ఆ అనుమతి పత్రాలు చెల్లవ్‌:తెలంగాణ డీజీపీ

లాక్‌డౌన్‌ నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే విద్యార్థులను ఖాళీ చేయించొద్దని నిర్వాహకులకు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. హాస్టల్‌లో ఉండే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు

Updated : 25 Mar 2020 21:32 IST

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే విద్యార్థులను ఖాళీ చేయించొద్దని నిర్వాహకులకు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. హాస్టల్‌లో ఉండే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపొద్దని అధికారులను ఆయన ఆదేశించారు. లాక్‌డౌన్‌ ఉన్నందున ఎవరూ ఇళ్లు విడిచి వెళ్లొద్దని సూచించారు. స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటి వరకు పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రాలేవీ చెల్లవని డీజీపీ స్పష్టం చేశారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు హాస్టళ్ల నిర్వాహకులతో మాట్లాడాలని మహేందర్‌రెడ్డి ఆదేశించారు. మరోవైపు స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటికే వందల సంఖ్యలో అనుమతి పత్రాలను నగర పోలీసులు జారీ చేశారు. వాటితో ఊళ్లకు బయల్దేరిన కొంతమంది హాస్టల్‌ విద్యార్థులు ఏపీ సరిహద్దుల్లో పడిగాపులు పడుతున్నారు.

కేటీఆర్‌తో మాట్లాడిన బొత్స

ఈ విషయం తెలుసుకున్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడారు. హైదరాబాద్‌లో హాస్టళ్ల నుంచి విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారని, వారికి రవాణా ఇబ్బందులు తలెత్తుతాయని కేటీఆర్‌ దృష్టికి బొత్స తీసుకెళ్లారు. కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో ఒకచోట నుంచి మరొక చోటుకి కదలడం శ్రేయస్కరం కాదని తెలిపారు. ఇదే అంశాలపై ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని సైతం తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో మాట్లాడారు. తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా పోలీసు పాసులు ఇస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఏపీ సీఎస్‌ చెప్పారు. మరోవైపు ఏపీ సీఎంవో అధికారులు కూడా తెలంగాణ సీఎంవో అధికారులతో దీనిపై చర్చించారు. ఈ పరిణామాల నేపథ్యంలో హాస్టళ్ల నుంచి విద్యార్థులను ఖాళీ చేయించొద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని