ్యర్థి జయచంద్రారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక్కడ సైతం కిరణ్‌కుమార్‌రెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వేమన సతీష్‌ నేతల్ని సమన్వయం చేసే బాధ్యతలు తీసుకున్నారు. ఫలితంగానే శనివారం జరిగిన ఎన్డీఏ ఆత్మీయ సమావేశం దిగ్విజయంగా సాగింది. మదనపల్లెలోనూ సమస్యలన్నీ అధిగమించిన తెదేపా అభ్యర్థి షాజహాన్‌ బాషా ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. పీలేరులో నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణుల్ని సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ఈయనకు సోదరుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అదనపు బలంగా మారింది. రాజంపేటలో చిన్నపాటి సమస్యల్ని పరిష్కరించడానికి సమన్వయకర్తలు దీపక్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి తాజాగా చొరవ తీసుకున్నారు. రైల్వేకోడూరులో కూటమి అభ్యర్థి ఆరవ శ్రీధర్‌ ప్రచారానికి గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి భాజపాతో పాటు తెదేపా, జనసేన నేతలను సమన్వయం చేస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని