Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ పర్యటన షెడ్యూల్‌ ఇదే!

పార్లమెంటరీ ప్రవాస్‌ యోజన సమావేశంలో పాల్గొనేందుకు అమిత్‌ షా (Amith Shah) తెలంగాణకు రానున్నారు. ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు శంషాబాద్‌ చేరుకొని... అక్కడి నుంచి చేవెళ్లకు రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు.

Updated : 21 Apr 2023 15:27 IST

హైదరాబాద్‌:  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా (Amith shah) హైదరాబాద్‌ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.50కి శంషాబాద్‌ నోవాటెల్‌కి చేరుకొని.. సాయంత్రం 4 గంటల నుంచి 4.30 వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమా ఆస్కార్‌ విజేతలతో తేనీటి విందులో పాల్గొననున్నారు. 5.15కి అక్కడి నుంచి బయల్దేరి రోడ్డు మార్గం ద్వారా చేవెళ్లకు వెళ్లనున్నారు. 6గంటలకు హైదరాబాద్‌ శివారులోని చేవెళ్ల చేరుకొని.. పార్లమెంటరీ ప్రవాస్‌ యోజన సమావేశంలో అమిత్‌ షా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో పాటు పార్టీలో కీలక నేతల చేరికలపై రాష్ట్ర నాయకులు కసరత్తు చేస్తున్నారు.

అమిత్‌షా కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకున్న అనంతరం ఇక్కడికి రానుండటంతో ఆ రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉన్న చేవెళ్ల బహిరంగ సభ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని నేతలు నిర్ణయించారు. అక్కడ పెద్దఎత్తున బహిరంగ సభ నిర్వహించేలా కార్యక్రమం ఖరారైంది. ఈ నెల 8న హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన భాజపా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఈ ఏడాదే జరగనున్న నేపథ్యంలో ముఖ్య నేతలు తరచూ రాష్ట్రంలో పర్యటించడంతో పాటు ఇకపై ప్రతినెలా ప్రధాని, హోంమంత్రి పర్యటిస్తారని భాజపా నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌షా కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.

ఇటీవల నిర్మల్‌ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి భాజపాలో చేరారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు సైతం పార్టీలో చేరేలా రాష్ట్ర ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి చేరిక కోసం జాతీయ నాయకత్వం కూడా ప్రత్యేక కసరత్తు చేస్తోంది. దీనిపై మూడు నాలుగు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ముఖ్య నాయకులు అభిప్రాయపడ్డారు. అమిత్‌షా సభలోపు ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలిపారు. మరోవైపు, ఉమ్మడి జిల్లా కేంద్రాలన్నింటిలోనూ సభల నిర్వహణకు భాజపా నేతలు కసరత్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని