కోలుకుంటున్న భారత్‌..78శాతం రికవరీ!

దేశంలో కరోనా వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య(రికవరీ రేటు) మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దాదాపు 38లక్షలకు(78శాతం) పైగా కొవిడ్‌ రోగులు వైరస్‌ బారి నుంచి కోలుకున్నారని తెలిపింది.

Published : 15 Sep 2020 18:42 IST

మూడు రాష్ట్రాల్లోనే యాక్టివ్‌ కేసులు అత్యధికం!

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య (రికవరీ రేటు) మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దాదాపు 38లక్షలకు(78శాతం) పైగా కొవిడ్‌ రోగులు వైరస్‌ బారి నుంచి కోలుకున్నారని తెలిపింది. రోజూ దాదాపు 80వేల మంది కోలుకుంటున్నట్లు పేర్కొంది. దిల్లీలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడారు. ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మాట్లాడుతూ.. ‘ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలోనే కరోనా వైరస్‌ బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దేశంలో ఐదులో ఒకటో వంతు మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దాదాపు 14 రాష్ట్రాలు సహా కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5వేల లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. మిగతా 18 రాష్ట్రాల్లో యాక్టివ్‌ కేసులు 5వేల నుంచి 50వేల మధ్యలోనే ఉన్నాయి. కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే 50వేల కన్నా ఎక్కువ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ మూడు రాష్ట్రాల్లోనే 48శాతం క్రియాశీలక కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివ్‌ కేసుల సగటు 8.4శాతం ఉందన్నారు. ఆక్సిజన్‌ సిలిండర్లకు సంబంధించి ఎలాంటి కొరత లేదు. ప్రస్తుతం 6,900 మెట్రిక్‌ టన్నులకు పైగా ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. రాష్ట్రాలు సరైన నిర్వహణ చేపట్టి ఆక్సిజన్‌ను సమయానికి అందుబాటులో ఉండేలా నిర్దారించుకోవాలి’అని తెలిపారు. 

ప్రయోగదశల్లో మూడు వ్యాక్సిన్లు

ఐసీఎంఆర్‌ డీజీ బలరాం భార్గవ మాట్లాడుతూ.. ‘దేశంలో మూడు కొవిడ్‌ వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయి. క్యాడిలా, భారత్‌ బయోటెక్‌ మొదటి దశ ప్రయోగాల్ని పూర్తి చేసుకున్నాయి. సీరం ఇనిస్టిట్యూట్‌ రెండో దశ పూర్తి చేసుకుని (14 ప్రాంతాల్లో 1500 రోగులపై)మూడో దశ అనుమతుల కోసం వేచి చూస్తోంది. వందేళ్ల కింద వివిధ రకాల వైరస్‌లపై పోరాడేందుకు ప్లాస్మా థెరపీని ఉపయోగించారు. ఇప్పుడు కొవిడ్‌పై కూడా ఉపయోగిస్తున్నారు. అది ఎంతవరకు సహాయ పడుతుందనే విషయంపై అధ్యయనం జరుగుతోంది. మనం లాక్‌డౌన్‌ను ప్రభావవంతంగా చేపట్టడం వల్ల మరణాల రేటును తగ్గించగలిగాం’అన్నారు. 

కాగా గడిచిన 24 గంటల్లో 83వేలకు పైగా కొవిడ్‌ కేసులు నమోదు కాగా1,054 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 49లక్షలకు చేరింది. అయితే మరణిస్తున్న కొవిడ్‌ రోగుల్లో 70శాతం ఇతర వ్యాధులు ఉన్నవారేనని ఆరోగ్య శాఖ తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని