Gaddar: ముగిసిన ప్రజాగాయకుడు గద్దర్‌ అంత్యక్రియలు

ప్రజాగాయకుడు గద్దర్‌ (76) అంత్యక్రియలు ముగిశాయి. అశేష అభిమానుల మధ్య అల్వాల్‌లోని మహాబోధి విద్యాలయ ఆవరణలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.

Updated : 07 Aug 2023 20:16 IST

హైదరాబాద్‌: ప్రజాగాయకుడు గద్దర్‌ (76) అంత్యక్రియలు ముగిశాయి. అశేష అభిమానుల మధ్య అల్వాల్‌లోని మహాబోధి విద్యాలయ ఆవరణలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో.. బౌద్ధ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. అంతకుముందు కడసారిగా గద్దర్‌ను చూసేందుకు ఎల్బీ స్టేడియానికి సినీ, రాజకీయ ప్రముఖులు, కళాకారులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉద్యమ వీరుడికి విప్లవ జోహార్లు సమర్పించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి గన్‌పార్క్, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం, ట్యాంక్ బండ్ మీదుగా అల్వాల్‌ వరకు గద్దర్‌ అంతిమయాత్ర కొనసాగింది. అల్వాల్‌లోని ఆయన నివాసం వద్ద పార్థివదేహాన్ని కొంత సమయం ఉంచిన అనంతరం.. సమీపంలోని బోధి విద్యాలయం వరకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రగతిభవన్ నుంచి అల్వాల్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌.. గద్దర్‌ పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

Gaddar: ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు ప్రముఖుల నివాళులు

తీవ్ర అనారోగ్యంతో ఆదివారం మధ్యాహ్నం గద్దర్‌ తుదిశ్వాస విడిచారు. అల్వాల్‌లోని ఇంటివద్ద జులై 20న గద్దర్‌ తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేర్పించారు. నాటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. గుండెలో సమస్య ఉండటంతో ఈ నెల 3న వైద్యులు ఆయనకు బైపాస్‌ సర్జరీ చేశారు. ఐసీయూలో హుషారుగా పాటలు కూడా పాడిన ఆయన.. త్వరగా కోలుకుని తిరిగి వస్తానని కుటుంబసభ్యులతో శనివారం రాత్రి కూడా మాట్లాడారు. అనూహ్యంగా ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆదివారం మధ్యాహ్నం ఆరోగ్యం విషమించింది. చాన్నాళ్లుగా రక్తపోటు, మధుమేహంతో బాధపడుతుండటం, వృద్ధాప్య సమస్యలు చుట్టుముట్టడంతో కోలుకోలేకపోయారు. అత్యవసర వైద్యం అందించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని వైద్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని