Imran Khan: రహస్య పత్రాలను సేకరించిన మాట వాస్తవమే, కానీ: ఇమ్రాన్‌

అమెరికాలోని పాక్‌ రాయబార కార్యాలయం నుంచి రహస్య పత్రాలను సేకరించినట్లు పాక్‌ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.

Published : 27 Aug 2023 17:49 IST

ఇస్లామాబాద్‌: అమెరికాలోని (USA) పాక్‌ రాయబార కార్యాలయం నుంచి రహస్య పత్రాలను సేకరించినట్లు ఆ దేశ మాజీ ప్రధాని, పాక్ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (PTI) పార్టీ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) ఒప్పుకున్నారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే, వాటిని పోగొట్టుకున్నానని, ఎక్కడ మర్చిపోయాన్నది గుర్తుకు రావడంలేదని ఆయన చెప్పనట్లు సమాచారం. ఇమ్రాన్‌.. అమెరికాలోని పాక్‌ రాయబార కార్యాలయ రహస్య సమాచారాన్ని  బహిర్గతం చేశారన్న అభియోగం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో అధికారిక రహస్యాల చట్టం కింద  అతడిపై అదనపు కేసు నమోదైంది. తోషఖానా కేసులో ప్రస్తుతం అటక్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌ను ఇవాళ ఫెడరల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ)కి చెందిన ముగ్గురు ఉన్నతాధికారులు విచారించారు.

విచారణకు ఇమ్రాన్‌ పూర్తిగా సహకరించినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే, బహిరంగ సభలో తాను ప్రదర్శించిన పత్రాలు అమెరికా దౌత్య కార్యాలయం నుంచి సేకరించినవి కాదని, అవి కేబినెట్‌ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ అని ఆయన అధికారులకు వివరించినట్లు తెలుస్తోంది.ప్రధానిగా కేబినెట్‌ మినిట్స్‌ను తనతోపాటు తీసుకెళ్లే అధికారం తనకుందని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే, ఆ పత్రాలను చూపిస్తూ రహస్య పత్రాలని ఎందుకు చెప్పారన్న ప్రశ్నకు మాత్రం ఆయన మౌనంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈ కేసు నమోదైంది. అభియోగం కోర్టులో రుజువైతే 2 నుంచి 14 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశముంది. కొన్ని కేసుల్లో మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. 

మరోవైపు వివిధ కేసుల్లో ఇరుక్కుపోయిన ఇమ్రాన్‌.. తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ శనివారం దాఖలు చేసిన పిటిషన్లను ఇస్లామాబాద్‌ హైకోర్టు ఇవాళ తిరస్కరించింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని ఆయన సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. అంతకు ముందు మే 9న జరిగిన హింసాత్మక సంఘటనలు, న్యాయస్థానాల సమూహంపై దాడులు, నకిలీ ఖాతాలకు సంబంధించిన కేసుల్లోనూ బెయిల్‌ కోరుతూ అతడి తరఫు న్యాయవాది 9 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిలో ఆరు పిటిషన్లను సెషన్స్‌ కోర్టు తిరస్కరించగా.. మరో మూడు పిటిషన్లను ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం కొట్టివేసింది.

తోషఖానా కేసులో అరెస్టయిన ఇమ్రాన్‌ ఇస్లామాబాద్‌ జిల్లా, సెషన్స్‌ కోర్టు ఆదేశాల మేరకు  ప్రస్తుతం అటక్‌ జైలులో మూడేళ్ల శిక్ష అనుభవిస్తున్నారు. పాక్‌ ప్రముఖులు ఎవరైనా ఉన్నత పదవుల్లో ఉండి విదేశాల నుంచి బహుమతులు అందుకుంటే.. పదవి నుంచి వైదొలగిన తర్వాత వాటిని తోషాఖానాలో జమ చేయాల్సి ఉంటుంది. లేదంటే నిబంధనల ప్రకారం సగం ధర చెల్లించి వాటిని సొంతం చేసుకోవచ్చు. కానీ, ఇమ్రాన్‌ఖాన్‌ మాత్రం చాలా తక్కువ ధర చెల్లించి వాటిని తన వద్దే ఉంచుకున్నారని, మరికొన్నింటిని తోషఖానాకు తెలియకుండా విదేశాల్లోనే అమ్మేశారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా దాదాపు 11.9 కోట్ల పాకిస్థాన్‌ రూపాయల విలువైన బహుమతులను చాలా తక్కువ మొత్తంలో చెల్లించి తీసుకున్నారన్నది అభియోగం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని