యుద్ధం వస్తే చైనాకు చుక్కలే..

భారత్‌-చైనాల మధ్య సుదీర్ఘమైన భూసరిహద్దు ఉంది. లద్దాఖ్‌ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌,ఉత్తరాఖండ్‌, సిక్కిం

Published : 29 Jun 2020 16:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం : భారత్‌-చైనాల మధ్య సుదీర్ఘమైన భూసరిహద్దు ఉంది. లద్దాఖ్‌ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌,ఉత్తరాఖండ్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు చైనాతో సరిహద్దులను కలిగివున్నాయి. పశ్చిమంగా చైనా ఆక్రమణలో ఉన్న టిబెట్‌ స్వయంపాలిత ప్రాంతం ఉంది.  టిబెట్‌లో జనసాంద్రత తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని చైనా తన ఆధీనంలోకి తెచ్చుకున్న అనంతరం భారీస్థాయిలో మౌలికసౌకర్యాలను కల్పించింది. ముఖ్యంగా రహదారులు, రైల్వే మార్గాలను నిర్మించారు. 1962లో చైనా మన దేశంపై దాడి చేసి లద్దాఖ్‌కు చెందిన  ఆక్సయ్‌చిన్‌ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. అంతే కాకుండా  అరుణాచల్‌ప్రదేశ్‌ సైతం తమ దేశానికి చెందిన భాగంగా వాదిస్తోంది.

చైనాను నమ్మలేం..
వాస్తవంగా చైనాతో మన తొలిప్రధాని  జవహర్‌లాల్‌ నెహ్రూ స్నేహంగా ఉండేవారు. పంచశీల సిద్ధాంతం ఆదర్శమని ప్రకటించిన చైనా ప్రీమియర్‌ చౌఎన్‌లై ఆ తరువాతి కాలంలో 1962లో భారత్‌పై యుద్ధానికి కాలుదువ్వాడు. అప్పటి నుంచి చైనా  మన దేశవ్యతిరేక వైఖరి కొనసాగిస్తోంది.  కొంతకాలం క్రితం డోక్లామ్‌లో సైతం ఇరుదేశాల సైన్యాలు సుదీర్ఘకాలం ఎదురెదురుగా నిలిచాయి. తాజాగా మన ప్రాదేశిక ప్రాంతంలో ఉన్న గల్వాన్‌లోయను ఆక్రమించుకునేందుకు చైనా అనేక ఎత్తుగడలు వేసింది. ఒక వైపు చర్చలు సాగిస్తునే మరో వైపు మనదేశ సైనికులపై పాశవికంగా జరిపిన దాడులు తెలిసిందే. అయితే భారతీయసైనికులు వీరోచితంగా పోరాడి మాతృభూమిని రక్షించారు. వీరిలో కొందరు అమరులయ్యారు. 

ఇది 2020 ..1962 కాదు..

చైనా 1962లో భారత్‌పై దాడి చేయడమే కాకుండా ఆక్సయ్‌చిన్‌ను ఆక్రమించుకుంది. అనంతరం 1967లో సిక్కింలోని నాథులా కనుమలో మరో సారి దురాక్రమణకు దిగింది. ఈ పోరులో చైనా విపరీతంగా నష్టపోయింది. చివరకు వారే వెనక్కువెళ్లారు.  1987లోనూ అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లోని సమ్‌దురాంగ్‌ను ఆక్రమించుకునేందుకు బీజింగ్‌ విఫలయత్నం చేసింది. ఆ సమయంలో జనరల్‌ సుందర్జీ నేతృత్వంలో ఆపరేషన్‌ ఫాల్కన్‌, ఆపరేషన్‌ చెకర్‌ బోర్డు కార్యక్రమాలు చేపట్టారు. పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన చైనీయులు వెంటనే ఆక్రమితప్రాంతాల నుంచి వెనుదిరిగారు. ఆర్థిక రంగంలో ఉదారవాద విధానాలతో చైనా ప్రపంచంలోనే బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగింది. భవిష్యత్తులో అమెరికాను కూడా దాటి అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలవనుంది. ఈ సమయంలో భారత్‌తో యుద్ధం వస్తే చైనా తీవ్రంగా నష్టపోవాల్సివుంటుందని ఆ దేశ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  1962 తరువాత భారత్‌ సైనికంగానూ, ఆర్థికంగానూ బలపడింది. చైనా దగ్గర అణ్వాయుధాలుంటే మన దగ్గరా ఉన్నాయి. చైనాకు దీటుగా బదులివ్వగల సైన్యం, వాయుసేన, నౌకాదళం ఉన్నాయి. క్షిపణులు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధం వస్తే మన కంటే చైనా ఆర్థికంగా నష్టపోనుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లోని సైనిక బలగాల కూర్పుపై అమెరికాకు చెందిన బెల్ఫర్‌సెంటర్‌ అధ్యయనం చేసి ప్రత్యేక నివేదికను విడుదల చేసింది.

భారత్‌కు అనుకూలం..

భారత తూర్పు సరిహద్దులు ముఖ్యంగా చైనాతో ఉన్నసరిహద్దుల రక్షణకు సంబంధించిన భారత సైనికులు 2,25,000 మంది ఉండగా చైనా పశ్చిమ కమాండ్‌కు చెందిన  2 లక్షల నుంచి 2, 34,000 వరకు ఆ వైపు ఉన్నారు.  ఈ అంకెలను పరిశీలిస్తే  ఇరువైపులా సమానంగా బలగాలు ఉన్నాయి. అయితే భారత్‌కు  పర్వతాలపై యుద్ధతంత్రానికి సంబంధించిన సుదీర్ఘమైన అనుభవం ఉంది. అలాగే రష్యా తయారీ టీ72 యుద్ధ ట్యాంకులు అదనపు బలాన్ని ఇస్తాయి. ఇటీవలే అమెరికాకు చెందిన  షినూక్‌, అపాచీ హెలికాప్టర్లు మన వాయుసేనలో చేరాయి. యుద్ధంలో వీటి పనితీరు ఎక్కువ. దీంతో ఆకాశయుద్ధంలో మనం పైచేయి సాధించే అవకాశాలు ఎక్కువ. అదే సమయంలో చైనా దగ్గర ఎయిర్‌ డిఫెన్స్‌ బలంగా ఉంది. 

గగనంలో భారత్‌దే ఆధిపత్యం

భారత వాయుసేనకు తూర్పు ప్రాంతంలో మొత్తం 270 యుద్ధవిమానాలు ఉన్నాయి. చైనా వద్ద పశ్చిమ కమాండ్‌కు సంబంధించిన 157 విమానాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆధునికమైనవి. అయితే మనదగ్గర ఉన్న సుఖోయ్‌లు యుద్ధరంగంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించగలవు.  ఇక అణుదాడులకు సంబంధించి చూస్తే చైనాలోని  సుదూరశ్రేణి క్షిపణులు భారత్‌లోని అన్ని మూలలకు చేరగలవు.  అదే ఇండియా అమ్ముల పొదిలోని అగ్ని క్షిపణి వ్యవస్థలు చైనాలోని అన్నిప్రాంతాలకు అణ్వాయుధాలను  ప్రయోగించే సత్తా కలిగివున్నాయి. 

చైనాకు తూర్పు తీరం కీలకం..

చైనాకు ఆ దేశ తూర్పుతీరం కీలకం. షాంఘై, గ్వాంగ్‌డాంగ్‌...తదితర ఆర్థికాభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. ఒక దేశానికి భారీగా సైనిక బలగాలు ఉన్నప్పటికీ ఒకే దేశంపై వాటిని వినియోగించలేదు. ఇదే సూత్రం చైనాకు వర్తిస్తుంది. తూర్పు తీరం చైనాకు ఆయువుపట్టు. అందుకే  ఆ వైపు ఉన్న దేశాలు  భవిష్యత్తులో చైనాపై దాడికి దిగకుండా భారీఎత్తున బలగాలు ఉంటాయి. మన దేశంతో  సరిహద్దు ప్రాంతం మంచుతో నిండిన ప్రాంతం. ఎలాంటి అభివృద్ధి లేదు. సమీప పెద్ద నగరం చెంగ్డు. అక్కడ నుంచి టిబెట్‌కు ఏకంగా 2 వేల కి.మీ.పైగా దూరం ఉంటుంది. టిబెట్‌తో పాటు ఉగుర్‌ ప్రాంతాల్లో వేర్పాటువాద భావనలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా యుద్ధానికి దిగే అవకాశాలు తక్కువే అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని