MLA Rajaiah: ఎమ్మెల్యే రాజయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సర్పంచి నవ్య

ఒప్పందం పేరుతో తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు మరో నలుగురిపైనా జానకీపురం సర్పంచి కురుసపల్లి నవ్య పోలీసులకు  ఫిర్యాదు చేశారు.

Updated : 21 Jun 2023 19:10 IST

ధర్మసాగర్‌: ఒప్పందం పేరుతో తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు మరో నలుగురిపైనా ధర్మసాగర్‌ పోలీసుస్టేషన్‌లో జానకీపురం సర్పంచి కురుసపల్లి నవ్య బుధవారం ఫిర్యాదు చేశారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని గతంలో నవ్య ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. నవ్య, రాజయ్య సామరస్యంగా సమస్యను పరిష్కరించుకున్నారు. అదే విషయంలో గ్రామ అభివృద్ధి కోసం రూ.25లక్షలు తన నిధుల నుంచి ఇస్తానని ఎమ్మెల్యే రాజయ్య హామీ ఇచ్చారు.

ఈ క్రమంలో నిధులు ఇవ్వకపోగా.. తాను డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోందని నవ్య.. ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఇదే విషయంపై నవ్య భర్త ప్రవీణ్‌.. ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో రాజయ్య గ్రామాభివృద్ధికి రూ.25లక్షలు ఇస్తామని, రూ.20లక్షలు వ్యక్తిగతంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్‌కు రాజయ్య రూ.7లక్షలు ఇచ్చారు. మిగతా నగదు ఇవ్వాలని అడిగితే ఒప్పంద పత్రంపై సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చారు. గతంలో చేసిన లైంగిక ఆరోపణలు రాజకీయ కోణంలో చేసినవని చెప్పాలని తెలిపారు. దీంతో పాటు రూ.20లక్షలు మళ్లీ అడిగినప్పుడు తిరిగివ్వాలని కోరారు. దీంతో సర్పంచి భర్త ప్రవీణ్‌ అంగీకరించకుండా వచ్చారు. ఆ తర్వాత పలుమార్లు ప్రవీణ్‌కు ఎమ్మెల్యే ఫోన్‌ చేసి వేధించారు. దీంతో ప్రవీణ్‌ ఒప్పంద పత్రాన్ని తీసుకువచ్చి దానిపై సంతకం పెట్టమని నవ్యను ఒత్తిడికి గురిచేశాడు. సంతకం పెడితే తాను తప్పు చేస్తున్నట్లు అవుతుందని నవ్య తిరస్కరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజయ్యపై, పీఏ శ్రీనివాస్‌, ఎంపీపీ నిమ్మ కవిత, తన భర్త ప్రవీణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు నవ్య తెలిపారు. తనకు న్యాయం జరగకపోతే పోలీసు కమిషనర్‌ వద్దకు, మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తానని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని