Gaddar: మేస్త్రీ కొడుకుగా పుట్టి.. అసామాన్యుడిగా ఎదిగి..

నిరుపేదగా ఇంట్లో పుట్టిన గద్దర్‌ ప్రజల మనిషిగా ఎదిగి.. అందరి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ పయనంలో ఆయన ఎదుర్కొన్న అడ్డంకులు లెన్నో.. చీత్కారాలు మరెన్నో..

Updated : 06 Aug 2023 17:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గద్దర్‌ (Gaddar).. ఈ పదానికి పరిచయం అక్కర్లేదు. వివరణ అవసరం లేదు. తెలుగు నేలలోనే కాదు దేశం నలుమూలలా తన గాత్రంతో ప్రజలను ఉత్తేజపరిచిన ప్రజాగాయకుడు గద్దర్‌. జానపద పల్లెగానం పరిణామం చెంది, విప్లవ గీతంగా మారింది. ఆ గీతానికి పర్యాయపదమే గద్దర్‌. తల్లి కడుపులోంచి బయటపడ్డ మరుక్షణం చిలకరించిన నీటి తుంపరలతో కెవ్వున వేసిన కేక.. 74 ఏళ్ల వయస్సులో నిలిచిపోయింది.  ఎంతో మందిలో చైతన్యం తీసుకొచ్చిన ఆ గొంతు మూగబోయింది. ఈ సందర్భంగా ఆయన (Gaddar) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాలు ఆయన మాటల్లోనే..!

మేస్త్రీ కొడుకును..

‘‘మాది మెదక్‌ జిల్లాలోని గజ్వేల్‌ తాలూకా తూప్రాన్‌. రెండు చెరువులు, ఏడు నీటి గుంటలు, పచ్చని పైర్లు, అన్ని రకాల కుల వృత్తులవారు ఉండేవారు. గుడి, బడితో నా ఊరెప్పుడూ కళకళలాడుతుండేది. మా నాన్న గుమ్మడి శేషయ్య మేస్త్రీ. దాని కోసం కొన్ని ఊళ్లు తిరిగేవారు. ఎక్కువగా ఉత్తర్‌ప్రదేశ్‌లో పని చేసేవారు. అక్కడ కట్టించిన మిళింద విద్యాలయం నిర్మాణంలో మా నాన్న మేస్త్రీగా పని చేశారు. అంబేడ్కర్‌ని చాలా దగ్గర నుంచి చూశారు. ఆయన ప్రభావం నాన్నపై చాలా ఉండేది. అందుకే తినడానికి తిండిలేకపోయినా బిడ్డల్ని స్కూలుకే పంపాడు కానీ, కూలికి పంపలేదు. సంతకం పెట్టడం రాకపోయినా హిందీ, మరాఠీ, ఉర్దూ అన్ని భాషలూ మాట్లాడేవాడు. ఏడాదిలో నెల రోజులకంటే ఎక్కువ రోజులు ఊళ్లో ఉండేవారు కాదు. నాకు ఒక అన్నయ్య, ముగ్గురు అక్కచెల్లెళ్లు. మా ఇల్లు గూన పెంకుటిల్లు. ముందు ఓ గది ఉండేది. దానికి ఆనుకొని ఒక స్టోర్‌ రూమ్‌, దాని పక్కన పొయ్యి. ఇంటి ముందు పెద్ద వాకిలి. తెల్లారేసరికి మా అమ్మ లచ్చుమమ్మ వాకిట్లో కల్లాపి చిమ్మి, ముగ్గు పెట్టేది’’

అందరికీ లచ్చమ్మ

‘‘మా అమ్మను అందరూ లచ్చమ్మ అని పిలిచేవారు. మామూలుగా మాదిగలు, మాల వాళ్లు దూరంగానే ఉంటారు. వరసలు పెట్టి పిలుచుకోవడం ఎక్కడోగానీ కనిపించదు. మా నాన్నని మాత్రం బావా అని ఆప్యాయంగా పిలిచేవాళ్లు. నాన్న కూడా పెద్దవాళ్లను మామ, అని చిన్న వాళ్లని బావ అని పిలిచేవారు. బీసీవాళ్లు కూడా నాన్నను బావ అని పిలిచేవారు. మా కుటుంబం అన్ని విషయాల్లో భిన్నంగా కనిపించడం కూడా ఇందుకు కారణం కావొచ్చు. మా ఊళ్లో ఆడ, మగ తేడా లేకుండా పిల్లలందర్నీ చదివించాలన్న భావన మా నాన్నతోనే  మొదలైంది’’

అమ్మ హెచ్చరికలు మార్మోగుతాయ్‌

‘‘అమ్మ పొలం పనికి వెళ్లేది. ఇంట్లో చిన్నవాడిని కావడంతో నన్ను కూడా తీసుకెళ్లేది. అలా అమ్మప్రేమను పూర్తిగా పొందగలిగే అదృష్టం నాకు బాల్యంలో దక్కింది. ఆ తర్వాతి రోజుల్లో అమ్మ చేస్తున్న పనిమీద ‘మోకాళ్ల మట్టుకు బురదలో అడుగేసి..ఎద్దోలె ఎనకెనక ఒక్కొక్క అడుగేసి.. నీ నడుమంత ఇరిగేనా లచ్చుమమ్మో.. లచ్చుమమ్మో’’ అని ఒక పాట రాశాను. అందరమ్మలూ వాళ్ల పిల్లల్ని నిద్రపుచ్చేందుకు జోలపాటలు పాడుతుంటే.. మా అమ్మమాత్రం జానపద పాటలు, దొరల కళ్లు తెరిపించే పాటలు పాడేది. నేను ఉద్యమంలోకి వెళ్లినప్పుడు ‘బిడ్డా నువ్వు పొరాడాలనుకుంటున్నది వెయ్యికాళ్ల జెర్రితో.. నువ్వు చూస్తే బక్కపలచనోడివి’ అనే మాటలు ఎప్పుడూ నా చెవుల్లో మార్మోగుతుంటాయి’’

పెంటకుప్పలే మా ఇరుగుపొరుగు

‘‘మా ఊరు ఏటవాలుగా ఉంటుంది. ఎత్తుప్రదేశంలో బ్రాహ్మణులు.. అలా కిందికి వస్తున్న కొద్దీ దొరలు, కోమటోళ్లు, ఇలా అన్ని వర్గాల వారికి చెందిన ఇళ్లు వరుసలో ఉండేవి. చివరి వరుసలో ఉన్న ఇళ్లు మావే. చెత్తకుప్పలు, పెంటకుప్పలే మాకు ఇరుగు పొరుగు. పొలాలు కూడా అదే వరసలో ఉండేవి. అందరి పొలాలకి నీరు అందిన తర్వాతనే మా పొలాలకు నీరు. మెరక పొలాలు కావడం వల్ల మా పొలాలకు నీరు అందక పోవడంతో దొరల పొలాలకు కూలిపనికి పోయేవాళ్లు మా వాళ్లు. వాళ్లు చూసే చూపులు, ఆడే మాటల సంగతి పక్కన పెడితే.. ఊరిలో మా స్థానమే పెంటకుప్పల మధ్యన ఉండేది’’

విఠల్‌రావు గద్దర్‌గా..

‘‘ఊళ్లో ఏడోతరగతి వరకు చదివాక మా ఊరి పక్కన ఉన్న హాస్టల్లో ఉండి ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ చదువుతుండగానే ఉద్యమంలో చేరాను. అంతే.. ఊరు వదిలిపెట్టి.. ఉద్యమం పేరుతో కొన్ని వందల ఊళ్లు తిరిగా. అడవుల్లో బతికా. అలా గుమ్మడి విఠల్‌రావు గద్దర్‌గా మారిపోయారు. కొన్నేళ్ల తర్వాత హైదరాబాద్‌లోని అల్వాల్‌లో మా చిన్నక్క ఇంటి దగ్గర ఓ ఇల్లు కట్టుకున్నా. అమ్మ, అన్నయ్య ఊళ్లోనే ఉండేవారు. అమ్మ చివరి రోజుల వరకూ కూలిపనికి వెళ్లేది. నేను అజ్ఞాతంలో ఉన్నప్పుడు అమ్మను చూడ్డానికి అప్పుడప్పుడు మారువేషంలో ఊరికి వెళ్లి వస్తుండేవాణ్ని. అమ్మ చనిపోయినప్పుడు, నా చిన్న కొడుకు చనిపోయినప్పుడు ఊరు వెళ్లాను కానీ, అక్కడ ఉండలేదు. 2008లో నాకు 60 ఏళ్లు నిండినప్పుడు మళ్లీ వెళ్లాను. ఆరు నెలల పాటు అక్కడే ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చారు గద్దర్‌. 74 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో కష్టాలకు ఓర్చి.. ఎందర్నో చైతన్య వంతుల్ని చేసిన ఆ ఉద్యమ గళం నేడు శాశ్వతంగా మూగబోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని