Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 27 Aug 2023 21:01 IST

1. కేసీఆర్‌ పాలనకు నూకలు చెల్లాయి: అమిత్ షా

తెలంగాణ అమరవీరుల కలలను సీఎం కేసీఆర్‌ కల్లలు చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. కేసీఆర్‌ పాలనకు నూకలు చెల్లాయని ఖమ్మం సభలో మండిపడ్డారు. తెలంగాణలో త్వరలో కమలం వికస్తుందని.. భద్రాచలం స్వామి వారికి భాజపా సీఎం పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. ఈసారి సీఎం అయ్యేది కేసీఆర్‌, కేటీఆర్‌ కాదన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సీఎం కాదు.. సింగిల్‌ డిజిట్‌ తెచ్చుకోండి: హరీశ్‌

ఖమ్మం సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌ రావు ఫైరయ్యారు. ‘‘నూకలు మాకు చెల్లడం కాదు.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పీయూష్ వెక్కిరించినప్పుడే భాజపాకు ఇక్కడ నూకలు చెల్లాయి. బ్యాట్ సరిగా పట్టుకోవడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసు. సీఎం పదవి కాదు.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకోండి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దూకుడు పెంచాలి: తెలంగాణ భాజపా నేతలకు అమిత్‌ షా దిశానిర్దేశం

భారాస సర్కారును ఓడించడమే లక్ష్యంగా అంతా కలిసికట్టుగా పని చేయాలని రాష్ట్ర భాజపా ముఖ్యనేతలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఖమ్మంలో ‘రైతు గోస - భాజపా భరోసా’ బహిరంగ సభ తర్వాత.. సభా వేదిక వద్ద రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ సభ్యులతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వచ్చే ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేయాలి: లోకేశ్‌

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం నుంచి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. వలసపూడి శివారులో లోకేశ్‌కు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు ఆత్మీయ వీడ్కోలు పలికారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దిల్లీ బయలుదేరి వెళ్లిన చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి ఇవాళ దిల్లీ బయలుదేరి వెళ్లారు. ఎన్టీఆర్‌ చిత్రంతో కూడిన రూ.100 నాణేన్ని రాష్ట్రపతి సోమవారం విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్‌లో జరిగే నాణెం విడుదల కార్యక్రమంలో ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు పాల్గొంటారు. అనంతరం రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పాతబస్తీ మెట్రో పనుల కోసం డ్రోన్ సర్వే.. ప్రధాన సవాళ్లివే!

పాతబస్తీ మెట్రో పనుల కోసం డ్రోన్ సర్వేను హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు చేపట్టారు. పాతబస్తీలో మెట్రో అలైన్‌మెంట్, ప్రభావిత ఆస్తులపై డ్రోన్‌ సర్వేను చేసినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతాల్లోని ఇరుకైన మార్గంలో ప్రభావిత ఆస్తుల కచ్చితమైన కొలతలు తీసుకోవడానికి ఈ సర్వే చేశామన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తెలంగాణలో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం నల్గొండలో సాధారణం కన్నా 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ఇవాళ హైదరాబాద్‌లో 2 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు వెల్లడించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బియ్యం ఎగుమతులపై కేంద్రం మళ్లీ ఆంక్షలు

బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా.. బాస్మతి బియ్యంపైనా (Basmati Rice) చర్యలకు ఉపక్రమించింది. టన్ను ధర 1200 డాలర్లకంటే తక్కువ ధర ఉన్న బియ్యాన్ని ఎగుమతి చెయ్యడంపై నిషేధం విధించింది. బాస్మతి పేరుతో చట్టవిరుద్ధంగా ఇతర బియ్యాన్ని ఎగుమతి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ చర్యలు చేపట్టినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నాకు అధికారం ఇస్తే ఆ సమస్యల్లేకుండా చేస్తా: ఆజాద్‌ హామీ

జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌(Ghulam Nabi Azad) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను స్థాపించిన డెమోక్రటిక్‌ ప్రోగ్రసివ్‌ ఆజాద్‌పార్టీ (DPAP)ని కశ్మీర్‌లో గెలిపిస్తే పర్యాటక రంగాన్ని అభివృద్ధిపై దృష్టిపెట్టి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఆదివారం పుల్వామా జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రహస్య పత్రాలను సేకరించిన మాట వాస్తవమే, కానీ: ఇమ్రాన్‌

అమెరికాలోని (USA) పాక్‌ రాయబార కార్యాలయం నుంచి రహస్య పత్రాలను సేకరించినట్లు ఆ దేశ మాజీ ప్రధాని, పాక్ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (PTI) పార్టీ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) ఒప్పుకున్నారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే, వాటిని పోగొట్టుకున్నానని, ఎక్కడ మర్చిపోయాన్నది గుర్తుకు రావడంలేదని ఆయన చెప్పనట్లు సమాచారం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని