TS Highcourt: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆలోక్‌ అరాధే

 తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆలోక్‌ అరాధే నియమితులయ్యారు.

Updated : 20 Jul 2023 05:39 IST

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆలోక్‌ అరాధే నియమితులయ్యారు. జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు జడ్జిగా ఉన్నారు. జస్టిస్‌ శ్యాంకోశీ తెలంగాణ హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 5న పలువురు జడ్జిల బదిలీలకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కొలీజియం సిఫారసు చేసిన వారిలో ఐదుగురు జడ్జిల బదిలీకి కేంద్రం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం జడ్జిల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 

ఇక గుజరాత్‌, కేరళ, ఒడిశా రాష్ట్రాల హైకోర్టులకు సైతం కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియామకమయ్యారు. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ శుభాసిస్‌ తలపాత్ర, గుజరాత్‌ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సునితా అగర్వాల్‌, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆశిష్‌ జితేంద్ర దేశాయ్‌ నియామకమయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల తర్వాత  భారత రాష్ట్రపతి వీరి నియామకానికి ఆమోదముద్ర వేశారు.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ఆలోక్‌ అరాధే 1964 ఏప్రిల్ 13న రాయ్‌పుర్‌లో జన్మించారు. 1988 జులై 12న న్యాయవాదిగా చేరారు. 2009 డిసెంబరు 29న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జమ్మూకశ్మీర్‌ న్యాయమూర్తిగా 2016 సెప్టెంబరు 16న బదిలీ అయిన జస్టిస్ ఆలోక్ అరాధే... ఆ రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీకి, లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఛైర్మన్‌గా చేశారు. జస్టిస్ ఆలోక్ అరాధే 2018లో మూడు నెలల పాటు జమ్మూకశ్మీర్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. కర్ణాటక హైకోర్టు జడ్జిగా 2018 నవంబరు 17 నుంచి కొనసాగుతున్న జస్టిస్ ఆలోక్... కొంతకాలం కర్ణాటక తాత్కాలిక సీజేగా చేశారు.  కొలీజియం సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ పి. శ్యాంకోశీ ఛత్తీస్‌గఢ్‌లోని జబల్‌పూర్‌లో 1967 ఏప్రిల్ 30న జన్మించారు. 1991లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. ఉమ్మడి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌ హైకోర్టులో న్యాయవాదిగా సేవలు అందించిన జస్టిస్ శ్యాంకోశీ.. 2013 సెప్టెంబరు 16 నుంచి ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ శ్యాంకోశీ బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు ఆమోదించిన రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని