Amit Shah: కేసీఆర్‌ పాలనకు నూకలు చెల్లాయి: అమిత్ షా

 రాష్ట్రంలో భారాసకు తామే ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకొస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు అనుగుణంగా సత్తా చాటేలా ఖమ్మం గడ్డ నుంచి శాసనసభ ఎన్నికలకు సమరశంఖం పూరించింది.

Updated : 27 Aug 2023 20:12 IST

ఖమ్మం: కేసీఆర్‌ సర్కారు తిరోగమనం ప్రారంభమైందని.. త్వరలో తెలంగాణలో కమలం వికసిస్తుందని కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారు. రాష్ట్రంలో భారాసకు తామే ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకొస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు అనుగుణంగా సత్తా చాటేలా ఖమ్మం గడ్డ నుంచి శాసనసభ ఎన్నికలకు సమరశంఖం పూరించింది. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన ‘రైతు గోస- భాజపా భరోసా’ భారీ బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భాజపా ఫ్లెక్సీలు, హోర్డింగులు, కటౌట్లతో ఖమ్మం నగరం కాషాయమయంగా మారింది.

ఖమ్మం సభలో అమిత్‌ షా మాట్లాడుతూ... ‘‘కేసీఆర్‌ పాలనకు నూకలు చెల్లాయి. కాంగ్రెస్‌ సోనియా కుటుంబం కోసం, భారాస కల్వకుంట్ల కుటుంబం కోసం చేస్తున్నాయి. భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది. శ్రీరామనవమికి పాలకులు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్‌ విస్మరించారు. కేసీఆర్‌ కారు భద్రాచలం వెళ్తుంది కానీ ఆలయం వరకు వెళ్లదు. కేసీఆర్‌ కారు స్టీరింగ్‌ ఎంఐఎం నేత ఒవైసీ చేతుల్లో ఉంది. కేసీఆర్‌ గారూ.. గుర్తు పెట్టుకోండి. ఇక మీ కారు భద్రాచలం వెళ్లాల్సిన అవసరం లేదు. త్వరలోనే భాజపా సీఎం భద్రాచలం వెళ్లి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఎంఐఎం చేతిలో స్టీరింగ్‌ ఉన్న కారు మనకు కావాలా? తెలంగాణ విమోచనకు పోరాడినా స్వాతంత్ర్య యోధులకు నివాళులర్పిస్తున్నా. హైదరాబాద్‌ విముక్తికి 75 ఏళ్లు నిండాయి. తెలంగాణ అమరవీరుల కలలను కేసీఆర్‌ కల్లలు చేశారు. కేసీఆర్‌, భాజపా ఏకమవుతాయని ఖర్గే అబద్ధాలు చెబుతున్నారు. కేసీఆర్‌ పక్కన ఒవైసీ ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. కేసీఆర్‌, ఒవైసీతో భాజపా కలిసే ప్రసక్తే లేదు. భాజపా..  ఒవైసీతో పాటు వెళ్తుందా? మీరే చెప్పండి. రైతు, దళిత, మహిళా వ్యతిరేక కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సాగనంపాలి’’ అని అమిత్‌ షా అన్నారు.

కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం దండగ అనే పరిస్థితి వచ్చింది: కిషన్‌రెడ్డి

కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం దండుగ అనే పరిస్థితి ఏర్పడిందని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు.  వరి వేయవద్దని కేసీఆర్‌ ప్రభుత్వమే చెబుతోందన్నారు.  రైతులకు వ్యవసాయ సబ్సిడీలు, వ్యవసాయ రుణాలు పావలా వడ్డీకి  ఇవ్వట్లేదన్నారు. ఎన్నికలకు ముందు తూతూ మంత్రంగా రైతు రుణాలు మాఫీ చేస్తున్నారని విమర్శించారు. కల్తీ సీడ్‌ బౌల్‌గా తెలంగాణ మారే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తొమ్మిదేళ్లుగా కేసీఆర్‌ సర్కారు పంటల బీమా పథకం అమలు చేయట్లేదన్నారు. రైతుల ఆత్మహత్యల్లో 75శాతం మంది కౌలురైతులే ఉన్నారని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామన్న కేసీఆర్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు. భాజపాకు అధికారమిస్తే రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం గడ్డ నుంచి రైతులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. రజాకార్ల సమయంలో హిందువులను ఎలా ఊచకోత కోశారో మనకు తెలుసన్న కిషన్‌రెడ్డి .. కాంగ్రెస్‌, భారాస రెండూ కుటుంబ పార్టీలేనని విమర్శించారు. భారాసకు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్టేనని.. భారాస, కాంగ్రెస్‌ దేనికి ఓటేసినా మజ్లిస్‌కు ఓటేసినట్టేనని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని