AP News: కొనసా... గుతున్న కొటియా వివాదం: మరోసారి ఉద్రిక్తత

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత నెలకొంది...

Published : 24 Oct 2021 19:57 IST

సాలూరు గ్రామీణం: విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కొటియా వివాదాస్పద గ్రామాల్లో భాగమైన పగులుచిన్నూరు, పట్టుచిన్నూరు, డోలియాంబ గ్రామాల్లో ఒడిశా పోలీసులు , గ్రామస్థులకు మధ్య ఆదివారం సాయంత్రం ఘర్షణ చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వివాదాస్పద గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐటీడీఏ అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలియజేసే విధంగా ప్రచార బోర్డులు ఏర్పాటు  చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన సామగ్రిని నాలుగు రోజుల క్రితమే ఆయా గ్రామాలకు పంపించారు. కొత్తగా బోర్డులు ఏర్పాటు చేయనున్నారనే సమాచారంతో వాటి ఏర్పాటును అడ్డుకొనేందుకు ఒడిశా పోలీసులు మూడు రోజులుగా గ్రామాల సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా ఏపీకి సంబంధించి ఏ ఒక్క అధికారినీ అనుమతించలేదు. ఇదిలా ఉండగా.. ఆదివారం సాయంత్రం పగులుచిన్నూరు, పట్టుచిన్నూరు, డోలియాంబ గ్రామాల్లోని స్థానికులు బోర్డులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఒడిశా పోలీసులు గ్రామస్థులను అడ్డుకున్నారు. గ్రామాల్లో ఎందుకు కాపలా ఉంటున్నారని.. తాము ఆంధ్రాలోనే ఉంటామని  కొటియా పరిధిలోని గ్రామాల ప్రజలు ఒడిశా పోలీసులకు మరోసారి స్పష్టం చేసినట్టు సమాచారం. అయినా, ఒడిశా పోలీసులు గ్రామాల్లో నుంచి కదలకపోవడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని