సైబర్‌ భద్రత గాలిలో దీపం

ఎనభై రెండు కోట్లకు పైగా అంతర్జాల వినియోగదారులు, 115 కోట్ల మొబైల్‌ కనెక్షన్లు కలిగిన ఇండియాలో సైబరాసురుల ఆగడాలు పోనుపోను  పెచ్చరిల్లుతున్నాయి. బోగస్‌ సంస్థల్లో పెట్టుబడులు, రుణాలు, ఉద్యోగావకాశాలు, ఉచిత బహుమతులంటూ మాయవలలు విసురుతున్న ఆన్‌లైన్‌ నేరముఠాలు- సామాన్య జనాన్ని నిలువుదోపిడి చేస్తున్నాయి.

Published : 22 Apr 2024 01:03 IST

ఎనభై రెండు కోట్లకు పైగా అంతర్జాల వినియోగదారులు, 115 కోట్ల మొబైల్‌ కనెక్షన్లు కలిగిన ఇండియాలో సైబరాసురుల ఆగడాలు పోనుపోను  పెచ్చరిల్లుతున్నాయి. బోగస్‌ సంస్థల్లో పెట్టుబడులు, రుణాలు, ఉద్యోగావకాశాలు, ఉచిత బహుమతులంటూ మాయవలలు విసురుతున్న ఆన్‌లైన్‌ నేరముఠాలు- సామాన్య జనాన్ని నిలువుదోపిడి చేస్తున్నాయి. భారత సైబర్‌ నేరాల సమన్వయ కేంద్రం (ఐ4సీ) నివేదిక ప్రకారం 2021 ఏప్రిల్‌ నుంచి నిరుడు చివరి వరకు దేశవ్యాప్తంగా దాదాపు పదివేల కోట్ల రూపాయలను అంతర్జాల బందిపోట్లు కొల్లగొట్టారు. జాతీయ సైబర్‌ నేరాల నమోదు పోర్టల్‌లో ఒక్క 2022లోనే దాదాపు పది లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. 2023లో అవి అంతకు యాభై శాతానికి పైగా ఎగబాకాయి. దేశీయంగా సైబర్‌ భద్రతలోని డొల్లతనాన్ని ఈ గణాంకాలే చాటిచెబుతున్నాయి. మరోవైపు, సకాలంలో ఫిర్యాదు చేయకపోవడం వల్ల చాలా కేసుల్లో బాధితుల సొమ్మును  వెనక్కి రప్పించడం వీలుకావడం లేదు. ఈ నేపథ్యంలో సైబరాసురులు నక్కిన ప్రదేశాన్ని సెల్‌ఫోన్‌ నంబర్‌ సాయంతో గుర్తించేందుకు కేంద్ర  హోంశాఖ ‘ప్రతిబింబ్‌’ సాఫ్ట్‌వేర్‌ను అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. ఈ సాంకేతికతను సమర్థంగా ఉపయోగించుకుంటూ ఝార్ఖండ్‌ పోలీసులు ఇటీవల వందల సంఖ్యలో సైబర్‌ నేరగాళ్లను అరెస్టు చేశారు. హరియాణాలోనూ వారం రోజుల్లో 42 మంది పట్టుబడ్డారు. కానీ- ఎక్కడెక్కడో దాక్కుని, తరచూ మకాం మార్చేస్తూ విచ్చలవిడిగా నేరాలకు తెగబడుతున్న మాయగాళ్లకు ‘ప్రతిబింబ్‌’తో పూర్తిగా కళ్లెం వేయడం సాధ్యపడుతుందా అన్నదే ప్రశ్నార్థకం. ఆన్‌లైన్‌ మోసగాళ్లకు సంకెళ్లు వేయడం ఒక ఎత్తయితే- వారికి తగిన శిక్షలు పడేలా చూడటం మరో సవాలు. అందులో చేతులెత్తేస్తున్న యంత్రాంగం కారణంగానే డిజిటల్‌ భారతానికి దొంగల తాకిడి ఇంతలంతలవుతోంది!

దేశవ్యాప్తంగా ఏడాది వ్యవధిలో 40 కోట్ల దాకా సైబర్‌ బెదిరింపులు వెలుగుచూశాయని డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల వెల్లడించింది. ఝార్ఖండ్‌, రాజస్థాన్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లలోని పది జిల్లాల్లో తిష్ఠవేసిన సైబర్‌ ముఠాలే 80శాతం నేరాలకు పాల్పడుతున్నట్లు ఐఐటీ కాన్పుర్‌ అధ్యయనం తేల్చిచెప్పింది. ఆన్‌లైన్‌ నేరగాళ్ల బారినపడిన సామాన్యులకు అండగా నిలిచేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏడు సైబర్‌ ఠాణాలను నెలకొల్పారు. కేసులనూ పక్కాగా నమోదు చేస్తున్నారు.    పోలీసులకు చిక్కుతున్న సైబరాసురుల్లో ఎంతమందికి శిక్షలు పడుతున్నాయన్నదే గడ్డుప్రశ్న. దేశీయంగా ఎన్నోచోట్ల బెయిల్‌ వచ్చిన వెంటనే చాలామంది నిందితులు పత్తా లేకుండా పోతున్నారు. ఫలితంగా న్యాయ విచారణకు తీవ్ర అవరోధాలు ఏర్పడుతున్నాయి. సైబర్‌ నేరాల కట్టడి వ్యూహంలో భాగంగా రోజుకు రెండున్నర వేల దాకా మోసపూరిత ఫోన్‌ కనెక్షన్లను నిలిపివేస్తున్నట్లు కేంద్ర టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఆన్‌లైన్‌ గజదొంగల పీచమణుస్తున్నామంటున్న ప్రభుత్వ వర్గాల వాదనల్లో వాస్తవముంటే- సైబర్‌ సీమలో నేరాల ఉద్ధృతి ఎందుకు తగ్గడంలేదు? సైబరాసురుల పీడ నిజంగా విరగడకావాలంటే- కీలక సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం మొదలు అన్ని అంశాల్లో రాష్ట్రాలు మరింత సమన్వయంతో పనిచేయాలి. తనవంతుగా వాటికి కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ఆన్‌లైన్‌ చోరులకు కఠిన దండనలు పడేలా చట్టాలను పదును తేల్చాలి. డిజిటల్‌ మోసాలపై విస్తృత ప్రజావగాహనకు ప్రోదిచేస్తూ, సైబర్‌ భద్రతానిపుణులను విరివిగా తీర్చిదిద్దుకోవడమూ అత్యావశ్యకమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.