ప్రవేశ పరీక్షల వాయిదాపై హైకోర్టులో విచారణ

తెలంగాణలో రేపట్నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది

Updated : 30 Jun 2020 13:28 IST

హైదరాబాద్‌: తెలంగాణలో రేపట్నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ పెట్టే అవకాశాలపై స్పష్టత ఇవ్వాలని ఈ సందర్భంగా ఏజీని హైకోర్టు కోరింది.

రేపటి నుంచి ఈనెల 17వరకు తెలంగాణలో  ప్రవేశపరీక్షలు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ ఖరారు చేసింది. రేపు పాలీసెట్‌, పీజీ ఈసెట్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎంట్రన్స్‌ పరీక్షలతో పాటు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ పరీక్షలు కూడా వాయిదా వేయాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా వేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ పెట్టే అవకాశముందని పత్రికల్లో చూశాం... దీనిపై స్పష్టత ఇవ్వాలని అడ్వొకేట్‌ జనరల్‌ను కోరింది. హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధిస్తే పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. పిటిషన్‌పై విచారణ జరపాలంటే లాక్‌డౌన్‌పై స్పష్టత ఇవ్వాలని సూచించింది. లాక్‌డౌన్‌ కేబినెట్‌ నిర్ణయంపై ఆధారపడి ఉందని ఈ సందర్భంగా ఏజీ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో కేబినెట్‌ సమావేశం ఉందని వెల్లడించారు. ప్రవేశ పరీక్షల వాయిదాపై సీఎస్‌తో చర్చించి మధ్యాహ్నం నిర్ణయం చెబుతామని ఏజీ తెలిపారు. దీంతో విచారణ మధ్యాహ్నం 2.30కి వాయిదా పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని